TDP Mahanadu 2025: మహానాడు చివరి రోజున..5 లక్షల మందితో భారీ సభ
ABN , Publish Date - May 19 , 2025 | 05:44 AM
టీడీపీ మహానాడు చివరి రోజున కడపలో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 50 నియోజకవర్గాల నుండి ప్రజల సమీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

50 నియోజకవర్గాల నుంచి జనసమీకరణ
కడప శివారులో టీడీపీ నేతల సమన్వయ సమావేశం
కడప, మే 18(ఆంధ్రజ్యోతి): కడప గడపలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించే మహానాడును భారీ స్థాయిలో విజయవంతం చేయాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. చివరి రోజున 5 లక్షల మందితో కనీవినీ ఎరుగని రీతిలో బహిరంగ సభ నిర్వహించాలని.. చరిత్రలో నిలిచిపోయేలా చేయాలని సంకల్పించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన ఆదివారం సాయంత్రం కడప నగర శివారులోని మహానాడు నిర్వహించే వేదిక వద్ద సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులు అనిత, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, ఎం.రాంప్రసాద్‌రెడ్డి, సవిత, బీసీ జనార్దనరెడ్డి, ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, పుత్తా చైతన్యరెడ్డి, ఆర్.మాధవి, వరదరాజులరెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్, అమర్‌నాథరెడ్డి, నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రాంగోపాలరెడ్డి, బీద రవిచంద్ర, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, పొలిట్‌బ్యూరో సభ్యుడు, టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి దేవినేని ఉమ, ప్రభాకర్‌చౌదరి తదితరులు హాజరయ్యారు. ముందుగా పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో చనిపోయిన వారి స్మారకార్థం 2నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం మహానాడు నిర్వహణపై చర్చించారు. తరలివచ్చే ప్రతినిధులకు వసతి ఏర్పాట్లు, బహిరంగ సభకు జనసమీకరణపై ప్రధానంగా చర్చ జరిగింది. కడప సమీప సీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి ప్రజలను సమీకరించాలని నిర్ణయించారు. ఉమ్మడి కడప జిల్లా నుంచి 2.10 లక్షల మందిని.. మిగతావాటిలో ఒక్కో నియోజకవర్గం నుంచి 5-10 వేల మందిని తరలించాలని నిశ్చయించారు. నియోజకవర్గాలవారీగా ఇన్‌చార్జులను కూడా నియమించారు.
ఇంతకుముందు లేదు.. ఇక ముందూ జరగదు!
మహానాడు నిర్వహణలో టీడీపీకి రికార్డు ఉందని, కడప మహానాడును ‘ఇంతకుముందు ఎప్పుడూ జరుగలేదు.. ఇక ముందూ జరగదు’ అన్న రీతిలో నిర్వహించనున్నట్లు పల్లా శ్రీనివాసరావు విలేకరులకు తెలిపారు. ‘సమయం తక్కువ ఉన్నా సరే గడువులోపు ఏర్పాట్లు పూర్తి చేస్తాం. ఇంత అద్భుతమైన వేదిక దొరకలేదు. 125 ఎకరాల్లో సువిశాలమైన మైదానం. పార్కింగ్‌కు ఎలాంటి సమస్య ఉండదు. తొలి రెండ్రోజుల్లో ప్రతినిధుల సభ జరుగుతుంది. 23 వేల మందికి ఆహ్వానం పంపించాం. వీరందరికీ అవసరమైన వసతి సిద్ధం చేశాం. పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్‌లో చేయాల్సినవి, సీమలో జరిగిన అభివృద్ధిపై చర్చిస్తాం. మంత్రి లోకేశ్ రూపొందించిన ‘మై టీడీపీ’ యాప్‌ను ఆవిష్కరిస్తాం. మహానాడులో లోటుపాట్లు లేకుండా 13 కమిటీలు.. సమన్వయం, వేదిక నిర్వహణ, కో-ఆర్డినేషన్ క్యాంపు కమిటీ, రవాణా, పార్కింగ్, ఆహారం, వసతి, తొక్కిసలాట లేకుండా పర్యవేక్షణ కమిటీ, రక్తదానం, వలంటీర్, రిజిస్ట్రేషన్, పారిశుద్ధ్యం, పుష్పాలంకరణ కమిటీలను ఏర్పాటు చేశాం’ అని వివరించారు.