Share News

Supreme Court: తురకా కిశోర్‌కు సుప్రీంలో చుక్కెదురు

ABN , Publish Date - Jul 30 , 2025 | 04:41 AM

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, మాచర్ల మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ తురకా కిశోర్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది

Supreme Court: తురకా కిశోర్‌కు సుప్రీంలో చుక్కెదురు

  • పిటిషన్‌ స్వీకరణకు నిరాకరించిన ధర్మాసనం

న్యూఢిల్లీ, జూలై 29(ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, మాచర్ల మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ తురకా కిశోర్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఏపీ ప్రభుత్వం తనపై వరుసగా కేసులు నమోదు చేస్తోందని, ఇకపై ఎటువంటి ఎఫ్‌ఐఆర్‌ తనపై నమోదు చేయకుండా తగు ఆదేశాలివ్వాలని కోరుతూ ఈ నెల 25న సుప్రీం కోర్టులో కిశోర్‌ పిటిషన్‌ వేశారు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పటి వరకు తనపై తొమ్మిది కేసులు నమోదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ పిటిషన్‌ మంగళవారం జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ముందే కేసులు నమోదు చేస్తారని మీరెలా చెబుతున్నారు? అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘ఇప్పటి వరకు వరుసగా, ఒకదాని తర్వాత మరొకటి... కేసులు నమోదు చేస్తూ వచ్చారు. మరికొన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని మాకు తెలిసింది. అందుకే ముందస్తు జాగ్రత్తలో భాగంగా సుప్రీం కోర్టును ఆశ్రయించాం’ అని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఆ వాదనలతో విభేదించిన ధర్మాసనం రిట్‌ పిటిషన్‌ విచారణకు స్వీకరించడానికి నిరాకరించింది.

Updated Date - Jul 30 , 2025 | 04:41 AM