Family Dispute: ఇద్దరు బావమరుదులను చంపేశాడు
ABN , Publish Date - May 13 , 2025 | 04:43 AM
గూడెంకొత్తవీధి మండలంలో కుటుంబ సభ్యుల మధ్య తగిన వివాదం వల్ల ఇద్దరు బావమరుదులను ఈటెతో పొడిచి చంపాడు. గాయపడిన చిన్నరాజును విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు, గెన్ను పరారీలో ఉన్నాడు.
తమ అక్కను సరిగా చూసుకోవడం లేదని అడిగినందుకు బావ ఘాతుకం
ఈటెతో పొట్ట, ఛాతీ భాగాల్లో పోట్లు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘటన
సీలేరు, మే 12 (ఆంధ్రజ్యోతి): తమ అక్కను ఎందుకు కొడుతున్నావని అడిగినందుకు ఇద్దరు బావమరుదులను ఈటెతో పొడిచి చంపాడో బావ. అడ్డుకోబోయిన మరో వ్యక్తిని కూడా గాయపరిచాడు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలో చోటుచేసుకుంది. కిముడు కృష్ణ (46) ఒడిశాలోని ఇంద్రావతిలో డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. అతని సోదరుడు కిముడు రాజు (36) విశాఖపట్నంలో ఉంటున్నాడు. ఇద్దరూ గూడెంకొత్తవీధి మండలం సీలేరు పంచాయతీ పరిధిలోని అయ్యప్పస్వామి ఆలయం వెనుక గల చింతపల్లి క్యాంపు (జీడీ క్యాంపు)లో నివాసం ఉంటున్న తమ పెద్దమ్మ చనిపోవడంతో అంత్యక్రియల కోసం ఆదివారం సీలేరు వచ్చారు. అంత్యక్రియల అనంతరం కృష్ణ, రాజులను అదే గ్రామంలో నివాసం ఉంటున్న వారి అక్క మణి, బావ వంతల గెన్ను రాత్రి తమ ఇంటికి భోజనానికి పిలిచారు. బావమరుదులు ఇద్దరికీ గెన్ను మందు పార్టీ ఏర్పాటు చేశాడు. కాగా, తమ సోదరిని సరిగా చూసుకోవడం లేదంటూ బావమరుదులు బావతో ఘర్షణకు దిగారు. దీంతో మద్యం మత్తులో ఉన్న గెన్ను ఇంటికి వెళ్లి భార్య మణిని కొట్టాడు. అది చూసి కృష్ణ, రాజు తమ సోదరిని తీసుకెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. దీంతో గెన్ను ఇంట్లో ఉన్న ఈటెను తీసుకొచ్చి కృష్ణ, రాజులను పొట్ట, ఛాతి భాగంలో పొడిచి హత్య చేశాడు. అదే గ్రామానికి చెందిన కిముడు చిన్నరాజు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. అతనిపై కూడా దాడి చేశాడు. చిన్నరాజు చేతికి తీవ్ర గాయం కావడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. హత్య అనంతరం గెన్ను ఈటెతో సహా పరారయ్యాడు. గెన్ను కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. అతనిపై గతంలోనూ ఒక హత్య కేసు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..
Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల
Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ
For AndhraPradesh News And Telugu News