Vice President C.P Radhakrishnan: రెండు రాష్ట్రాలు కలిసి నడవాలి
ABN , Publish Date - Nov 17 , 2025 | 03:23 AM
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న చిన్న చిన్న సమస్యలను ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చునని భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు.
చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం
తెలంగాణ, ఏపీ అభివృద్ధికి సహకరిస్తా
రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ఉప రాష్ట్రపతి సీపీఆర్
తెలుగు భాష సంరక్షణకు కృషి: చంద్రబాబు
హైదరాబాద్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న చిన్న చిన్న సమస్యలను ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చునని భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. కలిసి అడుగులు వేస్తే రెండు రాష్ట్రాలూ అభివృద్ధి పథంలో పయనిస్తాయన్నారు. ఇరు రాష్ట్రాల అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందని తెలిపారు. ఆదివారం రామోజీ ఫిలింసిటీలో నిర్వహించిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవానికి ఉప రాష్ట్రపతి హాజరయ్యారు. దేశంలో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి, సమాజ హితమే లక్ష్యంగా పనిచేస్తున్న వారికి ఈ అవార్డులను రాధాకృష్ణన్ చేతులమీదుగా అందజేశారు. అవార్డు గ్రహీతలకు మొమెంటో, ప్రశంసా పత్రంతోపాటు ఒక్కొక్కరికి రూ.10 లక్షల నగదును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు భాషను కాపాడుకోవడానికి రామోజీరావు స్ఫూర్తితో పనిచేస్తామని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ జీవోలు, ఇతర ఉత్తర్వులను ఇకపై తెలుగులోనే ఇస్తామని ప్రకటించారు.
విశేష కృషికి పురస్కారాలు..
ఎక్సలెన్స్ అవార్డు గ్రహీతల్లో.. చెరువులు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టి జలసంరక్షణతో 18 లక్షల మంది గ్రామీణ ప్రజల జీవితాలను మార్చిన అమ్లా అశోక్ రుయాకు గ్రామీణాభివృద్ధి విభాగంలో అవార్డు దక్కింది. వైకల్యాన్ని అధిగమించి పారిశ్రామికవేత్తగా రాణిస్తున్న శ్రీకాంత్ బొల్లాకు యూత్ ఐకాన్‌గా, ప్రపంచంలోనే ఎత్తైన కశ్మీర్‌లోని చినాబ్ వంతెనను డిజైన్ చేసిన బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ప్రొఫెసర్ మాధవీలతకు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పురస్కారాలు అందజేశారు. కాగా, మురికివాడల్లో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి.. వారి జీవితాల్లో మార్పు తెచ్చిన ఆకాశ్ టాండన్‌కు మానవతా సేవల విభాగంలో, కళలు-సంస్కృతి విభాగంలో సత్తుపతి ప్రసన్నకు, జర్నలిజంలో కృషికిగాను జైదీప్ హర్దేకర్‌కు, మహిళా సాధికారత కోసం పాటుపడిన పల్లబీ ఘోష్‌కు అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌నాయుడు, బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.