AP COVID-19: కరోనాతో భద్రం..
ABN , Publish Date - May 31 , 2025 | 04:19 AM
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అక్కడక్కడా నమోదవుతున్నా తీవ్రత తక్కువగా ఉంది. ఒమైక్రాన్ వేరియంట్ వల్ల సాధారణ లక్షణాలు మాత్రమే కనిపిస్తుండగా, ప్రభుత్వం ముందస్తుగా ఐసోలేషన్ వార్డులు, వైద్య సదుపాయాలు సిద్ధం చేస్తోంది.
ప్రమాదకరం కాదు కానీ.. నిర్లక్ష్యం పనికిరాదు
ఐదేళ్ల క్రితం అందరినీ గడగడలాడించిన కరోనా వైరస్ మళ్లీ మెల్లగా విజృంభిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు నమోదవడం ఆందోళన రేపుతోంది..! రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ.. ఏరోజు ఎలా మారుతుందో చెప్పలేని పరిస్థితి..! ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సిద్ధమవుతోంది.
రాష్ట్రంలో అక్కడక్కడా కొవిడ్ కేసులు నమోదు
టెస్ట్ చేస్తున్న వారిలో 5-7 శాతం మందికే పాజిటివ్
వెలుగుచూస్తున్న కేసుల్లో ఒమైక్రాన్ వేరియంట్
ప్రమాదకరం కాదంటున్న మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్
అయినా కొవిడ్ మార్గదర్శకాలు పాటించాలి: వైద్య నిపుణులు
ఆస్పత్రుల్లో ఐసొలేషన్ వార్డులు.. కొవిడ్‌పై ప్రత్యేక పర్యవేక్షణ
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో అక్కడక్కడా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కానీ.. 2020లో ఫస్ట్‌వేవ్.., 2021లో సెకండ్ వేవ్‌లో నమోదైనంత స్థాయిలో కేసులు లేవు. ప్రస్తుతం కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్న వారిలో 5 నుంచి 7 శాతం మాత్రమే పాజిటివ్‌గా తేలుతున్నాయి. ఎవరికీ ప్రాణాపాయ పరిస్థితి లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటివరకూ ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో కొవిడ్‌తో ఒకరు మరణించినట్టు వార్తలొచ్చినా ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం వాటిని కొట్టిపారేశారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో తీవ్రత అంతగా ఉండడం లేదు. పైగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన నాలుగైదు రోజుల్లోనే బాధితులు కోలుకుంటున్నారు. ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో.. జ్వరం, జలుబు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయి. జ్వరం తీవ్రంగా ఉన్నవారు మాత్రం కాస్త ఇబ్బంది

పడుతున్నారు. అయితే గతంలో మాదిరిగా ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం, ఆయాసం, తీవ్రంగా నీరసించిపోవడం వంటి లక్షణాలు లేవు. దీంతో వైద్యులు ఎక్కువ మందికి మందులిచ్చి పంపించి వేస్తున్నారు. జ్వరం ఎక్కువగా ఉన్న వారిని మాత్రం 24 గంటల పర్యవేక్షణలో ఉంచుతున్నారు. అంతేతప్ప ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం రావడం లేదు. అలా అని నిర్లక్ష్యంగా ఉండడం సరికాదని వైద్యులు చెబుతున్నారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో ఇప్పుడు కూడా అలాగే ఉండాలని సూచిస్తున్నారు. ప్రతిఒక్కరూ కచ్చితంగా మాస్క్ ధరించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, సామాజిక దూరం పాటించాలని చెబుతున్నారు. అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయరాదని, ఫంక్షన్లకు హాజరు కావొద్దని సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
ఒమైక్రాన్ వేరియంట్...
కొవిడ్ ప్రారంభం దశలో డెల్టా వేరియంట్ ఎక్కువగా కనిపించింది. దీనివల్లే ఫస్ట్, సెకండ్ వేవ్‌ల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి, తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడడంతో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు డెల్టా వేరియంట్ ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం ఒమైక్రాన్ వేరియంట్ మాత్రమే కనిపిస్తోంది. దీనివల్ల స్వల్ప జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు ప్రస్తుతం కొవిడ్ ఎండెమిక్ దశకు వచ్చేసింది. పాండమిక్ (మహమ్మారి)గా ప్రకటించిన వ్యాధి.. క్రమంగా ప్రభావం కోల్పోవడాన్నే ఎండెమిక్ దశ అంటా రు. ఇది ఎంతకాలమైనా కొనసాగవచ్చు. కానీ.. ప్రభావం మాత్రం తక్కువే ఉంటుంది. పైగా ఒమైక్రాన్ వేరియంట్‌కు సంబంధించిన యాంటీబాడీస్ శరీరంలో ఇప్పటికే ఏర్పడి ఉంటాయి. కాబట్టి కేసులు భారీగా నమోదయ్యే పరిస్థితి ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆస్పత్రుల్లో బెడ్స్ సిద్ధం..
