Share News

రంగన్నపై విషప్రయోగం?

ABN , Publish Date - Mar 14 , 2025 | 04:37 AM

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి వాచ్‌మాన్‌ రంగన్న విషప్రయోగం వల్ల చనిపోయారనే ప్రచారం సాగుతోంది. ఆయన మరణానికి స్లోపాయిజన్‌ కారణం కావచ్చుననే చర్చ జరుగుతోంది.

రంగన్నపై విషప్రయోగం?

  • స్లో పాయిజన్‌ ఇచ్చినట్టు అనుమానం.. దర్యాప్తులో వేగం పెంచిన సిట్‌

కడప/పులివెందుల, మార్చి 13(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి వాచ్‌మాన్‌ రంగన్న విషప్రయోగం వల్ల చనిపోయారనే ప్రచారం సాగుతోంది. ఆయన మరణానికి స్లోపాయిజన్‌ కారణం కావచ్చుననే చర్చ జరుగుతోంది. ఆయన మృతదేహం నుంచి 20 రకాల నమూనాలను రీ పోస్టుమార్టం సమయంలో ఫోరెన్సిక్‌ బృందం గత శనివారం సేకరించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ నమూనాలను నాలుగు ల్యాబ్‌లకు పంపారు. వాటినుంచి రిపోర్టులు వస్తేగానీ రంగన్న మృతికి గల అసలు కారణం తెలీదు. మరోవైపు సిట్‌ బృందం తన దర్యాప్తు ముమ్మరం చేసింది. గురువారం ఈ బృందంలోని కొందరు అధికారులు పులివెందులలోని బాకరాపురంలోని రంగన్న ఇంటిని, చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితిపై చుట్టుపక్కల వారిని అడిగి తెలుసుకున్నారు.


రాత్రి సమయాల్లో రంగన్న ఆరోగ్య సమస్యలతో ఏమైనా బాధపడుతుండేవారా అని విచారించారు. రంగన్న మృతిచెందిన రోజు ఉదయం సెక్యూరిటీ ఎవరు ఉన్నారనే విషయాన్ని అక్కడ అడిగి తెలుసుకున్నారు. ఈ వివరాలన్నింటినీ క్షుణ్ణంగా రాతపూర్వకంగా నమోదు చేసినట్లు తెలిసింది. అలాగే రంగన్న ఎన్ని గంటలకు అస్వస్థతకు గురయ్యారు, ఎన్ని గంటలకు పులివెందుల ఆస్పత్రికి తీసుకెళ్లారు, అక్కడి నుంచి రిమ్స్‌కు ఎప్పుడు తరలించారనే వివరాలను విచారణలో భాగంగా మొదటి రోజు సేకరించినట్లు తెలిసింది. పులివెందుల ఆస్పత్రిలో ఎలాంటి ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు, ఏయే మందులు వాడారనే వివరాలను రెండోరోజు విచారణలో భాగంగా అక్కడి వైద్యులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Mar 14 , 2025 | 04:37 AM