Share News

Agricultural Department: బదిలీల హడావుడిలో ఉద్యోగులు..

ABN , Publish Date - Jun 04 , 2025 | 05:02 AM

రాయితీ విత్తనాల సరఫరాలో బదిలీల కారణంగా ఉద్యోగులు హడావుడి పడుతున్నారని అధికారులు తెలిపారు. విత్తనాలు పూర్తిస్థాయిలో రైతు సేవా కేంద్రాలకు చేరడం లేదని వ్యవసాయశాఖ తెలిపింది.

Agricultural Department: బదిలీల హడావుడిలో ఉద్యోగులు..

  • రాయితీ విత్తన పంపిణీలో తాత్సారం

  • రైతు సేవా కేంద్రాలకు పూర్తిస్థాయిలో చేరని విత్తనాలు

అమరావతి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు వచ్చేసినా, ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభమైనా రైతులకు రాయితీ విత్తనాల పంపిణీ పూర్తి స్థాయిలో సాగడం లేదు. ఈ సీజన్‌కు అవసరమైన విత్తనాలకు సంబంధించిన రాయితీ సొమ్మును ఆర్థికశాఖ సకాలంలో విడుదల చేయకపోవడంతో సరఫరాలో జాప్యం జరిగిందని అధికారులు చెప్తున్నారు. ఈ సీజన్‌ ఇండెంట్‌లో కొంత మేరకే ఏపీ సీడ్స్‌ నుంచి క్షేత్రస్థాయికి విత్తనాలు తరలించారు. రాయితీ విత్తనాలకు రైతుల రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి అయినందున రైతు సేవా కేంద్రాల్లో గ్రామ వ్యవసాయ సహాయకులు రైతుల వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ సీజన్‌లో 70 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు అవసరమైతే.. ఇప్పటికి 30 వేల క్వింటాళ్లు మాత్రమే రావడంతో కొంత పంపిణీ జరిగింది. రాయలసీమలో రైతులకు 2 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు అందించాల్సి ఉండగా, 78 వేల క్విం టాళ్ల విత్తనాలు క్షేత్రస్థాయికి వచ్చాయి. ఇక కోస్తా రైతులకు పంచాల్సిన 2.25 లక్షల క్వింటాళ్ల వరి వంగడాల్లో 62 వేల క్వింటాళ్లు మాత్రమే రైతుసేవా కేంద్రాలకు చేరాయి. గత నెల 15 నుంచి వ్యవసాయశాఖ ఉద్యోగులు సాధారణ బదిలీల హడావుడిలో ఉండటం, ఈ ప్రక్రియను ఈనెల 9 వరకు పొడిగించడంతో విత్తన పంపిణీపై అధికారులు దృష్టి పెట్టలేకపోతున్నారని అంటున్నారు. ప్రస్తుతం రుతుపవనాల కదలిక మందకొడిగా ఉన్నందున మిగతా విత్తనాలను కూడా తెప్పించి ఈనెల మూడో వారం నాటికి రైతులకు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాగా ‘సీజనొస్తున్నా.. సరఫరా ఏదీ..?’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంపై ఆర్థికశాఖ స్పందించింది. గతేడాది విత్తన బకాయిలకు రూ.130 కోట్లు విడుదల చేసింది. రూ.110 కోట్లకు బిల్లులు ప్రాసెస్‌లో ఉన్నాయి. ప్రస్తుతం విత్తన రాయితీ కింద నిధులు విడుదల చేస్తేనే పూర్తి స్థాయిలో సరఫరా జరుగుతుందని సమాచారం.

Updated Date - Jun 04 , 2025 | 05:03 AM