కరోనా తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా పూర్తి ఏర్పాట్లు చేస్తోంది. దేనికైనా సిద్ధంగా ఉండాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు ప్రతి బోధనాస్పత్రిలోనూ పది పడకలతో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. ఎక్కడ కొవిడ్ కేసు నమోదైనా వెంటనే వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించి, వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశాఖ ప్రత్యేక పర్యవేక్షణ టీమ్‌లను కూడా ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితి వస్తే ఇబ్బంది లేకుండా మందులు, పీపీఈ కిట్లు, మాస్క్‌లతో పాటు ఆక్సిజన్‌ను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. బాధితుల నుంచి శాంపిల్స్ సేకరించి.. వేరియంట్‌ను తెలుసుకునేందుకు సీక్వెన్సింగ్ టెస్ట్‌లు చేస్తున్నారు. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేసిన కొవిడ్ టెస్టులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదు. కేవలం బోధనాస్పత్రుల్లో ఉన్న ఐసీఎంఆర్ ల్యాబ్స్‌లో మాత్రమే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అక్కడ పాజిటివ్‌గా తేలితేనే ప్రభుత్వం కొవిడ్ కేసుగా నిర్ధారిస్తోంది. కాబట్టి లక్షణాలున్న వారు బోధనాస్పత్రుల్లోనే నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.
మరో మూడు కరోనా కేసులు
గుంటూరు మెడికల్, విజయవాడ, మే 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా తెనాలి, ఉండవల్లిలో ఇద్దరికి కరోనా సోకినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ విజయలక్ష్మీ శుక్రవారం ప్రకటించారు. జిల్లాలో కొవిడ్ భయం నేపథ్యంలో జిల్లాలో రిటైల్ మెడికల్ దుకాణాల్లో మాస్కులు, శానిటైజర్ల అమ్మకాలు పెరిగాయి. గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలో కొవిడ్ రోగుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ కే విజయలక్ష్మీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వికి లేఖ రాశారు.
హౌస్‌సర్జన్‌కు కరోనా.. 24 గంటల్లో మళ్లీ నెగిటివ్
విజయవాడలో తొలి కరోనా కేసు నమోదైంది. ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న మహిళా హౌస్‌సర్జన్‌లో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. జార్ఖండ్‌కు చెందిన ఆమె సిద్ధార్థ వైద్య కళాశాలలో మైక్రోబయాలజీ చదివి.. ప్రస్తుతం ఇక్కడే హౌస్‌సర్జన్‌గా పనిచేస్తూ హాస్టల్‌లో ఉంటోంది. కొద్దిరోజుల క్రితం ఆమె జార్ఖండ్ వెళ్లి.. 27వ తేదీ రాత్రి విజయవాడకు వచ్చింది. 28న ఆమెకు జ్వరం రావడంతో పరీక్షలు చేయగా కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వైద్యులు ఆమెను ఐసొలేషన్ వార్డుకు తరలించారు. శుక్రవారం ఆమెకు మళ్లీ పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు.
ప్రస్తుతం ప్రమాదమేమీ లేదు
ప్రస్తుతం కొవిడ్ ప్రమాదకర స్థాయిలో లేదు. రెండు మూడు కేసులు పరీక్షిస్తే ఒమైక్రాన్ వేరియంట్‌గా నిర్ధారణ అయింది. ఈ వేరియంట్ వల్ల పెద్ద ప్రమాదమేమీ లేదు. అయినా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. బోధనాస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డుతో పాటు మందులు, పీపీఈ కిట్స్, ఆక్సిజన్ సిద్ధం చేసుకుంటున్నాం. రాష్ట్రంలో కొవిడ్ కేసులపై ప్రత్యేక నిఘా ఉంచాం .
- డాక్టర్ డీఎ్‌సవీఎల్ నరసింహం;
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్
నిర్లక్ష్యంగా ఉండొద్దు
కొవిడ్ కొత్త వేరియంట్ పెద్ద ప్రమాదకరంగా లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదువుతున్న కేసుల్లో సాధారణ లక్షణాలు మాత్రమే ఉంటున్నాయి. బాధితులు నాలుగైదు రోజుల్లో కోలుకుంటున్నారు. కొవిడ్ లక్షణాలున్న వారు కచ్చితంగా హోంఐసోలేషన్‌లో ఉండాలి. ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం చేయకుండా కొవిడ్ మార్గరద్శకాలు పాటించాలి. మాస్క్ ధరించడం, పరిశుభ్రంగా ఉండడం, సామాజిక దూరం పాటించడం చాలా ముఖ్యం. - డాక్టర్ పద్మ మొవ్వ;
మేనేజింగ్ డైరెక్టర్, సెంటినీ హాస్పిటల్స్
ఇవి కూడా చదవండి
ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు
Read Latest AP News And Telugu News