Jagan Mohan Reddy: కూలిన జగన్ సామ్రాజ్యం
ABN , Publish Date - Aug 15 , 2025 | 05:17 AM
పులివెందుల నిన్నటి వరకు వైఎస్ జగన్ సామ్రాజ్యం ఇది. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 1978లో రాజకీయాల్లోకి వచ్చారు...
30 ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీ అడ్డా
నిన్నటిదాకా పులివెందుల వన్‌సైడే
జడ్పీటీసీ ఉప ఎన్నికలతో సీన్ రివర్స్
కూల్‌గా గెలిచేస్తాం అనుకున్న స్థానం
జగన్ స్వయంకృతాలతో బలపడ్డ టీడీపీ
రాజశేఖర్‌రెడ్డి, వివేకా ఉండగా క్యాడరే సైన్యం
జగన్ తీరుతో సడలుతూ వచ్చిన ఆ బంధం
ఎన్నికలముందు టీడీపీలోకి వైసీపీ క్యాడర్
వైఎస్ ఊళ్లుగా పేరుబడ్డ చోటా టీడీపీకే ఓటు
పెద్దగా ఘర్షణలు లేకుండా పోలింగ్ ప్రశాంతం
(కడప - ఆంధ్రజ్యోతి): పులివెందుల! నిన్నటి వరకు వైఎస్ జగన్ సామ్రాజ్యం ఇది. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 1978లో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి రాజశేఖర్‌రెడ్డి, జగన్ తాత రాజారెడ్డి సామ్రాజ్యంగా పులివెందుల పేరు పడింది. ఎవరిని వైఎస్ కుటుంబం పోటీలో నిలిపితే వారే విజేత. నిన్నటిదాకా కూడా అక్కడ అక్కడ వార్ ఎప్పుడూ వన్‌సైడే. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రజాస్వామ్యం మరిచి అరాచకంగా రాజ్యం చేసే సంస్కృతికి తాజా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలు స్వస్తి పలికాయి. అందువల్లే విజయం ఇప్పుడు టీడీపీ సైడ్ అయిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నిజానికి, పులివెందుల ఉప ఎన్నిక అనేక కారణాల వల్ల జగన్ పార్టీకి చావు.. గెలుపు.. సమస్యగా మారింది. ఇక్కడ ఓడితే పార్టీ క్యాడర్‌కు ప్రతికూల సంకేతాలు వెళతాయని జగన్ అండ్ కో తీవ్రంగా మఽథనపడింది. జగన్ సూచనల మేరకు కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. ఓటుకు రూ.5వేల చొప్పున నీళ్ల ప్రాయంగా డబ్బులు ఖర్చు పెట్టారు. దీంతో కడప జిల్లాలో రెండు జడ్పీటీసీ స్థానాలకూ అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా పోలింగ్ జరిగింది. జగన్ సొంత జిల్లా కావడం, అందులోనూ పులివెందులలో ఎన్నిక జరుగుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికలపై ఆసక్తి పెరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకున్నారు. పులివెందుల జడ్పీటీసీ పరిధిలో మొత్తం 10,601 ఓట్లు ఉన్నాయి. రాగిమానుపల్లె, అచ్చవెల్లి, ఎర్రవెల్లి, ఈ.కొత్తపల్లె, కనంపల్లె పంచాయతీలున్నాయి. ఈ పంచాయతీలలో వైఎస్ కుటుంబానికి గట్టి అభిమానులున్నారు. వారంతా వైఎస్ కుటుంబం చెప్పిన మాటను జవదాటరు. గతంలో జరిగిన ఎన్నికలన్నీ ఇక్కడ ఏకపక్షమే. ఓటు ముఖం చూడని జనం చాలామంది ఉన్నారు. ఆ పార్టీదే గెలుపు అని అందరూ అనుకున్నారు. పోలింగ్‌కు కొన్నిరోజుల ముందు వరకూఇదేసీన్. అయితే, అక్కడినుంచి పరిస్థితి అనూహ్యంగా టీడీపీకి అనుకూలంగా మారడం మొదలైంది.
క్యాడర్‌తో తెగిన బంధం..
