Chandrababu: టార్గెట్ 2029
ABN , Publish Date - Jun 30 , 2025 | 02:27 AM
మన టార్గెట్ 2029.. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో నిర్మొహమాటంగా ఉంటా. కఠినంగా ఉంటా.. అవసరమైతే ఎవరినైనా వదులుకోవడానికి సిద్ధం.. అని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టమైన సందేశమిచ్చారు.
ఇందుకోసం కఠినంగా ఉంటా: చంద్రబాబు
అవసరమైతే ఎవరినైనా వదులుకుంటా.. ప్రజా మద్దతు ఉన్నవారికే టికెట్లు
2024లో మొహమాటాలకు తావులేకుండా గెలుపే లక్ష్యంగా ఇచ్చాం
వచ్చే ఎన్నికల్లోనూ ఇదే వ్యూహం
ఎమ్మెల్యేలు సీరియ్‌సగా లేకుంటే కష్టం
పనితీరుపై సర్వేలు చేస్తున్నా.. విశ్లేషిస్తున్నా
తప్పులుంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకూ చెబుతా
సరిదిద్దుకుంటే సరి.. లేకుంటే ఇక అంతే
నిర్మొహమాటంగా నిర్ణయం తీసుకుంటా: సీఎం
2024లో మొహమాటాలకు తావులేకుండా గెలుపే లక్ష్యంగా టికెట్లు ఇచ్చాం.. దానివల్లే చాలా మంది యువత, తొలిసారి ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2029లోనూ ఇదే వ్యూహం. పనితీరు బాగా లేనివారికి గుడ్‌బై. కార్యకర్తలతో ప్రజాప్రతినిధులు అనుసంధానం కావాలి. మనకు అధిష్ఠానం వారే. ఎంతో మంది నేతలు పార్టీ మారినా .. కార్యకర్తలు మాత్రం 45 ఏళ్లుగా పార్టీ జెండా మోస్తున్నారు.
అమరావతి, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): ‘మన టార్గెట్ 2029.. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో నిర్మొహమాటంగా ఉంటా. కఠినంగా ఉంటా.. అవసరమైతే ఎవరినైనా వదులుకోవడానికి సిద్ధం..’ అని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టమైన సందేశమిచ్చారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని, పనితీరు బాగోలేని వారికి గుడ్‌బై చెప్పేస్తానని తేల్చిచెప్పారు. ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏడు గంటలపాటు సుదీర్ఘంగా సాగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఏడాది పాలన విజయాల పై ప్రజల్లోకి వెళ్లి వివరించడంపై పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సమావేశం ప్రారంభంలో మాట్లాడిన చంద్రబాబు.. ముగింపులో సుమారు 2 గంటలు ప్రసంగించారు. ముగిం పు సమావేశంలో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు చురకలు అం టించారు. పనిచేయకుండా సలహాలకే పరిమితమయ్యే ఎమ్మెల్యే లు భవిష్యత్ నాయకులుగా ఉండలేరన్నారు. ప్రజల మద్దతు ఉన్నవారికే పదవులైనా, టికెట్లయినా ఇస్తామని స్పష్టం చేశారు. ‘గత ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్ చేశాం. రాష్ట్రంలో మొదటిసారి గా కులాలు, మతాల దామాషా ప్రకారం అందరికీ న్యాయం చేశాం.
వీటన్నింటి పర్యవసానమే 2024 ఎన్నికల సత్ఫలితాలు. ప్రజలు కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని మనకు అధికారం ఇచ్చారు.’ అని తెలిపారు. కాగా.. తొలి అడుగు కార్యక్రమం కారణంగా ప్రభుత్వ సమీక్షల నుంచి మంత్రులకు వెసులుబాటు కల్పించారు.
..లేకుంటే అంతే సంగతి
ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుతోపాటు పాలనపై ఎప్పటికప్పు డు సర్వేల రూపంలో సమాచారం తెప్పించుకుంటున్నానని.. అన్ని సర్వేలను విశ్లేషించి బేరీజు వేస్తున్నానని సీఎం చెప్పారు. ‘ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నాను. వారు చెప్పిన మాటల్లో ఆచరించదగినవి ఉంటే అమలు చేస్తా. వారిలో ఏమైనా తప్పులుంటే సరిచేసుకోవడానికి సమయం ఇస్తా. పనితీరు మార్చుకుంటే సరి.. లేకపోతే అంతే సంగతులు. నిర్మొహమాటంగా నిర్ణయం తీసుకుంటా. ఇది ఎమ్మెల్యేలకే కాదు. నా సొంత నియోజకవర్గంలో ఎవరు తప్పుచేసినా పక్కన పెడతా’ అని తెలిపారు. ‘కొందరు ఎంతో పనిచేస్తారు. కానీ మంచి పేరు రాదు. ఇంకొందరు పెద్దగా పనిచేయకున్నా ప్రజల్లో మంచి పేరు ఉంటుంది’ అని చెప్పారు. ‘ప్రజలు, కార్యకర్తలకు నచ్చని విషయాలు ఉంటే సరిచేసుకుం దాం. ప్రజలు మెచ్చాలి.. కార్యకర్తలు ఆమోదించాలి. ఇప్పుడు గెలిచిన వాళ్లు.. మళ్లీ మళ్లీ గెలవాలన్నదే నా ఆశ. పార్టీలోని ప్రతి ఒక్కరూ అదే తరహాలో ఆలోచన చేయాలి’ అని సూచించారు. డబ్బులు పంచి ఎన్నికల్లో గెలుస్తామనే ధీమా వద్దు.. 2024 ఎన్నికల్లో మనకంటే ఎక్కువ ఖర్చు పెట్టిన వాళ్లకు కేవలం 11 సీట్లే వచ్చాయి. డబ్బులతో ఎన్నికల్లో గెలువలేమనే విషయం స్పష్టమైంది. ఐదేళ్లపాటు పనిచేసి, రూ.4 వేలు పింఛను ఇచ్చి, ఊరూరా రోడ్లువేసి ఎన్నికల్లో డబ్బులు పంచ డం బాధాకరం. ఆదర్శవంతమైన అభివృద్ధి రాజకీయాలు చేద్దాం.
