Road Development : సరికొత్తగా రహదారులు!

ABN , First Publish Date - 2025-02-16T05:08:14+05:30 IST

జాతీయ రహదారుల స్థాయిలో రాష్ట్రంలో స్టేట్‌ హైవేల అభివృద్ధికి రంగం సిద్ధమైంది. రోడ్లపై ఎక్కడా గుంతలు లేకుండా ప్రయాణం సాఫీగా సాగిపోయేందుకు కూటమి ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తోంది.

Road Development : సరికొత్తగా రహదారులు!

  • పీపీపీ విధానంలో రాష్ట్ర హైవేల అభివృద్ధి .. 10,200 కి.మీ. మేర విస్తరణకు ప్రణాళికలు

  • ముందుగా 3,967 కోట్లతో 5,238 కి.మీ.లలో..

  • నివేదికలు అందిన తర్వాత టెండర్ల ప్రక్రియ

  • వీజీఎఫ్‌ కింద 20శాతం భరించనున్న కేంద్రం

  • భూ సేకరణకయ్యే వ్యయం రాష్ట్ర ప్రభుత్వానిదే

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జాతీయ రహదారుల స్థాయిలో రాష్ట్రంలో స్టేట్‌ హైవేల అభివృద్ధికి రంగం సిద్ధమైంది. రోడ్లపై ఎక్కడా గుంతలు లేకుండా ప్రయాణం సాఫీగా సాగిపోయేందుకు కూటమి ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో రహదారుల వ్యవస్థను యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేయడం ద్వారా పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని సర్కారు విశ్వసిస్తోంది. రహదారి కారిడార్‌ నెట్‌వర్క్‌ బలపడితే రవాణా వ్యవస్థ మరింత మెరుగవుతుందని, పెట్టుబడులు కూడా వస్తాయని ఆశిస్తోంది. దీనిలో భాగంగా ఎన్‌హెచ్‌ల స్థాయిలో రాష్ట్ర ప్రధాన రోడ్ల (స్టేట్‌ హైవేల)ను పబ్లిక్‌, ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో విస్తరించాలని నిర్ణయించింది. కేంద్ర సర్కారు కూడా ఇదే విధానంలో జాతీయ రహదారులను నిర్మిస్తోంది. గతంలో రాష్ట్రంలోనూ మూడు ప్రధాన రహదారులను గతంలో పీపీపీ విధానంలో అభివృద్ధి చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో 10,200 కి.మీ. మేర రహదారులను ఈ విధానంలో విస్తరించి, అభివృద్ధి చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే కొన్ని రోడ్లను ఎంపిక చేశారు. వాటి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కొనసాగుతోంది. ఆ నివే దికలు వచ్చిన తర్వాత ఎంపిక చేసిన తొలిదశ రహదారుల నిర్మాణానికి టెండర్లు పిలవనుంది. వచ్చే 3నెలల్లో ఈ ప్రక్రియ కొలిక్కివస్తుందని ఆర్‌అండ్‌బీ వ ర్గాలు చెబుతున్నాయి. ప్రైవేట్‌ భాగస్వామ్యంలో రహదారుల నిర్మాణం పూర్తయితే వాటి నిర్వహణకు టోల్‌గేట్లు ఏర్పాటుచేసి వాహనరుల నుంచి ఫీజులు వసూలు చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఆర్‌అండ్‌బీ నియంత్రణలో 45,378 కి.మీ. రహదారులు ఉన్నాయి. ఇందులో గ్రామీణ, మండల, జిల్లా కేంద్రాలతో అనుసంధానమైన జిల్లా ప్రధాన రహదారులు (ఎండీఆర్‌) 32,725 కిలోమీటర్లు, డివిజనల్‌ కేంద్రాలు, జిల్లాలను అనుసంధానించే స్టేట్‌ హైవేలు 12,653 కి.మీ. మేర ఉన్నాయి.


రాష్ట్ర ప్రధాన రహదారుల్లో 10,200 కి.మీ. రోడ్లను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయనున్నారు. దీనికయ్యే వ్యయంలో 20శాతం వయబులిటీ గ్యాప్‌ ఫండ్‌ (వీజీఎఫ్‌) కింద కేంద్రం, మరో 20శాతం రాష్ట్ర సర్కారు ఇస్తాయి. రహదారుల విస్తరణకు అవసరమైన భూ సేకరణకయ్యే ఖర్చును కూడా రాష్ట్రమే భరిస్తుంది. మిగిలిన మొత్తం కాంట్రాక్ట్‌ సంస్థ భరించాలి. రహదారి నిర్మాణం తర్వాత 20 లేదా 30 ఏళ్ల పాటు కాంట్రాక్ట్‌ సంస్థకు అప్పగిస్తారు. ఆ సంస్థ టోల్‌ప్లాజాను ఏర్పాటుచేసి వాహనదారుల నుంచి ఫీజు వసూలు చేస్తుంది. టోల్‌ ఎంత ఉండాలి, ఎంత కాలం అనేది రహదారి నిర్మాణానికి అయ్యే వ్యయం, కాంట్రాక్ట్‌ అగ్రిమెంటు ప్రకారం నిర్ణయిస్తారు.

తొలి దశలో 5,238 కి.మీ. అభివృద్ధి

ఈ ప్రాజెక్టు తొలిదశలో రూ.3,967 కోట్ల వ్యయంతో 5,238 కి.మీ. స్టేట్‌హైవేలను అభివృద్ధి చేయాలని ఆర్‌అండ్‌బీ ప్రణాళిక రూపొందించింది. కనీసం 20 కి.మీ. పైగా పొడవైన రహ దారులను గుర్తించి వాటిని విస్తరణ జాబితాలోకి తీసుకొస్తారు. దీనిలో భాగంగా ప్యాకేజీ-1ఏ కింద రూ.3,296 కోట్ల వ్యయంతో 1,307 కి.మీ. రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ కేటగిరీలో వర్క్‌లను ఏడు ప్యాకేజీల కింద విభజించారు. ఒక్కో ప్యాకేజీలో సగటున రెండు స్టేట్‌ హైవేలు ఉన్నాయి.


జగన్‌ హయాంలో రోడ్లన్నీ ధ్వంసం

ఉమ్మడి రాష్ట్రంలో రహదారుల నిర్వహణకు రూ.వేల కోట్ల బడ్జెట్‌ ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత ఈ బడ్జెట్‌ గణనీయంగా తగ్గిపోయింది. ఎక్కువగా కేంద్రం ఇచ్చే సీఆర్‌ఐఎఫ్‌ వంటి నిధులతోనూ, నాబార్డుతో పాటు అంతర్జాతీయంగా తీసుకొచ్చే అప్పులతోనే ప్రాజెక్టులు చేపడుతున్నారు. జగన్‌ హయాంలో రాష్ట్ర, జిల్లా, గ్రామీణ రహదారుల నిర్వహణ ఘోరంగా తయారైంది. నిధుల కేటాయింపు చూపినా ఆచరణలో వాటిని విడుదల చేయకపోవడంతో రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రోడ్లపై గుంతలు పూడ్చడానికి తట్టెడు మట్టి వేసేందుకు రూపాయి కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం వచ్చాక రహదారి మరమ్మతులకు ప్రాధాన్యం ఇచ్చింది. ఈ నెలాఖరు నాటికి రోడ్లన్నీ గుంతల రహితంగా మార్చడమే లక్ష్యంగా ఆర్‌అండ్‌బీకి రూ.828 కోట్లు కేటాయించింది.

ప్యాకేజీ-1:

1. చిలకలపాలెం-రామభద్రాపురం-రాయగడ. 2. విజయనగరం-పాలకొండ. ఈ రెండు రహదారుల పొడవు 203 కి.మీ. వీటి నిర్మాణం కోసం రూ.508 కోట్ల వ్యయం కానుందని అంచనా.

ప్యాకేజీ-2

1. కళింగపట్నం-శ్రీకాకుళం-పార్వతీపురం, 2. భీమునిపట్నం-నర్సీపట్నం. ఈ రహదారుల పొడవు 192 కి.మీ. కాగా, నిర్మాణ వ్యయం రూ.480 కోట్లుగా అంచనా వేశారు.

ప్యాకేజీ-3

1. కాకినాడ- జొన్నాడ, 2. కాకినాడ- రాజమండ్రి, 3. ఏలూరు- మేడిశెట్టివారిపాలెం. ఈ మూడు రోడ్ల పొడవు 185. కి.మీ. నిర్మాణ వ్యయం రూ.463 కోట్ల మేర ఉంటుందని అంచనా.


ప్యాకేజీ-4

1. నరసాపురం-అశ్వారావుపేట, 2. ఏలూరు-జంగారెడ్డిగూడెం, 3. గుంటూరు-పర్చూరు. ఈ మూడింటి పొడవు 194 కి.మీ. నిర్మాణ వ్యయం రూ.485 కోట్లుగా అంచనా వేశారు.

ప్యాకేజీ-5

1. గుంటూరు-బాపట్ల, 2. మంగళగిరి-తెనాలి-నారాకోడూరు, 3, బెస్తవారిపేట-ఒంగోలు. ఈ మూడు రోడ్ల పొడవు 205 కి.మీ. నిర్మాణ వ్యయం రూ.513 కోట్లు అవుతుందని అంచనా.

ప్యాకేజీ-6

1. రాజంపేట-గూడూరు, 2. ప్యాపిలి-బనగానపల్లి. 150 కి.మీ. పొడవైన ఈ రహదారుల నిర్మాణ వ్యయం 375 కోట్లు కాగలదని అంచనా.

ప్యాకేజీ-7

1. దామాజీపల్లి- తాడిపత్రి, 2. జమ్మలమడుగు- కొలిమిగుండ్ల, 3. సోమందేపల్లి- హిందూపురం-తూముకుంట. 178 కి.మీ. పొడవైన ఈ మూడు రహదారుల విస్తరణ, అభివృద్ధికి రూ.445 కోట్లు వ్యయం కాగలదని ఆర్‌అండ్‌బీ అంచనా వేసింది.

ప్యాకేజీ- 1బీ

26 జిల్లాల పరిధిలో 3,931 కిమీ రహదారులను అభివృద్ధి చేస్తారు. ఇందుకు రూ.698 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు.

Updated Date - 2025-02-16T05:08:19+05:30 IST