Share News

CM Chandrababu Naidu: మాతోనే సుస్థిరాభివృద్ధి

ABN , Publish Date - Dec 02 , 2025 | 04:01 AM

ఎన్డీయేతోనే ఏపీ సుస్థిరాభివృద్ధి చెందుతుంది. మా మిత్రుడు పవన్‌కల్యాణ్‌ చెప్పినట్టు, పదిహేనేళ్ల పాటు మా ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారంలో ఉండాలి.

CM Chandrababu Naidu: మాతోనే సుస్థిరాభివృద్ధి
CM Chandrababu Naidu

  • 15 ఏళ్లపాటు అధికారంలో ఉండాలనేది పవన్‌ ఆకాంక్ష

  • మా ఇద్దరిదీ ఒకే ఆలోచన.. మాకు మోదీ సాయం: సీఎం

  • 18 నెలల్లో 50,766 కోట్ల విలువైన పెన్షన్లు

  • పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తాం

  • ఉచిత బస్సుల్లో 25 కోట్ల మహిళల ప్రయాణం

  • వరి ఒక్కటే కాదు, ఇతర పంటలూ వేయాలి

  • జనవరి నాటికి రోడ్లపై గుంతలన్నీ పూడుస్తాం

  • అభివృద్ధి దిశగా విశాఖ, తిరుపతి, అమరావతి

  • ఏలూరు జిల్లా నల్లమాడులో బాబు ఉద్ఘాటన

‘‘నేను తొలిసారి సీఎం అయ్యేనాటికి హైదరాబాద్‌ శివార్లలో జూబ్లీహిల్స్‌ ఉండేది. ఆ ప్రాంతానికి కారు కూడా పోయేది కాదు. హైదరాబాద్‌ గుట్టలు, రాళ్లతో నిండి ఉండేది. హైటెక్‌ సిటీతో ప్రారంభించి.. అభివృద్ధి చేయడంతో చుట్టుపక్కల ఉన్న కోకాపేటలో ఎకరం రూ.పది కోట్ల నుంచి ఇప్పుడు రూ.160 నుంచి రూ.170 కోట్లు పలుకుతోంది. ఇటీవలే 10 ఎకరాలు అమ్మితే రూ.1,350 కోట్ల ఆదాయం తెలంగాణకు వచ్చింది. ఇలాంటివన్నీ జరగాలంటే భూ వినియోగం పక్కాగా ఉండాలి.’’

- సీఎం చంద్రబాబు

ఏలూరు, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ‘‘ఎన్డీయేతోనే ఏపీ సుస్థిరాభివృద్ధి చెందుతుంది. మా మిత్రుడు పవన్‌కల్యాణ్‌ చెప్పినట్టు, పదిహేనేళ్ల పాటు మా ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారంలో ఉండాలి. అప్పుడే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన సాకారమవుతాయి. సంక్షేమం, అభివృద్ధి విషయంలో నాదీ, పవన్‌దీ ఒకే ఆలోచన. మాకు ప్రధాని నరేంద్రమోదీ సహకరిస్తున్నారు’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో సోమవారం ఎన్‌టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. డయాలసిస్‌ చేయించుకుంటున్న గుడ్ల నాగలక్ష్మి ఇంటికి వెళ్లి రూ.10 వేలు పెన్షన్‌ అందించారు. అనంతరం నల్లమాడు ప్రజావేదికపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘విశా ఖ సదస్సులో రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. విశాఖ సహా మూడు ప్రాంతాల అభివృద్దికి ప్రణాళికలను సిద్ధం చేశాం. దీంతో విశాఖ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది.


