Share News

CBI: వివేకా వాచ్‌మన్‌ రంగయ్య మృతిపై కేసు నమోదు

ABN , Publish Date - Mar 07 , 2025 | 07:39 AM

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మన్‌ అయిన తన భర్త రంగయ్య మృతి పట్ల అనుమానాలున్నాయని ఆయన భార్య సుశీలమ్మ ఫిర్యాదు చేశారు.

 CBI: వివేకా వాచ్‌మన్‌ రంగయ్య మృతిపై కేసు నమోదు
YS Viveka Murder Case

ఆర్కేవ్యాలీ సీఐకి దర్యాప్తు బాధ్యత

వివేకా హత్య కేసులో నలుగురు సాక్షులు మృతి

కారణాల వెలికితీతకు డీఎస్పీ నేతృత్వాన కమిటీ: ఎస్పీ

పులివెందుల, మార్చి 6(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మన్‌ అయిన తన భర్త రంగయ్య మృతి పట్ల అనుమానాలున్నాయని ఆయన భార్య సుశీలమ్మ ఫిర్యాదు చేశారు. దీంతో పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. రంగయ్య బుధవారం అనారోగ్యంతో కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం విదితమే. గురువారం మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. శుక్రవారం అంత్యక్రియలు జరుగుతాయి. వివేకా హత్య కేసులో ఏకైక ప్రత్యక్ష సాక్షిరంగయ్యే. దీనిపై గురువారం రాత్రి తన కార్యాలయంలో ఎస్పీ అశోక్‌ కుమార్‌ విలేకర్లతో మాట్లాడారు. ‘హత్య కేసులో ఇప్పటి వరకు నలుగురు సాక్షులు మృతి చెందారు. ప్రధాన సాక్షిగా ఉన్న రంగయ్య మృతిపై ఆయన భార్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టుగా కేసు నమోదు చేసి విచారిస్తున్నాం. సాక్షులు చనిపోవడం వెనుక నిజానిజాలు తెలుసుకునేందుకు ఓ డీఎస్పీ నేతృత్వంలో వివిధ విభాగాల నిపుణులతో జట్టు ఏర్పాటు చేసి విచారిస్తున్నాం. సాక్షుల మరణాలకు కారణాలను వెలుగులోకి తెస్తాం. సాక్షుల మృతి వెనుక సీబీఐ, పోలీసులు ఉన్నారనే ఆరోపణలు సరికాదు. రంగయ్య మృతి కేసు దర్యాప్తు బాధ్యతలను ఆర్కే వ్యాలీ సీఐ ఉలసయ్యకు అప్పగించాం. పోస్టుమార్టం వివరాలు వస్తే రంగయ్య మృతికి కారణాలు తెలుస్తాయి’ అని ఎస్పీ అశోక్‌ కుమార్‌ తెలిపారు.

పూర్తి స్థాయి విచారణ: బీటెక్‌ రవి

‘వివేకా హత్య కేసులో సాక్షులు మరణిస్తున్నారు. కారణాలను కనుక్కోవాల్సిన అవసరం ఉంది. వాచ్‌మన్‌ రంగయ్య మృతిపై కూడా పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాం. నిజానిజాలు తేలేవరకూ వరకూ రంగయ్య మృతిని అనుమానాస్పదంగానే చూస్తున్నాం’ అని పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్‌ రవి పులివెందులలో అన్నారు.

Updated Date - Mar 07 , 2025 | 09:31 AM