బీటెక్ రవి వైసీపీ నుంచి కీలక నేతలను టీడీపీలోకి తీసుకోవడంతో పోలింగ్ నాటికి టీడీపీ బాగా బలపడింది. కనీస పోటీకి సిద్ధమైన స్థితి నుంచి ఢీకొట్టేంత బలంగా టీడీపీ తయారయింది. అయితే, ఇందుకు టీడీపీ అనుసరించిన వ్యూహం కంటే కూడా జగన్ స్వయంకృతాలే ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో కలిసి వచ్చాయి. ఉదాహరణకు పులివెందుల మండలంలోని నల్లగొండుగారిపల్లె, ఆర్.తుమ్మలపల్లె, కనంపల్లె, ఎర్రిబల్లె, ఎర్రబల్లె, ఈ.కొత్తపల్లె వైసీపీకి కంచుకోటలు. ఇక్కడ ఈ.కొత్తపల్లెలో మాత్రమే టీడీపీకి కాస్త బలం ఉంది. రాగమానుపల్లె పంచాయతీలో 1243, అచ్చవెల్లి 991, ఎర్రిపల్లె 636, ఎర్రబల్లె 3901, యు.కొత్తపల్లె 2561, కనంపల్లె పంచాయతీలో 602ఓట్లు ఉన్నాయి. మొత్తం 10,601 ఓట్లకు గాను 7,794 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ రిగ్గింగ్ చేసుకుందని వైసీపీ ఆరోపిస్తోంది. వాస్తవంగా టీడీపీ దౌర్జన్యం చేసినా కూడా ఈ పల్లెలన్నీ వైఎస్ కుటుంబం మాట దాటని పల్లెలు. ఒకవేళటీడీపీ దౌర్జన్యం చేసినా కూడా ఆ జనమంతా రివర్స్ అయితే చేయగలిగింది ఏమీ ఉండదు. నిజానికి, అసలు పోలింగ్ రోజున వైసీపీ క్యాడరే బయట కనిపించలేదు. ఓటర్లు వచ్చి ఓటు వేసుకుని పోయారు. పోలింగ్ సరళిని బట్టి చూస్తే జగన్ పార్టీపై క్యాడరులో, ఓటర్లలో తీవ్రమైన అసంతృప్తి ఉన్నట్లు అర్థమవుతుంది. రాజశేఖరరెడ్డి, వివేకానందరెడ్డి క్యాడర్‌తో బాగా మమేకమయ్యేవారు. నమ్ముకున్న వారికి న్యాయం చేస్తారనే పేరు రాజశేఖరరెడ్డి ఉంది. వైఎ్‌సపై అభిమానంతోనే కాంగ్రెస్ క్యాడర్ అంతా ఆయన మరణానంతరం జగన్ వెంట నడిచారు. వారంతా వైసీపీలో ఉన్నారు. జగన్ సీఎం అయిన తరువాత క్యాడర్‌తో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయని చెబుతున్నారు.
జగన్‌కు, వైఎ్‌సకు తేడా..
రాజశేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు, నమ్మిన వారికి బాగా ప్రాధాన్యం ఇచ్చేవారు. జగన్ ఇందుకు పూర్తి విరుద్ధమని చెబుతారు. వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాశ్‌రెడ్డి ప్రమేయంపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే అవినాశ్‌రెడ్డిని జగన్ పూర్తిగా వెనుకేసుకు వచ్చారు. దీన్ని వైఎస్ అబిమానులు జీర్ణించుకోలేక పోయారు. అలాగే సొంత చెల్లెలు షర్మిల, తల్లి విజయమ్మను కూడా జగన్ దూరం చేసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ కేవలం తాడేపల్లికి మాత్రమే పరిమితమయ్యారు. క్రిస్‌మస్ సందర్భంగా పులివెందుల చర్చికి వచ్చి ప్రార్థనలు చేయడం, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి క్యాడర్‌ను కలవకుండా వెళ్లిపోయేవారు. పులివెందుల అంతా ఎంపీ అవినాశ్‌రెడ్డికి అప్పజెప్పారు. అయితే వైఎస్, వివేకానందరెడ్డితో రాజకీయం చేసిన క్యాడర్, నేతలు.. వారిద్దరిలో ఉన్న కమిట్‌మెంటు జగన్, అవినాశ్‌లో లేదని గుర్తించారు. క్యాడర్‌లో పూర్తి అసంతృప్తి ఉన్నది.
‘తుమ్మలపల్లి’లో జరిగింది ఇదీ..
వైసీపీ నుంచి పోటీ చేసిన హేమంత్‌రెడ్డి స్వగ్రామం తుమ్మలపల్లె. ఆయనను టీడీపీ నేతలు బయటికి రానీయకుండా అడ్డుకున్నారంటూ జగన్ మీడియా బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది. దీంతో స్పందించిన ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ఒక సీఐ, 8 మందితో కూడిన పోలీసు బృందాన్ని తుమ్మలపల్లెలోని హేమంత్‌రెడ్డి ఇంటికి పంపించారు. ఆయన పోటీలో ఉండడంతో మండల వ్యాప్తంగా బూత్‌లలో స్వేచ్ఛగా తిరిగేందుకు సెక్యూరిటీని పంపించారు. అయితే గంటన్నరపాటు పోలీసు సిబ్బంది వెయిట్ చేసినా బయటికి రాలేదు. చివరికి అభ్యర్థి తల్లి బయటికి వచ్చి మా అబ్బాయి బయటికి రాడు అని పోలీసులకు తెలిపారు. అయినా పోలీసులు అక్కడే ఉన్నారు. 11 గంటలకు హేమంత్‌రెడ్డి బయటికి వచ్చి నేను ఇప్పుడు బయటికిరాను, అవసరం ఐతే ఫోను చేస్తానని ఇంట్లోకి వెళ్లిపోయారు. కనీసం ఆయన కూడా ఓటు వేసుకోలేదంటే ఇంక అర్థం చేసుకోవచ్చు!
నాడు ఉమేశ్‌చంద్ర.. నేడు కోయ ప్రవీణ్
1990 దశకంలో కడప జిల్లాలో ఫ్యాక్షన్ రాజ్యమేలుతుండేది. అప్పట్లో ఏ ఎన్నికలు జరిగినా హింసాత్మకమే. అలాంటి సమయంలో 1996లో కడప పార్లమెంటుకు ఉప ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ నుంచి రాజశేఖర్‌రెడ్డి, టీడీపీ నుంచి రాజగోపాల్‌రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికలను అప్పటి ఎస్పీ ఉమేశ్‌చంద్ర ప్రశాంతంగా నిర్వహించారు. అయితే మళ్లీ ఇప్పుడు డీఐజీ కోయ ప్రవీణ్ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించారు.