Tirumala Rush: తిరుమల కిటకిట
ABN , Publish Date - Apr 20 , 2025 | 04:04 AM
తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు, పరీక్ష ఫలితాల నేపథ్యంలో 18 గంటల పాటు దర్శన సమయం పడుతున్నట్లు తెలుస్తోంది
వారాంతం, పరీక్ష ఫలితాల నేపథ్యంలో పెరిగిన రద్దీ
తిరుమల, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు, వివిధ పరీక్షల ఫలితాల వెల్లడితో పాటు వారాంతం కావడంతో ఉదయం నుంచి భక్తుల రాక పెరిగింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లతో పాటు నారాయణగిరిలోని నాలుగు షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయారు. వీరికి దాదాపు 18 గంటల దర్శన సమయం పడుతోంది. ఇక స్లాటెడ్ టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులకు కూడా మూడు నుంచి నాలుగు గంటల దర్శన సమయం పడుతోంది. రద్దీ పెరిగిన క్రమంలో గదులకు డిమాండ్ పెరిగింది. గదుల కోసం భక్తులు రెండుమూడు గంటల క్యూలైన్లలో నిరీక్షించాల్సి వస్తోంది. తలనీలాలు సమర్పించే కల్యాణకట్టలు కూడా రద్దీగా మారాయి. భక్తుల రాక పెరిగిన క్రమంలో శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, అఖిలాండం, లడ్డూ కేంద్రం, అన్నప్రసాద భవనం కిటకిటలాడుతున్నాయి. ఆదివారం కూడా రద్దీ కొనసాగే అవకాశముంది.