ప్రపంచంలోనే సుందరమైన అమరావతిని రూపొందించే బాధ్యత తీసుకున్నా. తిరుపతిని డెవలప్‌ చేస్తా. గతంలో అనంతపురంలో రాయదుర్గం ఎడారిగా మారే పరిస్థితి నుంచి కాపాడా. ఆర్థికంగా ఇప్పుడది అగ్ర జిల్లాగా ఎదిగింది. ఇదీ తెలుగుదేశం, నేను, నా మిత్రుడు పవన్‌ కల్యాణ్‌ ఆలోచించే విఽధానం. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యంగా తలసరి ఆదాయాన్ని మూడు లక్షల నుంచి 58 లక్షలకు పెంచటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. డెల్టాలో కంటే మెట్టలో భూముల ధరలు పెరిగాయి. విజన్‌కు ఉండే ప్రభావం అది.’’ అని తెలిపారు.


టెక్నాలజీ వినియోగంపై దృష్టి

‘‘మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు తీరు మారాలి. ఒక పంట తప్పకుండా వరి వేసి , ఆ తర్వాత మిగతా పంటలు కూడా వేయాలి. ఐటీని అందిపుచ్చుకుని తమ పంటల ఉత్పాదకతను రైతులు పెంచుకోవాలి. డ్రోన్‌లను పామాయిల్‌ తోటపై పనిచేసేలా చేస్తే. ఎదుగుదల లేని చెట్టును గుర్తించడం, అవసరమైన చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుంది. రాయలసీమలో హార్టికల్చర్‌.. కోస్తాలో ఆక్వా కల్చర్‌ను వృద్ధి చేస్తున్నాం. ఆక్వా అభివృద్దికి యూనిట్‌ రూపాయిన్నరకే కరెంట్‌ ఇస్తున్నాం. మొన్న ఒకతను విశాఖలో సీ 3 పరిశ్రమ స్థాపనకు ముందుకొచ్చారు.’’

జనవరి నాటికి గుంతలు ఉండవు

‘‘రోడ్ల విషయంలో సమస్యలు ఉన్నాయి. మొన్న రోడ్లన్నీ వేశాం. వర్షాల వల్ల ఆ రోడ్లు దెబ్బతిన్నాయి. జనవరిలోగా గుంతలను పూడ్చే బాధ్యత ప్రభుత్వాని దే. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రూ.52 వేల కోట్లను పెన్షన్లకు వెచ్చిస్తున్నాం. 2027 నాటికి గోదావరి పుష్కరాలకంటే ముందుగానే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఇది చిరకాల వాం ఛ. కొల్లేరు సమస్యను పరిష్కరిస్తాం. ‘సూపర్‌ సిక్స్‌ హామీ అమలుపై ఎగతాళి చేశారు. అయినా ఎక్కడా తగ్గకుండా అన్నీ చేసి హిట్‌ కొట్టాం. 16,347 మందికి టీచర్‌ ఉద్యోగాలిచ్చాం. స్ర్తీ శక్తి పథకం కింద ఉచితంగా బస్సుల్లో ఇప్పటి వరకు 25 కోట్ల మంది ఆడబిడ్డలు తిరిగారు. దీనికి ఆర్టీసీకి రూ.855 కోట్లు చెల్లించాం. పంచసూత్రాల ద్వారా వ్యవసాయాన్ని లాభసాటి చేసే ప్రయత్నం మొదలెట్టాం.’’


ముగ్గురు పిల్లలను కనాల్సిందే

‘‘రాష్ట్ర జనాభా 4.83 కోట్లే ఉంది. కనీసం ఆడ బిడ్డ ముగ్గురు సంతానాన్ని కనాలి. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు లేకపోవడం వల్ల మధ్య వయస్సులోనే చనిపోతున్నారు. 1995లో ఎయిడ్స్‌ మహమ్మారిని తరిమికొట్టేందుకు బహిరంగ చర్చ చేయాలని చెప్పా. ఇప్పుడు ఆ మహమ్మారిని పూర్తిగా తగ్గించిన రాష్ట్రంగా మనమే ప్రథమంగా నిలిచాం’’ అని చంద్రబాబు అన్నారు. కాగా, చంద్రబాబును వరి కంకుల దండతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు సత్కరించారు. తృణధాన్యాలతో తయారుచేసిన చంద్రబాబు చిత్రపటాన్నిబహూకరించారు.

