Share News

Andhra Pradesh Politics: పిన్నెల్లి సోదరులపై హత్య కేసు

ABN , Publish Date - May 26 , 2025 | 02:59 AM

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తల హత్యకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు అయింది. పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి నిందితుల వెనుక ఉన్న కుట్రకోణాన్ని తేలుస్తున్నారు.

Andhra Pradesh Politics: పిన్నెల్లి సోదరులపై హత్య కేసు

గుండ్లపాడు టీడీపీ కార్యకర్తల హత్యలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రమేయం?

హత్య జరిగిన గంటల్లోనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పిన్నెల్లి

గుంటూరు/మాచర్ల టౌన్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): ఇద్దరు టీడీపీ కార్యకర్తల హత్యకు సంబంధించి మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై హత్య కేసు నమోదైంది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ కార్యకర్తలు జెవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్‌ మొద్దయ్య, ఆయన సోదరుడు కోటేశ్వరరావు శనివారం తెలంగాణ రాష్ట్రంలో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. బోదిలవీడు-మండాది గ్రామాల మధ్య వారి ద్విచక్ర వాహనాన్ని దుండగులు స్కార్పియో వాహనంతో ఢీ కొట్టారు. అనంతరం రాళ్లతో కొట్టి వారిని దారుణంగా హత్య చేసి పరారయ్యారని.. వారు స్కార్పియోను అక్కడే వదిలేసి రచ్చమల్లపాడు వెళ్లే డొంకలోకి పారిపోతుండడం తాను చూశానని వెంకటేశ్వర్లు అల్లుడు ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ హత్యల వెనుక పిన్నెల్లి ప్రమేయం ఉందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో హతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసులు సీఆర్‌పీసీ 302 సెక్షన్‌ కింద జెవిశెట్టి శ్రీను అలియాస్‌ బొబ్బిలి(ఏ-1), తోట వెంకట్రామయ్య(ఏ-2), తోట గురవయ్య (ఏ-3), దొంగరి నాగరాజు(ఏ-4), తోట వెంకటేశ్వర్లు (ఏ-5), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (ఏ-6), పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి(ఏ-7)పై హత్య కేసు నమోదుచేశారు. శనివారం రాత్రంతా నియోజకవర్గాన్ని జల్లెడ పట్టారు. స్పెషల్‌ పార్టీ పోలీసులు కృష్ణానది పరివాహక ప్రాంతంలో గాలిస్తుండగా.. ఐదుగురు నిందితులు చిక్కినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే దీనిని పోలీసులు ధ్రువీకరించడం లేదు. మరోవైపు.. హత్యలు జరిగిన కొన్ని గంటలకే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఏడాదిగా పత్తాలేరు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే ఆయన మాయమయ్యారు. మాచర్ల నియోజకవర్గం పరిధిలో జరిగిన అనేక అరాచకాలు, దాడులు హత్యాయత్నాలు, హత్యలు వంటి 12 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన.. పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు ఏడాది కావస్తున్నప్పటికీ ఇంతవరకు ఆయన ఆచూకీని పోలీసులు కనుక్కోలేకపోయారు. అజ్ఞాతంలోనే ఉండి ఈ కేసులన్నిటిలోనూ ఆయన కోర్టుల నుంచి బెయిల్‌ తెచ్చుకోవడం గమనార్హం.


తోట చంద్రయ్యదీ ఇదే ఊరు

కాగా.. గుండ్లపాడుకే చెందిన టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్యను వైసీపీ నేతలు గొంతుకోసి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆయన తర్వాత గుండ్లపాడు టీడీపీలో జెవిశెట్టి సోదరులు క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. వీరిని కూడా చంపడం ద్వారా పార్టీని గ్రామంలో బలహీనపరచాలన్నది పిన్నెల్లి సోదరుల పన్నాగమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారి దన్ను లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావుల హత్యలు జరగవని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు స్పష్టం చేస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారు గతంలో కాంగ్రె్‌సలో ఉండి.. తర్వాత టీడీపీలో చేరినప్పటికీ.. వైసీపీ నేతలతో లోపాయకారీ సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అలాగే తోట చంద్రయ్య హత్య కేసులో నిందితులుగా ఉన్న వైసీపీకి చెందిన మాజీ ఎంపీపీ చింతా శివరామయ్య వర్గీయులతోనూ వారికి సంబంధాలున్నాయని అంటున్నారు.


టీడీపీని బలహీనపరిచేందుకే..

వెల్దుర్తి మండలంలో గుండ్లపాడు 4 వేలకు పైగా ఓట్లు ఉన్న పెద్ద గ్రామం కావడంతో ఇక్కడ ఆధిపత్యం ప్రదర్శించేందుకు మొదటి నుంచీ వైసీపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే అప్పట్లో పిన్నెల్లి సోదరుల ప్రోద ్బలంతో తోట చంద్రయ్య హత్య జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు జెవిశెట్టి సోదరుల హత్యలోనూ వారి ప్రమేయం ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. టీడీపీకి పట్టున్న గ్రామాల్లో ఉద్దేశపూర్వకంగానే వేరే పార్టీ నుంచి కొందరిని టీడీపీలోకి పంపి.. వారి ద్వారా హత్యలు, బెదిరింపులకు పాల్పడడం.. తద్వారా తమ పార్టీని బలహీనపరచాలని కుట్ర కూడా ఉందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చం ద్రబాబు ప్రభుత్వం తాజా హత్యలను తీవ్రంగా పరిగణిస్తోంది. సమగ్ర విచారణ జరిపి కుట్రకోణం నిగ్గు తేల్చాలని ఇప్పటికే పల్నాడు ఎస్పీ కె.శ్రీనివాసరావును ఆదేశించింది. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కాల్‌ డేటాను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. వారు గడచిన కొంతకాలంగా ఎవరెవరితో మాట్లాడుతున్నారు.. వారికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి.. అసలీ హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో తేల్చే దిశగా విచారణ సాగించనున్నారు.


ఇవి కూడా చదవండి

Minister Satyakumar: 2047 నాటికి ప్ర‌పంచంలో రెండో స్థానానికి భార‌త్ ఎద‌గ‌డం ఖాయం

Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్‌పై ట్రాన్స్‌జెండర్ల దారుణం..

Indian Delgation in Japan: ఉగ్రవాదం రాబిడ్ డాగ్‌, దాని నీచమైన నిర్వాహకుడు పాక్‌.. నిప్పులు చెరిగిన అభిషేక్

India slams Pak: ప్రసంగాలు ఆపండి.. UN లో పాక్‌పై విరుచుకుపడిన భారత్..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 26 , 2025 | 02:59 AM