Guntur Jail:కిశోర్‌కు 14 రోజుల రిమాండ్
ABN , Publish Date - May 16 , 2025 | 04:17 AM
పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిశోర్‌కు భూకబ్జా, హత్యాయత్నం కేసులో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ తర్వాత ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
గుంటూరు జిల్లా జైలుకు తరలింపు
మాచర్లటౌన్, మే 15(ఆంధ్రజ్యోతి): భూకబ్జా, హత్యాయత్నం కేసులో పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్, వైసీపీ నేత తురకా కిశోర్‌కు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. తమ ఇంటి స్థలాన్ని తురకా కిశోర్, అతని అనుచరులు కబ్జా చేశారని, చంపేస్తామని బెదిరించారని పట్టణానికి చెందిన చల్లా శివకుమార్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే పలు కేసుల్లో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కిశోర్.. తనపై ఉన్న పీడీ యాక్టును తొలగించాలని అడ్వయిజరీ బోర్డును ఆశ్రయించారు. బోర్డు సూచనల మేరకు ఈ నెల 12న పీడీ యాక్టు కేసు రద్దయి ఆయనకు బెయిల్ మంజూరైంది. అదేరోజు పోలీసులు పీటీ వారంట్ దాఖలు చేశారు. కోర్టు అనుమతి మేరకు గురువారం మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కిశోర్‌ను హాజరుపరిచారు. కిశోర్ తరఫున న్యాయవాది గుంజె వరప్రసాద్, ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవీంద్ర వాదనలు వినిపించారు. అనంతరం న్యాయాధికారి 14 రోజులు రిమాండ్ విధించడంతో కిశోర్‌ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.