TTD: క్యూలైన్‌లో నినాదాలపై టీటీడీ సీరియస్
ABN , Publish Date - Jun 01 , 2025 | 03:50 AM
తిరుమల క్యూలైన్‌లో భక్తుల నినాదాల కారణంగా టీటీడీ దృష్టి సారించింది. నినాదాలు చేసిన వ్యక్తి క్షమాపణలు కోరగా, టీటీడీ అధికారులు క్యూలైన్ సౌకర్యాలు మరింత మెరుగుపరుస్తామని తెలిపారు.
భక్తుడిపై బైండోవర్ కేసు
వీడియోలు తీసేవారిపై చట్టపరమైన చర్యలు: టీటీడీ అదనపు ఈవో
క్షమించమంటూ భక్తుడి వీడియో
తిరుమల, మే31(ఆంధ్రజ్యోతి): తిరుమల క్యూలైన్‌లో భక్తులు అసహనంతో నినాదాలు చేసిన అంశాన్ని టీటీడీ తీవ్రంగా పరిగణించింది. ‘టీటీడీ చైర్మన్ డౌన్‌డౌన్, భక్తులకు సౌకర్యాలు కల్పించాలి, పసిపాపలకు పాలు అందించాలి, ఆడవాళ్లకు ప్రత్యేక దర్శనం చేయించాలి, అధికారులు రావాలి, భక్తులను కాపాడాలి’ అంటూ క్యూలైన్‌లో శుక్రవారం రాత్రి పదిన్నర సమయంలో ఒక భక్తుడు నినాదాలు చేస్తుండగా మిగిలిన భక్తులు గొంతు కలుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన విషయం విదితమే. ఈ సంఘటనకు కారకుడు అని గుర్తించిన వ్యక్తిపై తిరుమల టూటౌన్ పోలీస్టేషన్‌లో బైండోవర్ కేసు నమోదు చేశారు. కాగా, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తిరుమలలోని సర్వదర్శన క్యూలైన్లను అధికారులతో కలిసి శనివారం తనిఖీ చేశారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కొందరు భక్తులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీటీడీ సిబ్బంది కృషిని పట్టించుకోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కొందరు ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. కొందరు అనధికార వ్యక్తులు దర్శన క్యూలైన్లలో భక్తులను రెచ్చగొడుతూ వీడియోలు చిత్రీకరిస్తున్నారని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నినాదాలు చేసిన వ్యక్తి తన తప్పును గ్రహించి క్షమాపణలు కోరారని తెలిపారు. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రతిరోజూ లక్షకుపైగా భక్తులు దర్శనానికి వస్తున్నారని, వారాంతాల్లో ఈ సంఖ్య 1.20 లక్షలకు చేరుకుటోందన్నారు. వీఐపీ బ్రేక్, శ్రీవాణి దర్శనాలను తగ్గించి సాధారణ భక్తులకే పెద్ద వేస్తున్నామన్నారు. క్యూలైన్లలోని భక్తులకు శ్రీవారిసేవకుల ద్వారా నిరంతరాయంగా అన్నప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, మజ్జిగ, స్నాక్స్ పంపిణీ చేస్తున్నామని అదనపు ఈవో వెంకయ్య చౌదరి వివరించారు.
క్షమించండి.. తప్పు చేశా: భక్తుడు అచ్చారావు
శుక్రవారం రాత్రి నినాదాలు చేసిన కాకినాడకు చెందిన అచ్చారావు ఓ వీడియో ద్వారా టీటీడీకి క్షమాపణలు చెప్పారు. ‘ఉదయం నుంచి జ్వరంగా ఉంది. టీటీడీ అందజేస్తున్న సాంబారన్నం తినడం ఇష్టం లేక, దర్శనం ఎప్పుడు అవుతుందో తెలీక త్వరగా దర్శనం చేయిస్తారనే ఉద్దేశంతో నినాదాలు చేశాను. నిజానికి టీటీడీ సిబ్బంది నిరంతరాయంగా అన్నప్రసాదాలు, పాలు అందజేశారు. చాలా తప్పుగా మాట్లాడానని అర్థమైంది. నా తప్పును తెలుసుకున్నాను. అహర్నిశలు భక్తుల కోసం శ్రమిస్తున్న టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో, సిబ్బందిని ఈ ఘటనలోకి తీసుకువచ్చినందుకు క్షమించమని కోరుతున్నా. ఈ పొరపాటును మన్నించాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అంటూ శనివారం దర్శనం అనంతరం వీడి యో ద్వారా తెలిపారు.
ఇది వైసీపీ కుట్ర: భానుప్రకాశ్, కిరణ్ రాయల్
కాగా, క్యూలైన్‌లోని భక్తులను రెచ్చగొట్టడం వెనుక వైసీపీ కుట్ర ఉందని టీటీడీ బోర్డు సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. సెంట్‌మెంట్‌ను అడ్డుపెట్టుకుని అధికారపార్టీని అల్లరి చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అసత్యప్రచారాలు చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. చట్టంలో మార్పులు తీసుకువచ్చేలా రానున్న టీటీడీ బోర్డు సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. ఇది వైసీపీ చేసిన కుట్రే అని జనసేన నేత కిరణ్‌రాయల్ వ్యాఖ్యానించారు. క్యూలో నినాదాలు చేసిన వ్యక్తి వైసీపీ కార్యకర్త అని తెలిపారు. దీనిని వీడియోరికార్డు చేయించి సోషల్‌మీడియాలో వైరల్ చేయడం వెనుక వైసీపీ ఉందన్నారు.
ఇవి కూడా చదవండి
శ్రీకాంత్ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు
కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు
Read Latest AP News And Telugu News