TDP Party Resolutions: రేపటి నుంచే మహానాడు
ABN , Publish Date - May 26 , 2025 | 03:06 AM
రేపటి నుంచే కడపలో టీడీపీ మహానాడు ప్రారంభం కానుంది. చరిత్రాత్మక నిర్ణయాలు, లోకేశ్ ప్రతిపాదించిన ఆరు సూత్రాలపై చర్చలు జరగనున్నాయి.
ఏర్పాట్లు దాదాపు కొలిక్కి.. వర్షంతో కొంత ఇబ్బంది
ప్రతినిధుల నమోదుతో పసుపు పండగ ప్రారంభం
చరిత్రాత్మక నిర్ణయాలకు వేదిక కానున్న కార్యక్రమం
తొలి 2 రోజులు వివిధ అంశాలపై చర్చలు, తీర్మానాలు
మంత్రి లోకేశ్ ప్రతిపాదించిన ఆరు సూత్రాలపై చర్చ
కార్యకర్తలకు ప్రాధాన్యం కల్పించడంపై కీలక నిర్ణయం
29న మధ్యాహ్నం 5 లక్షల మందితో భారీ సభ
5 వేల మంది పోలీసులతో బందోబస్తు
అమరావతి, మే 25(ఆంధ్రజ్యోతి): రాయలసీమ జిల్లాల నడిబొడ్డున కడప వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు సర్వం సిద్ధమైంది. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమం... కార్యకర్తలకు పెద్దపీట వేయడంతో పాటు పలు చరిత్రాత్మక నిర్ణయాలకు వేదికగా నిలవనుంది. తొలిరోజు 27న పార్టీ ప్రతినిధుల సభ, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణతో పాటు టీడీపీ మౌలిక సిద్ధాంతాలు, మంత్రి లోకేశ్ ప్రతిపాదించిన 6 సూత్రాల ఆవిష్కరణ, పార్టీ నియామవళిలో సవరణలపై ప్రధాన చర్చ జరగనుంది. అలాగే పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. మంగళవారం ఉదయం 8.30 గంటలకు ప్రతినిధుల నమోదుతో పసుపు పండగ ప్రారంభమవుతుంది. అనంతరం ఫొటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాలు ప్రారంభించనున్నారు. ఉదయం 10.45 గంటలకు పార్టీ జాతీయ అధ్యక్షులు, పొలిట్‌బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు వేదికపైకి చేరుకుంటారు. పార్టీ జెండాను ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలన చేసి, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. అనతరం ‘మా తెలుగు తల్లికి’ గీతాలాపనతో మహానాడు లాంఛనంగా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పార్టీ కోసం పనిచేసి మృతిచెందిన కార్యకర్తలు, నేతలకు సంతాపం తెలియజేస్తారు. తర్వాత ప్రధాన కార్యదర్శి నివేదిక సమర్పిస్తారు. 11.30 గంటలకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వాగతోపన్యాసం చేస్తారు. కోశాధికారి పార్టీ జమాఖర్చుల నివేదిక సమర్పిస్తారు. 11.50 గంటలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేస్తారు. అనంతరం టీడీపీ మౌలిక సిద్ధాంతాలపై చర్చించనున్నారు. స్వర్ణాంధ్ర సాధన, పార్టీ నిర్వహణ, మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ రూపొందించిన 6 సూత్రాల ఆవిష్కరణ, పార్టీ నియమావళిలో సవరణలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. మండల స్థాయిలో మూడు విడతలు ఒకే పదవి చేసిన వారిని అంతకన్నా పెద్ద పదవికి పంపాలన్న నిర్ణయంతో పాటు పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. భోజన విరామం తర్వాత ఆరు సూత్రాల్లో మొదటిదైన ‘కార్యకర్తే అధినేత’ , రెండోదైన ‘యువగళం’లో అంశంపై చర్చ జరుగుతుంది. మై టీడీపీ యాప్‌తో పాటు కార్యకర్తల సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా చర్చిస్తారు.
రెండోరోజు కార్యక్రమాలు...
రెండో రోజు బుధవారం ప్రతినిధుల సభతో పాటు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళి అర్పించనున్నారు. అనంతరం ఆరు సూత్రాల్లో మూడోదైన ‘తెలుగుజాతి- విశ్వఖ్యాతి’, నాలుగోదైన ‘స్త్రీ శక్తి’, ఐదో అంశం ‘సామాజిక న్యాయం - పేదల ప్రగతి’, చివరిదైన ‘అన్నదాతకు అండ’గాపై చర్చించి, తీర్మానాలు చేస్తారు. సాయంత్రం 5.30కు పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ప్రమాణ స్వీకారం, అధ్యక్షుడి ప్రసంగం ఉంటాయి. మూడో రోజు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు 5 లక్షలమందితో భారీ బహిరంగసభ నిర్వహిస్తారు.
వర్షంతో పనులకు ఆటంకం
ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో మహానాడు పనులకు అంతరాయం ఏర్పడింది. ప్రాంగణమంతా బురదమయంగా మారింది. వేదిక వద్దకు నీరు వచ్చింది. వర్షం ఆగిపోయిన వెంటనే పనులు చేపట్టాలని మంత్రి నిమ్మల ఆదేశించారు.
భారీగా ఏర్పాట్లు
మహానాడు వేదిక దాదాపు పూర్తయింది. సువిశాల మైదానంలో తొలి రెండురోజులు ప్రతినిధుల సభ, చివరిరోజు బహిరంగ సభ, భోజనశాల, ముఖ్యమంత్రి సభ, ఆయన క్యాంపు కార్యాలయం ఇలా అన్నింటినీ సిద్ధం చేశారు. ప్రతినిధుల సభా వేదికపై దాదాపు 450 మంది కూర్చోనే విధంగా 164 అడుగుల వెడల్పున, 510 అడుగుల పొడవుతో నిర్మించారు. కింద 25వేల మంది కూర్చుని చర్చించేలా ఏర్పాట్లు చేశారు.