TTD Vigilance Probes Misuse: అన్నదానం విరాళాలూ స్వాహా
ABN , Publish Date - Aug 05 , 2025 | 05:41 AM
భక్తులకు అన్నదానం చేయాలంటూ దాతలిచ్చిన విరాళాలను ఇష్టానుసారం తమ జేబుల్లో వేసుకున్న ఘటన ఆలస్యంగా
టీటీడీ విజిలెన్స్ విచారణలో వెలుగులోకి
తిరుమల, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): భక్తులకు అన్నదానం చేయాలంటూ దాతలిచ్చిన విరాళాలను ఇష్టానుసారం తమ జేబుల్లో వేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయంలో కొన్ని నెలలుగా అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి విశేషమైన రోజుల్లో కొందరు దాతలు భక్తులకు అన్నదానం కోసం విరాళాలు ఇస్తుంటారు. అయితే ఈ విరాళాలను పూర్తిస్థాయిలో అన్నప్రసాదాలకు వినియోగించకుండా నొక్కేస్తున్నారంటూ ఇటీవల టీటీడీ దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో నెలన్నర క్రితం టీటీడీ విజిలెన్స్ విభాగం అమరావతికి వెళ్లి అన్నదానం కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించింది. ఎంతమంది విరాళాలు ఇచ్చారు? అన్నదానానికి ఒక రోజుకయ్యే ఖర్చు ఎంత? ఎందరు అన్నప్రసాదాలు తింటున్నారు? వంటి అంశాలపై ఆరా తీశారు. ఈ క్రమం లో కొన్ని అక్రమాలు వెలుగుచూసినట్టు సమాచారం. ముగ్గురు ఎన్‌ఆర్‌ఐ దాతలను ప్రశ్నించగా.. దాదాపు రూ.3.50 లక్షలు విరాళాలు ఇస్తే, రూ.70 వేలు మాత్రమే వినియోగించి అన్నదానం చేసినట్టు తేలింది. క్యాటరింగ్ వ్యక్తులు, అన్నదానం ఇన్‌చార్జ్ ఈ విరాళాలను దారి మళ్లించి తమ కుటుంబ సభ్యుల ఖాతాలో వేయించుకున్నట్టు విజిలెన్స్ విచారణలో తేలినట్టు సమాచారం. గతంలోనూ ఇదే తరహా అక్రమాలు జరిగి ఉండవచ్చనే నివేదికను ఇటీవల టీటీడీ ఉన్నతాధికారులకు అందజేసినట్టు తెలిసింది.