TTD chairman BR Naidu: గోవుల గడ్డీ తిన్నారు
ABN , Publish Date - Apr 20 , 2025 | 06:03 AM
తిరుపతిలోని టీటీడీ గోశాలలో గోవులకు సరిగా గడ్డి, దాణా అందకపోవడమే కాకుండా అవినీతిపరులు వాటిని ఒంగోలుకు అమ్మినట్టు ఆరోపణలు ఉన్నాయి. మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డిపై పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తగా, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఏసీబీ విచారణకు సీఎం అనుమతి కోరనున్నట్లు తెలిపారు
గోశాలలోని ఆవులను ఒంగోలులో అమ్మారు
మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డి అక్రమాలు ఎన్నో
టీటీడీ, గోశాలలోని అవినీతిపై ఏసీబీ విచారణకు సీఎంను కోరుతాం: టీటీడీ చైర్మన్
తిరుపతి(టీటీడీ), ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్లలో తిరుపతిలోని ఎస్వీ గోశాలలో గోవులకు పెట్టే గడ్డిని సైతం తినేశారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. వారం రోజులుగా కొందరు మీడియాలో, సోషల్ మీడియాలో గోశాలపై పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. శనివారం గోశాలను ఆయన సందర్శించారు. గోవులను పరిశీలించి వాటికి అందిస్తున్న దాణా, నీరు తదితర విషయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 2022-2024 నడుమ రెండేళ్ల పాటు టీటీడీ గోసంరక్షణ సభ్యుడిగా ఉన్న కోటి శ్రీధర్‌ను సంప్రదించామని, ఆయన చెప్పిన విషయాలు విస్తుపోయేలా ఉన్నాయని అన్నారు. గోశాలలోని గోవులను ఒంగోలులో అమ్మారని, అడగడానికి శ్రీధర్ వస్తే అప్పటి గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డి కనీసం అనుమతి కూడా ఇవ్వలేదని చెప్పారు. కోర్టులో పిల్ దాఖలు చేస్తామని బెదిరింపులు వస్తున్నాయని, దీనితో పాటు గత ఐదేళ్ల కాలంలో స్వామివారి నిధుల అవకతవకలపై కూడా పిల్ వేయాలన్నారు. గతంలో పింక్ డైమండ్‌పై కోర్టులో కేసు వేశారని, ఆ కేసు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ 10 నెలల కాలంలో టీటీడీలో ఎలాంటి అవినీతి జరగలేదని హామీ ఇస్తానన్నారు. గోశాల డైరెక్టర్‌గా పనిచేసిన హరినాథరెడ్డి అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. టీటీడీ, గోశాలలో జరిగిన అవినీతి, అక్రమాలపై సీఎంను కలిసి ఏసీబీ విచారణ చేయాలని కోరనున్నట్లు వెల్లడించారు.
జనతా పార్టీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి వాఖ్యలపై స్పందిస్తూ.. టీటీడీ అంటే ఒంటికాలుపై వచ్చే ఆయన కేసు వేస్తామంటున్నారని, గత ఐదేళ్లలో టీటీడీలో జరిగిన అవినీతిపై కూడా కేసు వేయాలని డిమాండ్ చేశారు. టీటీడీలో మొదటి విడత అన్యమతస్తులపై చర్యలు ప్రారంభించామని, త్వరలో మరికొందరిపై చర్యలుంటాయని తెలిపారు. ఆలిండియా గో రక్షక్ దళ్ వ్యవస్థాపకుడు కోటి శ్రీధర్ మాట్లాడుతూ.. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తనను గోశాల గోసంరక్షణ కోసం రెండేళ్ల వ్యవధితో నియమించారన్నారు. అప్పట్లోనే హరినాథరెడ్డి గోశాలలోకి ఎవరినీ రానివ్వకుండా చేశారన్నారు. రూ.5 కోట్ల విలువైన గడ్డి కొని రూ.8 కోట్ల వరకూ బిల్లులు పెట్టారని, మందులతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి కొనుగోలు చేసిన గోవుల్లో భారీ అవినీతి చేశారని, ఈ విషయాన్ని వైవీ సుబ్బారెడ్డికి కూడా చెప్పినట్లు వివరించారు. గోశాలలో దూడలకు లెక్కలు లేవని ఆరోపించారు. గోవులు రకరకాల కారణాలతో మరణిస్తుంటాయని, దానిని రాజకీయం చేయడం మంచిది కాదన్నారు. టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి, శాంతారాం, నరేష్ కుమార్, గో రక్షక్ దళ్ అధ్యక్షుడు కాలు సింగ్, గోశాల ఇన్‌చార్జి డైరెక్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.