Cyclonic Circulation: చెన్నైకి చేరువగా తీవ్ర వాయుగుండం
ABN , Publish Date - Dec 02 , 2025 | 06:34 AM
దిత్వా తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత బంగాళాఖాతంలో తీరానికి సమాంతరంగా అతి నెమ్మదిగా ఉత్తరం వైపు పయనిస్తోంది.
నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు
నేడు, రేపు కూడా..
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
‘దిత్వా’ తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత బంగాళాఖాతంలో తీరానికి సమాంతరంగా అతి నెమ్మదిగా ఉత్తరం వైపు పయనిస్తోంది. గంటకు సగటున ఐదారు కిలోమీటర్ల వేగంతో తమిళనాడు, పుదుచ్చేరికి అతి సమీపంగా పయనిస్తూ సోమవారం మధ్యాహ్నానికి చెన్నైకి చేరువగా వచ్చింది. చెన్నైకి తూర్పున 50 కి.మీ., నెల్లూరుకు దక్షిణ ఆగ్నేయంగా 170 కి.మీ. దూరంలో కొనసాగుతోంది. మరో రెండు రోజులు ఉత్తరంగానే పయనించి చెన్నైకి ఉత్తరంగా తీరం దాటడంలేదా, సముద్రంలో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తాలో పలుచోట్ల, మధ్య, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ సోమవారం వర్షాలు కురిశాయి. మేఘాలు ఆవరించడంతో చలి వాతావరణం నెలకొంది. నెల్లూరు జిల్లాలో వేకువజాము నుంచి రాత్రి వరకూ ఎడతెరిపి లేని వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. నెల్లూరు కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్ నుంచి అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. నెల్లూరు జిల్లాలోని రాపూరు మండలం పెంచలకోనలో జలపాతం ఆకట్టుకుంటోంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు దక్షిణ కోస్తాలో అనేకచోట్ల, ఉత్తరకోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు, కోనసీమ, పశ్చిమగోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి గంటకు 50 నుంచి 60, అప్పుడప్పుడు 70 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని పేర్కొంది. మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, కృష్ణపట్నంలో రేవుల్లో మూడో నంబరు, మిగిలిన రేవుల్లో ఒకటో నంబరు హెచ్చరిక ఎగురవేశారు.
అందుకే బలహీనపడింది..
శనివారం రాత్రి నుంచి తీరానికి అతి సమీపంగా తమిళనాడుకు ఆనుకుని పయనించడంతో తుఫాన్ బలహీనపడుతూ వచ్చింది. తీరానికి ఆనుకుని పయనించడం, పొడిగాలులు తుఫాన్ వైపుగా వెళ్లడం వల్ల తుఫాన్ బలహీనపడిందని ఇస్రో వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కొనసాగుతాయన్నారు. మంగళవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.