లోకేశ్‌లా పనిచేయాలి..
‘మంచి నాయకులకే ప్రజల్లో గుర్తింపు, గౌరవం ఉంటుంది. చెడ్డ నాయకులకు మంచి నియోజకవర్గం ఇస్తే చెడగొడతారు. మంచి నాయకులకు అలాంటి నియోజకవర్గం ఇచ్చినా మంచిగా మారుస్తా రు. దీనికి ఉదాహరణ లోకేశ్. 2019లో విశాఖపట్నం నుంచి పోటీ చేయాలని ఆయనకు సూచించాను. లేదు.. మంగళగిరిలో పార్టీ ఎప్పుడూ గెలువలేదు.. అక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పారు. నెల ముందు నియోజకవర్గానికి వెళ్లారు. తక్కువ మెజారిటీతో ఓడిపోయారు. ఆ తర్వాత ఐదేళ్లు అక్కడే కష్టపడి పనిచేసి 2024లో మూడో అతిపెద్ద మెజారిటీతో విజయం సాధించారు. గెలిచిన తర్వాత కూడా నియోజకవర్గాన్ని జాగ్రత్తగా చూ సుకుంటున్నారు. తొలిసారి గెలిచిన మిగతావారు కూడా ఇలాగే పనిచేయాలి. నేను 9వసారి ఎమ్మెల్యే అయ్యాను. మొదటిసారి గెలిచిన వాళ్లు కూడా వచ్చి ఏం చేయాలో నాకు చెబుతున్నారు’ అని చంద్రబాబు ఆక్షేపించారు. రాబోయే 30 ఏళ్లకు అవసరమైన నాయకత్వాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో యువతకు అవకాశం ఇస్తున్నానని చెప్పారు. ‘దేశంలోనే యంగెస్ట్ లెజిస్లేచర్ పార్టీ, యంగెస్ట్ పార్లమెంటేరియన్లు ఉన్న పార్టీ టీడీపీ. అమిత్‌షా కూడా ఇదే చెప్పారు’ అని గుర్తుచేశారు.
పింఛన్ల పంపిణీలో పాల్గొనే ఓపికా లేదా?
ప్రతిపక్షంలో ఉంటే ఎంత జాగ్రత్తగా ఉంటామో అధికారంలో ఉన్నప్పుడూ అంతే జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు చెప్పారు. కనీసం పింఛన్ల పంపిణీలో పాల్గొనే ఓపిక కూడా చాలా మంది ఎమ్మెల్యేలకు ఉండడం లేదంటూ తప్పుబట్టారు. ప్రజాప్రతినిధులకు ఏమైనా సమస్యలు ఉంటే బయట మాట్లాడొద్దని, నేరుగా తనకు చెప్పాలన్నారు.
56 మంది డుమ్మాపై ఆగ్రహం
విస్తృతస్థాయి సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జులు మొత్తం 56 మంది గైర్హాజరు కావడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పార్టీ కార్యక్రమాల కంటే ఇతర కార్యక్రమాలు ఎక్కువయ్యాయా? పార్టీ సమావేశాలకే రానివారు ఇక నియోజకవర్గాల్లో ఏం తిరుగుతారు.. ఏం పనిచేస్తారు’ అని మండిపడ్డారు. ఎంత మంది ఎమ్మెల్యేలు వచ్చారు.. ఎంత మంది సంతకాలు పెట్టి వెళ్లిపోయారు.. చివరివరకు ఎంత మంది ఉన్నారనే వివరాలు తీసుకున్న ఆయన.. వారితో మాట్లాడతానని చెప్పారు.
ఎమ్మెల్యేలు.. సమస్యల ప్రస్తావన
కొందరు ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయి సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఏజెన్సీ ప్రాంత ఎమ్మెల్యేలు.. రేషన్ దుకాణాల అంశాన్ని ప్రస్తావించారు. ఏజెన్సీలో ఇళ్లు దూరం దూరంగా ఉం టాయని.. వారంతా రేషన్ తీసుకునేందుకు ఎక్కువ దూరం వెళ్లా ల్సి వస్తోందని చెప్పగా.. దీనిపై కసరత్తు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. తల్లికి వందనం పథకంలో నిబంధనలు మా ర్పులు చేయడం కుదరదని స్పష్టం చేశారు. తమ తమ నియోజకవర్గాల్లో పార్టీ పటిష్ఠానికి వినూత్నంగా పనిచేస్తున్న కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో మాట్లాడించారు. రామ్మోహన్‌నాయుడు కేంద్ర మంత్రిగా బిజీగా ఉన్నా శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న పనులు బాగున్నాయని సీఎం ప్రశంసించారు. నాయకులు ఎలా ఉండకూడదో వివరిస్తూ.. జగన్ సత్తెనపల్లి పర్యటనను ప్రస్తావించారు. ఈ ఘటనపై ఆయన ఇంతవరకు సంతాపం తెలియజేయలేదని, ఇలాంటి వ్యక్తిని నాయకుడిగా భావిస్తే ఎవరికైనా పతనం తప్పదన్నారు.