Temple Prasadam Quality: ప్రసాదాల్లో నాణ్యత పెంచాలి
ABN , Publish Date - Jun 04 , 2025 | 04:56 AM
దేవదాయ శాఖ శాఖాధికారులు ఆలయాల్లో ప్రసాదాల్లో నాణ్యత పెంచాలని, ప్రతి ఆలయానికి ఒక అధికారిని నియమించాలని ఆదేశించారు. అలాగే, భద్రతకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, వలంటీర్ల నియామకం కీలకంగా ఉండాలని కమిషనర్ సూచించారు.
ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
దేవదాయ శాఖ కార్యదర్శి వినయ్‌చంద్, కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశాలు
అమరావతి, జూన్ 3(ఆంధ్రజ్యోతి): ఆలయాల్లో భక్తులకు అందిస్తున్న ప్రసాదాల్లో నాణ్యత పెంచాలని, ప్రసాదాల తనిఖీ, పర్యవేక్షణకు ఒక అధికారిని నియమించాలని దేవదాయ శాఖ కార్యదర్శి వి.వినయ్ చంద్ ఆదేశించారు. మంగళవారం దేవదాయశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రసాదాల్లో నాణ్యత తగ్గకుండా చూడాలని సూచించారు. నాణ్యత పరిశీలనకు రాష్ట్రస్థాయిలో నోడల్ అధికారితో పాటు ప్రతి ఆలయానికి ఒక అధికారిని నియమించాలని ఆదేశించారు. దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ మాట్లాడుతూ... డిప్యూటీ కమిషనర్ కేడర్ ఆలయాల్లో అన్నదానం ప్రారంభించాలని చెప్పారు. ఆలయాల భూముల పరిక్షణ బాధ్యత ఈవోలదేనని, జీవో 60 ప్రకారం ఎప్పటికప్పుడు కలెక్టర్, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని భూములను రక్షించాలని అన్నారు. ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆర్జేసీ కేడర్ ఆలయాల్లో కనీసం వెయ్యి మంది వలంటర్లీను నియమించుకోవాలని సూచించారు. వలంటీర్ల నియామకానికి ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు.