SSC Results: తప్పు ఎవరిదైనా విద్యార్థుల జేబు ఖాళీ
ABN , Publish Date - May 31 , 2025 | 03:59 AM
పదో తరగతి ఫలితాల తర్వాత రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌లో మార్కులు పెరిగిన విద్యార్థులు తమ ఫీజులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మూల్యాంకనంలో జరిగిన తప్పుకు విద్యార్థులే ఫీజు చెల్లించాలనడం అన్యాయం అని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
రీకౌంటింగ్‌కు 500, రీవెరిఫికేషన్‌కు 1000
మార్కులు మారినా డబ్బులు వెనక్కివ్వరు
విద్యా శాఖ తప్పులకు విద్యార్థులపై భారం
మూల్యాంకనంలో గురువుల పొరపాట్లపై
విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు
వారంలోనే మూల్యాంకనం పూర్తిపై విస్మయం
అమరావతి, మే 30(ఆంధ్రజ్యోతి): పదో తరగతి విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనంలో తప్పు ఎవరిదైనా.. విద్యార్థుల జేబులు ఖాళీ అవుతున్నాయి. తప్పులను సవాలు చేస్తున్న విద్యార్థులు తమ పొరపాటు లేకపోయినా.. ఫీజులు వదులుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఫలితాల అనంతరం రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు.. మార్కులు పెరిగితే కనుక తాము కట్టిన ఫీజును తిరిగివ్వాలని కోరుతున్నారు. తప్పు తమది కాదు కాబట్టి.. ఆ ఫీజుల భారాన్ని తామెందుకు భరించాలని ప్రశ్నిస్తున్నారు. ఒక్కొక్క సబ్జెక్టు రీకౌంటింగ్‌కు రూ.500, రీవెరిఫికేషన్‌కు రూ.వెయ్యి దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎన్ని సబ్జెక్టులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోరితే అంత మొత్తం చెల్లించాలి. ఈ ఏడాది 64,251 పేపర్లకు రీవెరిఫికేషన్ కోసం రూ.6.42 కోట్లు విద్యార్థులు చెల్లించారు. రీకౌంటింగ్ కోసం 2,112 పేపర్లకు రూ.10.56 లక్షలు చెల్లించారు. వీరిలో సుమారు 11 వేల మందికి మార్కుల్లో మార్పు వచ్చింది. విద్యార్థులు ఊహించినట్లుగా మూల్యాంకనంలో పొరపాట్లు జరగడం వల్ల మార్కులు పెరిగాయి. ఈ 11 వేల మంది సుమారు రూ.కోటి దరఖాస్తు ఫీజు రూపంలో కట్టారు. అయితే, మార్కులు పెరిగిన తర్వాత తమ ఫీజులు ఎందుకు వెనక్కి ఇవ్వరని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అంటే పేపర్లను మళ్లీ పరిశీలించాలి కాబట్టి ఆ మేరకు దరఖాస్తు ఫీజులు నిర్ణయించారు. అయితే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అనంతరం మార్కులు పెరగకపోతే అది విద్యార్థుల పొరపాటే అవుతుంది. కానీ, మార్కులు పెరగడం అంటే అది ఖచ్చితంగా ఆ పేపరు దిద్దిన వారి పొరపాటు అవుతుంది. అంటే దానికి పాఠశాల విద్యాశాఖ బాధ్యత వహించాలి. ఈ నేపథ్యంలో మార్కులు పెరగకపోయినా, పెరిగినా ఫీజులు మాత్రం వెనక్కి ఇవ్వకపోవడం అనే విధానం సరికాదనే వాదన వినిపిస్తోంది. పాఠశాల విద్యాశాఖ తప్పు చేస్తే దాన్ని నిరూపించేందుకు తామెందుకు ఫీజులు చెల్లించాలనేది విద్యార్థుల ప్రశ్న. కొందరు విద్యార్థులు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కూడా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేస్తూ ఉంటారు. అలాంటి వారి వల్ల పాఠశాల విద్యాశాఖ సమయం వృథా అవుతుంది కాబట్టి ఫీజులు తీసుకోవడంలో అర్థం ఉందని, కానీ మూల్యాంకనం చేసిన వారి పొరపాట్లకు తాము మానసిక క్షోభ అనుభవించడంతో పాటు ఫీజు కూడా కట్టాలా? అని ప్రశ్నిస్తున్నారు. ఫలితాల అనంతరం మార్కులు పెరిగితే ఫీజులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏడు రోజుల్లోనే మూల్యాంకనం
ఈ ఏడాది 6,19,286 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. ఏప్రిల్ 3న మూల్యాంకనం ప్రారంభించిన అధికారులు ఏడు రోజుల్లోనే ముగించారు. దీనిపైనా విద్యార్థుల తల్లిదండ్రులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దాదాపుగా ఇవే సంఖ్య ఉన్న పేపర్లను 10 నుంచి 15 రోజుల పాటు మూల్యాంకనం చేసేవారు. కానీ గత కొంతకాలంగా మూల్యాంకనం తీరు మారింది. త్వరగా ఫలితాలు ఇవ్వాలనే తొందరలో అధికారులు టీచర్లను మూల్యాంకనం విషయంలో పరుగులు పెట్టిస్తున్నారు. ఉదాహరణకు ఒక టీచర్ రోజుకు కనీసం 40 పేపర్లు దిద్దాలి. ఒకవేళ టీచర్ ఒక రోజు ఆ సంఖ్యలో పేపర్లు దిద్దకపోతే ఆ తర్వాత రోజు ఆ మేరకు సంఖ్య పెంచుతున్నారు. దీనివల్ల టీచర్లపైనా ఒత్తిడి పెరుగుతోంది. పైగా సాయంత్రం మూల్యాంకనం ముగిసే సమయంలో హడావుడిగా పేపర్లు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా విద్యార్థులు నష్టపోతున్నారు.
అంచనా తప్పుతోంది
గతంలో బిట్ పేపర్ ఉన్నప్పుడు మూల్యాంకనం చేసేవారికి ఒక అంచనా ఉండేది. మూల్యాంకనం చేసేవారు మొదట బిట్ పేపర్ దిద్దేవారు. బిట్ పేపర్‌లో ఎక్కువ మార్కులు వస్తే ఆ విద్యార్థి మెరుగ్గా ఉన్నట్టు భావించి, వ్యాసరూప ప్రశ్నల విషయంలోనూ జాగ్రత్తగా మూల్యాంకనం చేసేవారు. అదే బిట్ పేపర్‌లో తక్కువ మార్కులు వస్తే, వ్యాసరూప ప్రశ్నల మూల్యాంకనానికి ఎక్కువ కష్టపడాల్సి వచ్చేది కాదు. కానీ, ఇప్పుడు బిట్, వ్యాసరూప ప్రశ్నలను ఒకే సమాధానపత్రంలో రాస్తున్నారు. చాలా మంది విద్యార్థులు ఒక మార్కు ప్రశ్నలకు బుక్‌లెట్ చివర్లో సమాధానం రాస్తున్నారు. కొందరు మధ్యలో రాస్తారు. దీంతో టీచర్లు దిద్దే పేపరుపై ఒక అంచనాకు రాలేకపోతున్నారనే వాదన ఉపాధ్యాయుల నుంచి వినిపిస్తోంది. దీనికి తగిన పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు
Read Latest AP News And Telugu News