Share News

Kasireddy Bail Rejected: సుప్రీంలో కసిరెడ్డికి చుక్కెదురు

ABN , Publish Date - May 24 , 2025 | 03:34 AM

మద్యం కుంభకోణంలో నిందితుడు రాజ్‌ కసిరెడ్డి, అతని తండ్రి దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. బెయిల్‌కు సంబంధిత దిగువ కోర్టును ఆశ్రయించాలని ధర్మాసనం సూచించింది.

Kasireddy Bail Rejected: సుప్రీంలో కసిరెడ్డికి చుక్కెదురు

మద్యం కేసులో రాజ్‌, ఆయన తండ్రి పిటిషన్లను కొట్టివేసిన ధర్మాసనం

బెయిల్‌ కోసం దిగువ కోర్టును ఆశ్రయించాలని సూచన

న్యూఢిల్లీ, మే 23(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో కీలక నిందితుడు రాజ్‌ కసిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాజ్‌ కసిరెడ్డితో పాటు ఆయన తండ్రి దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నందున బెయిల్‌ కోసం సంబంధిత కోర్టునే ఆశ్రయించాలని సుప్రీం కోర్టు సూచించింది. మద్యం కుంభకోణం కేసులో సీఐడీ సీఆర్పీసీ 160 ప్రకారం తనకు నోటీసులు జారీ చేసిందని, హైదరాబాద్‌లో ఉంటున్న తనకు నోటీసులు జారీ చేసే అధికారం ఏపీ సీఐడీకి లేదంటూ ఏప్రిల్‌ 10న రాజ్‌ కసిరెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తన కుమారుడు రాజ్‌ కసిరెడ్డి అరెస్టు అక్రమమని, తన కుమారుడికి జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ ఆయన తండ్రి ఉపేందర్‌ రెడ్డి హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. ఏసీబీ కోర్టు ఉత్తర్వుల్లో జోక్యానికి న్యాయస్థానం నిరాకరించింది. హైకోర్టు తీర్పును మే 9న ఉపేందర్‌ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఆ రెండు పిటిషన్లపై సుధీర్ఘ వాదనల తర్వాత గత సోమవారం సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. శుక్రవారం జస్టిస్‌ జేబీ పార్దివాలా నేతృత్వంలో జస్టిస్‌ మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. అరెస్టు అక్రమమా? కాదా? అనే అంశంలోకి తాము వెళ్లడం లేదని ధర్మాసనం తెలిపింది. రాజ్‌ కసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌లోని అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 17ఏ, 19పై తమకు కొన్ని ప్రశ్నలు ఉన్నందున, దానిని విస్తృత ధర్మాసనం పరిశీలనకు ప్రతిపాదిస్తున్నట్టు జస్టిస్‌ పార్దివాలా తెలిపారు. రాజ్‌ కసిరెడ్డి జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నందున ఏదైనా రెగ్యులర్‌ బెయిల్‌ దరఖాస్తు పెండింగ్‌లో ఉంటే, దానిని వీలైనంత త్వరగా విచారణకు తీసుకోవాలని సంబంధిత కోర్టుకు సూచించారు. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ్‌ లూథ్రా, సిద్ధ్దార్థ్‌ అగర్వాల్‌, పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది మహేశ్‌ జెఠ్మలానీ, అల్లంకి రమేశ్‌ వాదనలు వినిపించారు.

Updated Date - May 24 , 2025 | 03:36 AM