TTD Donation Management: గోవిందుడి ఖజానా మరింత భద్రం
ABN , Publish Date - Apr 19 , 2025 | 05:58 AM
టీటీడీ భక్తుల సమర్పించే కానుకల డిపాజిట్లపై ప్రత్యేక దృష్టి సారించి, వడ్డీ ఆదాయాన్ని పెంచే దిశగా కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ ప్రాజెక్టులో ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకుల్లో డిపాజిట్లు కొనసాగించాలన్న నిర్ణయం తీసుకున్నది

భక్తులు సమర్పించే కానుకల డిపాజిట్లపై టీటీడీ దృష్టి
వడ్డీ ఆదాయాన్ని మరింత పెంచే దిశగా ప్రణాళికలు
(తిరుమల-ఆంధ్రజ్యోతి)
శ్రీవారి భక్తులు హుండీలో సమర్పించే కానుకల డిపాజిట్లపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. స్వామి సొమ్ముకు భద్రతతో పాటు ఆదాయంపై కూడా శ్రద్ధ వహిస్తోంది. ఈ విషయమై నియమించిన ‘ఇన్వెస్ట్మెంట్ ఎక్స్‌పర్ట్ కమిటీ’ చేసిన కీలక ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకుని గోవిందుడి ఖజానాను మరింత పెంచే దిశగా అడుగులు వేస్తోంది. స్వామివారిని దర్శించుకునే భక్తులు తమ స్థాయిని బట్టి హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు. హుండీలో నగదుతో పాటు బంగారం, వెండి కూడా అందుతుంటుంది. గతేడాది ఏప్రిల్ నాటి లెక్కల ప్రకారం వివిధ బ్యాంకుల్లో టీటీడీ బంగారు డిపాజిట్లు 11,329 కేజీల వరకు ఉన్నాయి. వీటి విలువ రూ.8,496 కోట్లు ఉండవచ్చని అంచనా. ఇక నగదు ఫిక్సిడ్ డిపాజిట్లు రూ.18వేల కోట్లకు చేరాయి. బంగారు, నగదు డిపాజిట్ల ద్వారా 2024-25 వార్షిక సంవత్సరానికి రూ.1,253 కోట్ల వడ్డీ లభించినట్టు టీటీడీ బడ్జెట్‌లోనూ పొందుపరిచింది.
డిపాజిట్ల భద్రతపై చైర్మన్, ఈవో ఆరా
ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న శ్రీవారి డిపాజిట్లపై టీటీడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. వాటి భద్రతపై చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు ఆరా తీశారు. ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు తిరిగి తీసుకుని ప్రభుత్వ బ్యాంకుల్లో డిపాజిట్లు చేయగలమా? ఇందులో ఇబ్బందులు ఉన్నాయా? అనే అంశాలపై అధ్యయనం చేయాలని గతేడాది నవంబరులో జరిగిన బోర్డు సమావేశంలో తీర్మానం చేశారు. ‘పబ్లిక్ సెక్టార్ బ్యాంక్- ఓన్లీ పాలసీ’ విధానంపై మాజీ ఎన్నికల కమిషనర్, టీటీడీ ఈవోగానూ పనిచేసిన నిమ్మగడ్డ రమేశ్‌తో పాటు ఆర్‌బీఐ రిటైర్డ్ డిప్యూటీ గవర్నర్ గాంధీ, చెన్నై ఇండియన్ బ్యాంక్ రిటైర్డ్ చైర్మన్ సుందరరాజన్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ పటియాలా రిటైర్డ్ ఎండీ రమేశ్‌తో నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ గతేడాది చివర్లో నివేదిక సమర్పించింది.
నిపుణుల కమిటీ ఏం చెప్పిందంటే...
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేయాలని భావిస్తే వడ్డీ రేట్లు కోల్పోవాల్సి వస్తుందని, కొన్ని ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే వడ్డీ తక్కువ కాబట్టి మంచి ఫలితాలు రాకపోవచ్చని కమిటీ పేర్కొంది. ప్రస్తుతం ప్రైవేట్ బ్యాంకులైనా, పబ్లిక్ బ్యాంకులైనా ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగానే పనిచేస్తున్న క్రమంలో భద్రత విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దేవదాయ చట్టాలు కూడా ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చని చెబుతున్న అంశాలను ప్రస్తావించింది. ప్రభుత్వ బ్యాంకుల్లోనే పెట్టుబడులు పెట్టాలని భావిస్తే తక్షణమే ప్రైవేట్ బ్యాంకుల్లో చేసే డిపాజిట్లను నిలిపివేయాలని సూచించింది. ఇప్పటికే ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న పెట్టుబడులను నిర్ణీత వ్యవధి పూర్తయ్యాకే విత్‌డ్రా చేయాలని, వడ్డీ నష్టం నివారించవచ్చని అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లోనే కాకుండా కేంద్ర సక్యూరిటీల్లో కూడా పెట్టుబడులు పెడితే లాభాలొస్తాయని, ఏటా కార్పస్ ఫండ్‌ను విత్‌డ్రా చేసుకుని మళ్లీ వేరే బ్యాంకుల్లో పెట్టేబదులు 3, 4, 6 ఏళ్లకు ప్రభుత్వ బ్యాంకుల్లో లాంగ్‌టర్మ్ పెట్టుబడులు పెడితే ఎక్కువ వడ్డీ వస్తుందని తెలిపింది. ప్రైవేట్ బ్యాంకులు అందించే పేమెంట్ గేట్‌వే, ఆన్‌లైన్ డొనేషన్ కలెక్షన్లు, క్యాష్ మేనేజ్మెంట్ వంటి సర్వీసులను టీటీడీ వినియోగించుకోవాలని సూచించింది. అలాగే బంగారాన్ని 12 ఏళ్లకు డిపాజిట్ చేసి లాక్ చేయకుండా ఐదారేళ్లకు బ్యాంకులతో అగ్రిమెంట్ చేసుకోవాలంటూ పలు కీలక అభిప్రాయాలు, సూచనలు చేసింది. కమిటీ సూచనల మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్లను కొనసాగించాలని టీటీడీ తాజాగా నిర్ణయం తీసుకుంది. అయితే కమిటీ సిఫారసుల ఆధారంగా భక్తులు ఎంతో భక్తితో సమర్పించే కానుకలను సరైన పద్ధతిలో భద్రంగా పొదుపు చేయడంతో పాటు వడ్డీ ద్వారా ఆదాయాన్నీ కూడా పెంచే దిశగా ప్రణాళికలు రూపొందించుకుంటోంది. త్వరలో మరో భేటీ ఏర్పాటు చేసి డిపాజిట్ల భద్రతపై మరికొన్ని నిర్ణయాలు తీసుకోనుంది.