Share News

Chirala: చీరాల మున్సిపాలిటీ టీడీపీ కైవసం

ABN , Publish Date - May 15 , 2025 | 04:09 AM

చీరాల మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావుపై అవిశ్వాస తీర్మానంలో టీడీపీ విజయం సాధించింది. రాజకీయ మంత్రులతో ఎమ్మెల్యే కొండయ్య వ్యూహాత్మకంగా వ్యవహరించి, వైసీపీ కౌన్సిలర్లను కూడగట్టడంతో ఈ ఫలితం సాధ్యమైంది.

Chirala: చీరాల మున్సిపాలిటీ టీడీపీ కైవసం

చైర్మన్‌ జంజనంపై అవిశ్వాస తీర్మానం

చక్రం తిప్పిన ఎమ్మెల్యే కొండయ్య

ఎక్స్‌ అఫిషియో ఓట్లతో 27కు చేరిన బలం

ఫలించని వైసీపీ క్యాంపు రాజకీయం

చీరాల, మే 14(ఆంధ్రజ్యోతి): బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావుపై అవిశ్వాసం తీర్మానంలో టీడీపీ నెగ్గింది. ఈ నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వైసీపీ నేతలు రంగంలోకి దిగి క్యాంపు రాజకీయానికి తెరలేపినా ప్రయోజనం దక్కలేదు. ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య కీలక సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఒకవైపు ఎంపీ కృష్ణప్రసాద్‌ను, మరోవైపు ఆమంచి కృష్ణమోహన్‌ వర్గం కౌన్సిలర్లను, టీడీపీ కౌన్సిలర్లను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం నుంచే పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. 1/3 బల నిరూపణలో విజయం సాధించేందుకు చైర్మన్‌ జంజనం పలు ఎత్తులు వేశారు. అయితే, ఎత్తుకు పైఎత్తులు వేస్తూ 2/3 వంతు మద్దతే లక్ష్యంగా బరిలోకి దిగిన ఎమ్మెల్యే ఎట్టకేలకు వైసీపీ శిబిరంలో ఉన్న నలుగురిని అనూహ్యంగా తమవైపు తిప్పుకొన్నారు. ఎంపీ కృష్ణప్రసాద్‌, ఎమ్మెల్యే కొండయ్య ఓట్లతోపాటు ఆమంచి వర్గం ఐదుగురు కౌన్సిలర్లతో కలుపుకొని 26 ఓట్లతో అవిశ్వాసంలో నెగ్గారు. అలాగే వైస్‌ చైర్మన్‌ బొనిగల జైసన్‌బాబుకు 27 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం తెలిపారు. ఈ క్రమంలో ప్రిసైడింగ్‌ అధికారి, ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు టీడీపీ శిబిరం విజయం దక్కించుకున్నట్టు ప్రకటించారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయం సమీపంలో పెద్దఎత్తున బాణసంచా కాల్చి టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బుధవారం జరిగిన పరిణామాలను అధికారులు ఎలక్షన్‌ కమిషనర్‌కు వివరించి మరో పది రోజుల్లో చైర్మన్‌ ఎంపిక కోసం సమావేశం నిర్వహించనున్నారు.


కుర్చీ వదలక, పార్టీ విడువక!

చీరాల మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు చివరివరకు కుర్చీ వదలలేదు. ఒకవైపు టీడీపీతోనే ప్రయాణమంటూ, మరోవైపు పరోక్షంగా ఎమ్మెల్యేకు ఎదురు నిలిచారు. బుధవారం ఉదయం వరకు మెజార్టీ కోసం ప్రయాసలు పడ్డారు. కౌన్సిల్‌ సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడుతూ.. చైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం, అవిశ్వాస ప్రక్రియ ముగిసే వరకు తన చాంబర్‌లోనే ఉండిపోయారు.

చీరాలకు పారదర్శక సేవలు: ఎంపీ, ఎమ్మెల్యే

గత ప్రభుత్వంలో చీరాల మున్సిపాలిటీలో అవినీతి పేరుకు పోయిందని, ఇకపై అభివృద్ధికి దోహదపడే అభ్యర్థిని చైర్మన్‌గా నియమించనున్నట్టు ఎమ్మెల్యే కొండయ్య, ఎంపీ కృష్ణప్రసాద్‌ అన్నారు. చీరాల ప్రజలకు పారదర్శక సేవలు అందించి అర్హులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్

Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్

Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 15 , 2025 | 04:09 AM