Share News

RM Umamaheswara Rao: ఎల్లలకు ఆవల ఉన్న తెలుగు వారి ఆర్తి విందాం

ABN , Publish Date - Jun 06 , 2025 | 05:01 AM

దేశ ఎల్లలకు ఆవల ఉన్న తెలుగువారి ఆర్తిని మనం అర్థం చేసుకోలేకపోతున్నామని రచయిత, ఆంధ్రజ్యోతి అసిస్టెంట్‌ ఎడిటర్‌ ఆర్‌ఎం ఉమామహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు

 RM Umamaheswara Rao: ఎల్లలకు ఆవల ఉన్న తెలుగు వారి ఆర్తి విందాం

  • ఈ నేలతో అనుబంధాన్ని వారు కోరుకుంటున్నారు

  • ‘ఆంధ్రజ్యోతి’ అసిస్టెంట్‌ ఎడిటర్‌ ఉమామహేశ్వరరావు వెల్లడి

  • ‘తెలుగు జాడలు’ పుస్తకంతో తెలుగు సమాజంలో కదలిక: రమేశ్‌

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): దేశ ఎల్లలకు ఆవల ఉన్న తెలుగువారి ఆర్తిని మనం అర్థం చేసుకోలేకపోతున్నామని రచయిత, ఆంధ్రజ్యోతి అసిస్టెంట్‌ ఎడిటర్‌ ఆర్‌ఎం ఉమామహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని లామకాన్‌ వేదికగా గురువారం ‘మరువం’ చర్చా వేదిక ఆధ్వర్యంలో ఆయన రచించిన ‘‘తెలుగు జాడలు’’ పుస్తకంపై చర్చాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందల ఏళ్ల కిందట విదేశాలకు వలస వెళ్లిన తెలుగు వారు తిరిగి ఈ నేలతో ఆత్మీయానుబంధాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. వారి ఆర్తిని తెలుగువారు వినాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘యాస, భాషల్లో మంచీచెడులు ఉండవు. దేన్నీ ఆరాధించాల్సిన అవసరం లేదు. అలాగని అసహ్యించుకోవాల్సిన పని లేదు’’ అని తెలుగు నెరవు నిర్వాహకుడు రమేశ్‌ పేర్కొన్నారు. చర్చాగోష్ఠిలో ఆత్మీయ అతిథిగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతి పెద్ద పది సుదీర్ఘ కథనాల్లో ఏడు తెలుగు భాష, సంస్కృతికి సంబంధించినవి కాగా, మిగతా మూడు స్వీడన్‌, నార్వే దేశాలకు చెందినవని చెప్పారు. తెలుగు జాడలు పుస్తకం.. కళలు, సంస్కృతి పరిరక్షణ పట్ల తెలుగు సమాజంలో ఒక కదలికను తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సుమనస్పతి రెడ్డి సమన్వయంలో సాగిన కార్యక్రమంలో ఇతర దేశాల్లోని తెలుగు వారి వివరాలను సుబ్బారెడ్డి ప్రస్తావించారు. ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో ప్రచురితమైన సమయంలోనే ఈ కథనాలన్నింటినీ తాము ఆసక్తిగా చదివినట్లు కొందరు వక్తలు సభలో చెప్పారు. కార్యక్రమంలో పాత్రికేయులు కె.శ్రీనివాస్‌, వేమన వసంతలక్ష్మి, అల్లం నారాయణ, కట్టా శేఖర్‌ రెడ్డి, దర్శకుడు అంకురం ఉమామహేశ్వరరావు, కుప్పిలి పద్మ, సజయ, ఖదీర్‌ బాబు, అనీల్‌ అట్లూరి, చిలుకూరి ఉమామహేశ్వర శర్మ, కోడూరి విజయ్‌ కుమార్‌, ఒమ్మి రమే్‌షబాబు, పులికొండ సుబ్బాచారి, చందూ శివన్న, రమేష్‌ కార్తీక్‌ నాయక్‌, డీపీ అనూరాధ, పలువురు కవులు, రచయితలు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2025 | 05:02 AM