Share News

AP Spurious Liquor Probe: ఆ కల్తీ సారా మరణాల గుట్టు తేల్చండి

ABN , Publish Date - May 20 , 2025 | 04:01 AM

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 2022లో జరిగిన కల్తీ సారా మరణాలపై ప్రభుత్వం స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ నియమించింది. వైసీపీ హయాంలో 20 మందికిపైగా చనిపోగా, అప్పట్లో ప్రభుత్వం సహజ మరణాలుగా పేర్కొనడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

AP Spurious Liquor Probe: ఆ కల్తీ సారా మరణాల గుట్టు తేల్చండి

  • వైసీపీ హయాంనాటి మరణాలపై టాస్క్‌ఫోర్స్‌

  • జంగారెడ్డిగూడెంలో 2022లో మరణ మృదంగం

  • తొమ్మిది రోజుల్లో 20మందికిపైగా మృత్యువాత

  • వాంతులు, కడుపునొప్పి, నిస్సత్తువ, పల్స్‌ డౌన్‌

  • వంటి లక్షణాలు మృతులందరిలో కనిపించిన వైనం

  • కానీ, సహజ మరణాలుగా కొట్టేసిన వైసీపీ సర్కారు

  • అసెంబ్లీలోనూ, బయటా అప్పట్లో తీవ్ర నిరసనలు

  • నాడు ఏం జరిగిందో నెలరోజుల్లోగా నిగ్గు తేల్చండి

  • స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ను కోరిన సీఎస్‌ విజయానంద్‌

ఏలూరు, మే 19(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మూడేళ్ల క్రితం చోటుచేసుకున్న కల్తీ సారా మరణాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ను నియమించింది. ఆ ఘటనలో అప్పట్లో 20 మందికిపైగా మరణించారు. గత ప్రభుత్వం ఈ మరణాలను ధ్రువీకరించకుండా పక్కదారి పట్టించే ప్రయత్నం చేసింది. అవి సహజ మరణాలంటూ బుకాయించింది. అయితే.. అవి కచ్చితంగా కల్తీ సారా మరణాలేనని అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ప్రకటించారు. సీఎంగా జగన్‌ తీరు అప్పట్లోనే తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ మరణాలపై ఇప్పుడు ప్రభుత్వం దృష్టి సారించింది. అప్పట్లో ఏం జరిగిందనేది డీజీపీ హరీ్‌షకుమార్‌ గుప్తా ఒక నివేదికను సమర్పించారు. దాని ఆధారంగా ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక బృందాన్ని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఏలూరు ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ నేతృత్వం వహించే ఈ టాస్క్‌ఫోర్స్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ కేవీఎన్‌ ప్రభుకుమార్‌, రంగరాయ మెడికల్‌ కాలేజీ ప్రొఫెసర్‌ పి ఉమామహేశ్వరరావు సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ మరణాలపై అప్పట్లో 4కేసులు నమోదయ్యాయి. వాటిపై బృందం దృష్టి సారించనుంది.


అప్పుడేం జరిగిందంటే..

జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో 2022 మార్చి 7-16వ తేదీ మధ్యలో 20 మందికిపైగా పిట్టల్లా రాలిపోయారు. వాంతులు, కడుపునొప్పి, నాడి పడిపోవడం, నిస్సత్తువతో కుప్పకూలిపోవడం వంటి ఒకేరకమైన లక్షణాలు మరణించడానికి ముందు అందరిలో కనిపించాయి. చాలామంది ఆస్పత్రికి తీసుకెళ్లకముందే చనిపోయారు. కల్తీ మద్యం తాగి తమ వారంతా చనిపోయారని బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరు అయ్యారు. ప్రభుత్వం మాత్రం బాధితుల ఆరోపణలను తోసిపుచ్చింది. విచారణకు ఆదేశించడంగానీ, జిల్లా యంత్రాంగం నుంచి నివేదికలు తెప్పించుకోవడంగానీ చేయలేదు. వరుస మరణాలు సంభవిస్తుండగానే, మార్చి 14న జంగారెడ్డిగూడెం చేరుకున్న చంద్రబాబు బాధిత కుటుంబాలను పరామర్శించారు. జగన్‌ ప్రభుత్వం కళ్లు మూసుకోవడమే కల్తీసారా మరణాలకు కారణమని ఆయన ఆగ్రహించారు. శాసనమండలిలో వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ సభ్యులు నిలదీశారు. ఈ ఘటనపై విచారణ జరపాలని గట్టిగా డిమాండ్‌ చేశారు. దీనిపై నిరసన తెలుపుతున్న టీడీపీ సభ్యులను మండలి నుంచి సస్పెండ్‌ చేశారు. జంగారెడ్డిగూడెంలో నాటుసారా తయారీయే లేదని అసెంబ్లీలో జగన్‌ చేసిన ప్రకటన రాష్ట్రమంతా నిరసనలు, ఆందోళనలను రాజేసింది. సారా మరణాలపై ప్రభుత్వం అబద్ధాలు ఆడటంపై ఎక్కడికక్కడ ప్రజా సంఘాలు విరుచుకుపడ్డాయి.

Updated Date - May 20 , 2025 | 04:03 AM