Terrorist Presence: సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కలకలం
ABN , Publish Date - Aug 16 , 2025 | 10:08 AM
Terrorist Presence: ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఎన్ఐఏ అధికారులు ఓ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లో జరిపిన సోదాల్లో ఏకంగా 16 సిమ్ కార్డులు బయటపడ్డాయి. అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఎన్ఐఏ అధికారులు ఓ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలపై నిఘా పెట్టిన ఎన్ఐఏకు ధర్మవరంలోని కోట కాలనీలో నివాసం ఉంటున్న నూర్‌పై అనుమానం వచ్చింది. ఎన్ఐఏ అధికారులు ఓ హోటల్‌లో వంటమనిషిగా పని చేస్తున్న నూర్ కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు.
పక్కా సమాచారంతో రెండు రోజుల క్రితం అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లో జరిపిన సోదాల్లో ఏకంగా 16 సిమ్ కార్డులు బయటపడ్డాయి. అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. నూర్ సోషల్ మీడియా ఖాతాలపై నిఘా ఉంచారు. ఉగ్రవాదులతో నూర్‌కు ఉన్న సంబంధాలపై మరింత లోతుగా ఆరా తీస్తున్నారు. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో నూర్‌ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
జైషే మహమ్మద్‌తో లింకులు
నూర్ మహమ్మద్‌కు పాకిస్తాన్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో నిషేధించిన ఉగ్రవాద సంస్థలకు చెందిన వాట్సప్ గ్రూపుల్లో నూర్ సభ్యుడిగా ఉన్నట్లు సమాచారం. ముస్లిం యువతను అతడు ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు ఐబీ అధికారులు గుర్తించారు. ఆన్లైన్ కాల్స్ ద్వారా పాకిస్తాన్‌లోని జైషే మహమ్మద్, ఇతరులతో మాట్లాడినట్టు వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ’జై పాకిస్తాన్’ అంటూ నూర్ నినాదాలు చేసినట్లు సమాచారం.
మరో యువకుడు అరెస్ట్..
ఉగ్రవాది నూర్ మహమ్మద్ కేసును విచారిస్తున్న సమయంలో మరో కేసు కూడా వెలుగులోకి వచ్చింది. ధర్మవరానికి చెందిన రియాజ్ అనే యువకుడు పాకిస్తాన్ జెండాతో పాటు, పాకిస్తాన్‌కు చెందిన ఇన్ఫ్లుయెన్సర్ సయ్యద్ బిలాల్ వీడియోను వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. ధర్మవరం పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
13 వ రోజుకు టాలీవుడ్ షూటింగ్స్ బంద్, నేడు ఫిల్మ్ ఛాంబర్లో మరో దఫా చర్చలు