మీకు పెద్దన్నగా ఉంటా..

‘ఏమ్మా ఆరోగ్యం ఎలా ఉంది? మందులు సకాలంలో వేసుకుంటున్నావా? డయాలసిస్‌ ఎక్కడ చేయించుకుంటున్నావు?’ అంటూ కిడ్నీ బాధితురాలు నాగలక్ష్మిని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ‘ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంటోంది. నా భర్త నాగేశ్వరరావు కూలి పని చేస్తుంటాడు. కుమారుడు పవన్‌సాయి ఎంసీఏ పూర్తి చేశాడు. కుమార్తె వాసవి పదో తరగతి చదువుతోంది. నన్ను, నా కుటుంబాన్ని మీరే ఆదుకోవాలి.’’ అంటూ నాగలక్ష్మి సీఎంను ప్రాధేయపడింది. దీనిపై సీఎం స్పందిస్తూ.. ‘అధైర్యపడవద్దు. మీ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటా. మీకు పెద్దన్నగా ఉంటా. నాగేశ్వరరావుకు, పవన్‌కు ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తాం.’’ అని వారికి ఆయన భరోసా కల్పించారు. సీఎం సూచనతో ఆమెను తాడేపల్లిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్య సహాయం అందించారు. నల్లమాడులో సోమవారం జరిగిన ‘పేదల కోసం ప్రజావేదిక’ సమావేశంలో బంగారు కుటుంబాల సమస్యలు గురించి వారి మార్గదర్శులతో ముఖాముఖి నిర్వహించారు. బంగారు కుటుంబ సభ్యురాలు శాఖమూరి మణితో మాట్లాడారు.

బాబు దశాబ్దం కిందటే తెచ్చారు!

బంగారు కుటుంబ మార్గదర్శి పసుపులేటి రామారావు మాట్లాడుతూ... ‘‘నేను ఈ కార్యక్రమం కోసం ముంబై నుంచి వచ్చాను. శనివారం ముంబైలో వికసిత్‌ భారత్‌ సమ్మిట్‌ - 2047లో పాల్గొన్నా. ఈ సమ్మిట్‌కు లండన్‌ నుంచి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ సుభా్‌షజీ హాజరయ్యారు. నేను ఆయనతో మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చినట్టు తెలపగా, ఆయన సంతోషించారు. ‘‘మోదీ వికసిత్‌ భారత్‌ 2047 అన్నారు. కానీ మీ చంద్రబాబు దశాబ్దం క్రితమే తీసుకొచ్చారు. చంద్రబాబును 1996లో కలిశాను.. 2025లో మరలా కలిశాను. అందరికీ వయస్సు ముందుకు పోతుంది.. కానీ మీ చంద్రబాబుకు వయస్సు వెనక్కి వస్తుంది’ అని వ్యాఖ్యానించినట్టు తెలపగా సభలో నవ్వులు విరిశాయి.


పెన్షన్‌తో పాటు శ్రీవారి ప్రసాదం

కుప్పం, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా కుప్పం మండలం కంగుంది పంచాయతీ ఎస్సీ ఎస్టీ కాలనీలో సోమవారం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లతో పాటు తిరుమల శ్రీవారి లడ్డూలను అందజేశారు. నెలకు ఒక్కో కాలనీ చొప్పున సుమారు 100-150 మంది పింఛనుదారులకు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఇలా అందించనున్నట్లు టీటీడీ బోర్డు సభ్యుడు వైద్యం శాంతారాం తెలిపారు.

Untitled-2 copy.jpg


ఈ వార్తలు కూడా చదవండి:

Caste Remarks: మరో వివాదంలో ఐపీఎస్‌ సునీల్‌

Cyclonic Circulation: చెన్నైకి చేరువగా తీవ్ర వాయుగుండం

Updated Date - Dec 02 , 2025 | 06:50 AM