Lavu sri krishna devarayalu: జగన్ రెడ్డి అరాచకాలపై అమిత్ షాకు లేఖ
ABN , Publish Date - Apr 09 , 2025 | 10:11 PM
Lavu sri krishna devarayalu: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహర శైలి వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలుకు విఘాతం కలుగుతోందని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి అమిత్ షాకు ఆయన లేఖ రాశారు.

అమరావతి, ఏప్రిల్ 09: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో మంగళవారం పర్యటించారు. అందులోభాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. ఆ క్రమంలో జగన్ వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మండిపడ్డారు.
దేవినేని ఉమ మాట్లాడుతూ.. బెయిల్‌పై ఉన్న ముద్దాయి చట్టాలను కాపాడే వ్యవస్థలను బెదిరించేలా బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నాడంటూ వైఎస్ జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు న్యాయ వ్యవస్థలు చాలెంజ్‌గా తీసుకొని జగన్ రెడ్డిపై ఉన్న కేసులను త్వరితగతిన విచారించాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి మాటలు, ప్రవర్తన అతనిలో అభద్రత భావాన్ని బయట పెడుతున్నాయన్నారు. క్యాడర్ పార్టీనీ నిలబెట్టుకోవడానికి రాష్ట్రపతి పాలన కావాలని వైఎస్ జగన్ డిల్లీ వెళ్ళాడని గుర్తు చేశారు.
అసెంబ్లీకి రాలేని పిరికి వ్యక్తి జగన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తానని మారం చేశాడంటూ ఎద్దేవా చేశారు. పరిటాల కుటుంబాన్ని తిట్టాలనే దుగ్ధ తప్ప బాధిత కుటుంబం పట్ల జగన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న విజయవాడలో.. నిన్ను రాప్తాడులో బట్టలు ఊడదీస్తాను అంటున్నాడు .. ఎందుకో సమాధానం చెప్పాలంటూ వైఎస్ జగన్‌ను నిలదీశారు.
చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకొని దశాబ్దంపైగా బెయిల్‌పై ఉన్న నువ్వు మాట్లాడే అనాగరిక భాష, అసహనం బయట పడుతుందంటూ వైఎస్ జగన్‌పై నిప్పులు చెరిగారు. 41 A నోటీసులు వంటి ఆ అంశాలు బయటకు వచ్చాయంటే నీ ఐదేళ్ల అరాచక పాలనకు నిదర్శనమని స్పష్టం చేశారు. ప్రజా వేదిక విధ్వంసంతో నిన్ను 11 సీట్లకు ప్రజలు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు.
ఐదేళ్లు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నపుడు ఏ విధంగా నువ్వు మాట్లాడావో అదే భాష నీ నాయకులు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు నాయుడు పోలవరం, అమరావతి పనులు పరిగెత్తిస్తుంటే చూసి తట్టుకోలేక పోతున్నావని మండిపడ్డారు. ఐదేళ్లు విశాఖ ఉక్కుకు నువ్వు చేసిన ద్రోహానికి ఫుల్ స్టాప్ పెడితే ఓర్వలేక పోతున్నావంటూ వైఎస్ జగన్ పై దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యమన్నా..కోర్టులన్నా నీకు లెక్క లేకుండా పోయిందన్నారు. నీ తండ్రి హయంలో పెట్టిన కేసులకు మేము ఈ రోజుకు వాయిదాలకు తిరుగుతున్నామని ఆయన గుర్తు చేసుకొన్నారు. బలుపు, అహంకారంతో మాట్లాడుతూ.. 29 కేసుల్లో ఉన్న జగన్ రెడ్డి కోర్టు మెట్లు ఎందుకు ఎక్కడం లేదంటూ సందేహం వ్యక్తం చేశారు.
నువ్వు అధికారంలో ఉన్న సమయంలో లిక్కర్ డిజిటల్ పేమెంట్లు చేయకుండా వ్యవస్థలను భ్రష్టు పట్టించి ఖజానా నింపుకున్నావని విమర్శించారు. మళ్ళీ ఇంకోసారి ఈ బలుపు మాటలు మాట్లాడకుండా జగన్ రెడ్డికి, ఆయన నాయకులు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని దేవినేని ఉమ హెచ్చరించారు.
ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు వైఎస్ జగన్ అరాచకాలు ముప్పుగా మారుతోన్నాయని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అరాచకాలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లోక్‌సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణదేవరాయులు బుధవారం లేఖ రాశారు.
పర్యటనల పేరుతో వైఎస్ జగన్ విధ్వంసం సృష్టించాలని చూస్తున్నాడని ఆరోపించారు. పాపిరెడ్డిపల్లిలో జగన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అప్రజాస్వామికమని ఆయన అభివర్ణించారు. రాజ్యాంగ బద్ధంగా పని చేస్తున్న ప్రభుత్వంపై విషం కక్కుతూ పోలీసుల నైతికతను దెబ్బ తీసే కుట్రకు తెర తీశారని మండిపడ్డారు. 13 ఏళ్లుగా CBI, ED కేసుల్లో బెయిల్‌పై తిరుగుతున్న వైఎస్ జగన్ వ్యవస్థలను బెదిరించేలా వ్యవరిహస్తున్నాడని పేర్కొన్నారు.
నిజాయితీగా పని చేస్తున్న పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలు బెయిల్ షరతులను ఉల్లంఘించటమేనన్నారు. సొంత బాబాయి వివేకానంద రెడ్డి హత్యను గుండెపోటుగా చిత్రీకరించి, ఆ మరణాన్ని రాజకీయ ప్రయోజనానికి వాడుకున్న నీచ వ్యక్తి జగన్ రెడ్డి అని అభివర్ణించారు. కోడి కత్తి నుంచి రాళ్ల దాడి వరకూ ప్రతిదీ ఒక నాటకమేనని ఆయన గుర్తు చేశారు. కోడి కత్తి కేసులో NIA ముందు ఒక్క సారి కూడా హాజరు కాని వ్యక్తి.. ఇప్పుడు పోలీసులపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
Z+ భద్రతతోపాటు 2,500 పోలీసులతో బందోబస్తు ఇచ్చిన కూడా నిసిగ్గుగా ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాడంటూ జగన్‌పై నిప్పుులు చెరిగారు. కులాలు, వర్గాల మధ్య చిచ్చు రేపేలా జగన్ ప్రసంగాలు చేయడం… కార్యకర్తల్ని రెచ్చగొట్టడం… ఇవన్నీ శాంతి భద్రతలకు ముప్పు కలిగించే కుట్రలుగా ఆయన అభివర్ణించారు.
ముందుగానే రోడ్డు ప్రయాణం ప్లాన్ చేసి స్క్రిప్ట్ ప్రకారం డ్రామాకి తెర లేపి అలజడులు సృష్టించడానికి నక్కజిత్తుల కుట్రలకు జగన్ ముఠా ప్రయత్నిస్తోందన్నారు. ప్రజలు ఆదరించిన NDA కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో శాంతిభద్రతలు నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తోందన్నారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న జగన్ రెడ్డి తీరు ప్రజాస్వామ్యానికి హానికరంగా మారిందంటూ లావు శ్రీకృష్ణదేవరాయులు ఆందోళన వ్యక్తం చేశారు.