Palla Srinivasa Rao: చరిత్రలో నిలిచిపోయేలా మహానాడు
ABN , Publish Date - May 18 , 2025 | 04:14 AM
కడప జిల్లా పబ్బాపురం వద్ద 125 ఎకరాల్లో మహానాడును చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. చివరిరోజు ఐదు లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా
చివరిరోజు 5 లక్షల మందితో బహిరంగ సభ
పార్కింగ్ కోసం 300 ఎకరాలు సిద్ధం
ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు.. నేడు పలు కమిటీల నియామకం
కడప, మే 17(ఆంధ్రజ్యోతి): చరిత్రలో నిలిచిపోయేలా మహానాడును నిర్వహిస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో కడప నగర శివార్లలోని పబ్బాపురం గ్రామం వద్ద 125 ఎకరాల్లో ప్రతిష్ఠాత్మకంగా మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో మహానాడు ఏర్పాట్లను శనివారం పల్లా శ్రీనివాసరావు పరిశీలించారు. తొలి రెండు రోజుల ప్లీనరీ సభావేదిక, చివరి రోజు బహిరంగ సభ వేదిక, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు తదితర అంశాలను ఆయన పరిశీలించారు. కడపలో నిర్వహించే ఈ మహానాడును కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేయాలని టీడీపీ భావిస్తోంది. చివరిరోజు ఐదు లక్షల మందితో బహిరంగసభ నిర్వహించనున్నారు. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి జనసమీకరణ చేయనున్నారు. ఇక ట్రాఫిక్, ఇతర అంశాలకు సంబంధించి కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ అశోక్‌కుమార్ వేదిక ప్రాంతాన్ని పరిశీలించి చర్చించారు. చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారి పక్కనే రింగురోడ్డులో మహానాడు నిర్వహిస్తున్నందువల్ల కడప, పరిసరాల్లో ట్రాఫిక్‌కు ఇబ్బందుల్లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 300 ఎకరాలను వాహనాల పార్కింగ్ కోసం సిద్ధం చేశారు. మహానాడు వేదికను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, ఏపీఐఐసీ చైర్మన్ రామరాజు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పుత్తా చైతన్య కూడా పరిశీలించారు.
నేడు మంత్రుల రాక
మహానాడు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మంత్రులు అనిత, నిమ్మల రామానాయుడు, సవిత, మండిపల్లె రాంప్రసాదరెడ్డి, సుభా్‌షతో పాటు సీఎం ప్రోగ్రాం కన్వీనర్ వెంకటేశ్ ఆదివారం కడపకు వస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు మహానాడు వేదిక వద్ద కోఆర్డినేషన్ సమావేశం నిర్వహిస్తారు. మహానాడును విజయవంతం చేసేందుకు.. ప్లీనరీ వేదిక, బహిరంగసభ ఆహ్వానితులు, ట్రాన్స్‌పోర్టు, బస, రక్తదానం, ఆహారం తదితర కమిటీలను ఏర్పాటు చేస్తారు. కాగా.. కడపలో శనివారం నిర్వహించిన తిరంగ ర్యాలీలో పల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు.