Tractor Scam: ఏడేళ్లుగా తీరని వ్యథ
ABN , Publish Date - Jul 17 , 2025 | 03:37 AM
ఇవ్వాల్సిన మోడల్ ఇవ్వకపోగా, అధిక ధర వసూలు చేసిన కంపెనీ నుంచి తమ డబ్బులు ఇప్పించాలని రైతు రథం లబ్ధిదారులు ఏడేళ్లుగా ఏపీ ఆగ్రోస్ చుట్టూ తిరుగుతున్నారు.
ట్రాక్టర్ మోడల్ మార్చి... అధిక ధర వసూలు చేసిన కంపెనీ
‘రైతు రథం’ లబ్ధిదారులకు టోకరా
అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): ఇవ్వాల్సిన మోడల్ ఇవ్వకపోగా, అధిక ధర వసూలు చేసిన కంపెనీ నుంచి తమ డబ్బులు ఇప్పించాలని రైతు రథం లబ్ధిదారులు ఏడేళ్లుగా ఏపీ ఆగ్రోస్ చుట్టూ తిరుగుతున్నారు. 2017-18లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రైతు రథం కింద వేలాది మంది రైతులకు రాయితీపై ట్రాక్టర్లు పంపిణీ చేసింది. అప్పట్లో ఓ కంపెనీ 81మంది రైతులకు ఎల్4508 ఆల్ రౌండర్ మోడల్ ట్రాక్టర్లు సరఫరా చేయడానికి ఆగ్రోస్‌తో ఒప్పందం చేసుకుంది. కానీ 14508 మోడల్ ట్రాక్టర్లను సరఫరా చేసింది. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.83,137 అధికంగా వసూలు చేసిందని అప్పట్లోనే రైతులు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆగ్రోస్ కమిటీ వేసి, రైతుల ఆరోపణలు నిజమని తేల్చింది. సదరు కంపెనీకి నోటీసు జారీ చేసింది. అయితే ఓ అధికారి వత్తాసు పలకడంతో సదరు కంపెనీ రైతులకు అదనపు సొమ్ము తిరిగి చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. గత ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. ఒప్పందాన్ని ఉల్లంఘించి, మోడల్ మార్చి, అధిక ధర వసూలు చేసినందుకు గత ఫిబ్రవరిలో సదరు కంపెనీని ఆగ్రోస్ బ్లాక్ లిస్టులో పెట్టింది. అయినా తమకు న్యాయం జరగలేదని రైతులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు కొందరు రైతులు వినతిపత్రాన్నిఅందజేశారు.