Heavy Rain: కుంభవృష్టి
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:21 AM
కుండపోత వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వానలు దంచికొడుతున్నాయి. ..
చిగురుటాకులా వణికిన కోస్తా జిల్లాలు
బెజవాడ, గుంటూరులో ఏకధాటిగా కుండపోత.. చుండూరులో అత్యధికంగా 27 సెంటీమీటర్ల వర్షం.. నదులను తలపించిన జాతీయ రహదారులు
కాజ టోల్‌ప్లాజా వద్ద మునిగిన ఎన్‌హెచ్-16.. రాకపోకలకు తీవ్ర అంతరాయం
పొంగిపొర్లుతున్న వాగులు, డ్రెయిన్లు.. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద
నిండుగా ప్రవహిస్తున్న బుడమేరు.. పొలాల్లోనే మునిగిన రైతుల పంట కలలు
చెరువులకు గండి.. వేల ఎకరాలు మునక.. మరో 2 రోజులు భారీ వర్షాలు: ఐఎండీ
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): కుండపోత వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వానలు దంచికొడుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి, బుధవారం ఏకధాటిగా కొన్నిగంటలపాటు పడిన భారీవర్షాలతో కోస్తాంధ్ర చిగురుటాకులా వణికిపోయింది. విజయవాడ, గుంటూరు పరిధిలోని జాతీయ రహదారులు నదులను తలపించాయి. పంట కలలను మోస్తున్న పొలాలు మునిగిపోవడం చూసి రైతుల గుండె చెరువవుతోంది. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వచ్చి చేరుతుండగా, పొంగి పొర్లుతున్న వాగులు, డ్రెయిన్లు భయపెడుతున్నాయి. బుడమేరు వాగు మళ్లీ పొంగుతుందంటూ.. వచ్చిన వార్తలతో కృష్ణానది పరిసర ప్రాంతాలు ఉలిక్కిపడ్డాయి. సరిగ్గా ఏడాది క్రితం ఆగస్టులోనే బుడమేరు సృష్టించిన విలయం గుర్తు చేసుకుని బెజవాడ వాసులకు కన్నులపై కునుకు కరువైంది. అయితే, ప్రమాదం లేదని, వదంతులు నమ్మవద్దని అధికారులు వెల్లడించారు. రోడ్లపై మోకాలులోతున నీరు చేరుకున్న వేళ మ్యాన్‌హోల్స్ మృత్యువుగా నోళ్లు తెరిచాయి. విజయవాడలో మ్యాన్‌హోల్‌లో పడి ఒకరు మృత్యువాతపడ్డారు. జాతీయ రహదారిపై కాజా టోల్ ప్లాజా సమీపంలో నంబూరులో వాగులో పడి ఓ బాలుడు గల్లంతయ్యాడు. కొద్దిసేపటికే విగతజీవిగా మారాడు. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో గురువారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. బాపట్ల జిల్లా చుండూరులో 24 గంటల్లో 27 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది.


భయపెడుతున్న వాగులు
ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద చేరుతోంది. ఇప్పటి వరకు లక్ష క్యూసెక్కుల వరకు వచ్చిన ఇన్‌ఫ్లో బుధవారం ఒక్కసారిగా పెరిగింది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో మూడుగేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. నాగులుప్పలపాడు మండలం కొత్తకోట వాగు, ఒంగోలు రూరల్ మండలంలోని ముదిగండి వాగు, దోర్నాల మండలంలోని దొంగల వాగు పొంగడంతో ఆవైపు రాకపోకలు నిలిచిపోయాయి. నంద్యాల జిల్లా చాగలమర్రిలో కుందూనది ఉగ్రరూపం దాల్చింది. చాగలమర్రిలోని ఆనకట్టను దాటి కుందూనది ప్రవహించింది. రాయలసీమలోని కర్నూలు, నంద్యాల జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కుండపోతగా వర్షాలు పడ్డాయి.
పంట కల మునక..
వేల ఎకరాల్లో పంటలు ముంపు బారిన పడ్డాయి. నందికొట్కూరు మండలంలో చెరువుకు గండిపడటంతో వంద ఎకరాల్లో మొక్కజొన్న పంట నీట మునిగింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని బుడమేరు, వెలగలేరు, కొండవీటివాగు, పాలవాగు, కొటేళ్లవాగు, ఎద్దువాగు, పీలేరు వాగు, సత్రం వాగు ప్రవాహాల ఉధృతితో ఆయా ప్రాంతా ల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మరోవైపు కృష్ణానదికి ఎగువ నుంచి వరద వస్తుండటంతో లంక గ్రామాల్లో ఉద్యాన, కూరగాయ పంటలు నీటి ముంపులో ఉన్నాయి. రుద్రవరం మండలంలోని శ్రీరంగాపురంలో భారీ వర్షాలకు ఓ మట్టిమిద్దె కూలి మహిళకు గాయాలయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించారు.

ఎందుకు ఇంత ముప్పు?
ప్రకాశం బ్యారేజీకి వరద పెరగడంతో ఇరిగేషన్‌శాఖ అధికారులు బందరు, ఏలూరు, రైవస్ కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే, విజయవాడలో కురిసిన వర్షం అంతా స్ర్టామ్‌వాటర్ డ్రెయిన్స్, అవుట్‌ఫాల్ డ్రైయిన్‌ల ద్వారా ఈ ప్రధాన కాల్వలలోకి కలుస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కాల్వల్లోకి బ్యారేజీ నీటిని ముందు నుంచీ తగ్గించుకుంటూ రావాలి. కానీ, ఆ పనిని అధికారులు చేయకపోవడంతో నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది.