Share News

Pawan Kalyan: కూటమి 15 ఏళ్లు కొనసాగాలి

ABN , Publish Date - Aug 16 , 2025 | 03:47 AM

కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో సుస్థిరపాలన సాధ్యమని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే మరో పదిహేనేళ్లు కూటమి ప్రభుత్వమే కొనసాగాలన్నారు. ..

Pawan Kalyan: కూటమి 15 ఏళ్లు కొనసాగాలి

అప్పుడే రాష్ట్రాభివృద్ధి: పవన్‌ కల్యాణ్‌

  • సుస్థిర పాలన మాతోనే సాధ్యం

  • ఓడిపోతే ఓట్ల చోరీ అంటారు.. గెలిచినప్పుడు కనిపించవు

  • వైసీపీ 2019లో ఏమీ మాట్లాడలేదు

  • 2024లో ఓడాక ఈవీఎంలలో లోపాలట!

  • శాంతిభద్రతలు బలంగా ఉంటేనే పెట్టుబడులు

  • కాకినాడలో జాతీయ పతాకం ఆవిష్కరణ

కాకినాడ, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో సుస్థిరపాలన సాధ్యమని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే మరో పదిహేనేళ్లు కూటమి ప్రభుత్వమే కొనసాగాలన్నారు. అంతేగానీ తామేదో పదవులు అనుభవించడం కోసం అధికారం కోరడం లేదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామన్నారు. శుక్రవారం కాకినాడ పోలీస్‌ పరేడ్‌ మైదానంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించి ప్రసంగించారు. రాష్ట్రంలో 2019 నుంచి 2024 మఽధ్య బ్రిటిషర్ల తరహాలో రాష్ట్రాన్ని అప్పటి పాలకులు కంబంధ హస్తాల్లో బంధించారని విమర్శించారు. స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో ఆ చీకటి రోజులను ఎదుర్కొని అధికారంలోకి వచ్చామన్నారు. నాడు విభజించు-పాలించు పద్ధతిలో పాలన సాగితే.. తమ ప్రభుత్వం ‘కలిసి ఉందాం.. కలిసి పాలన చేద్దాం’ అనే తరహాలో పాలన సాగిస్తోందని తెలిపారు. అభివృద్ధి జరగాలన్నా, పెట్టుబడులు రావాలన్నా శాంతిభద్రతలు ముఖ్యమని స్పష్టం చేశారు. జాతీయ ప్రతిపక్ష నాయకులు ఓడిపోతే ఓట్ల చోరీ అంటారని, గెలిచినప్పుడు వారికవి కనిపించవని ధ్వజమెత్తారు. వైసీపీ 2019లో విజయం సాధించినప్పుడు ఏమీ మాట్లాడలేదని, 2024లో ఓటమిపాలైనప్పుడు మాత్రం ఈవీఎంలలో లోపాలు కనిపించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. గత వైసీపీ హయాంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి అనేకమంది భయపడ్డారన్నారు. రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీర ప్రాంత భద్రతపై పోలీసులు దృష్టిసారించాలని సూచించారు. కాకినాడ పోర్టు నుంచి డీజిల్‌, బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని, వదిలేస్తే బయటి నుంచి ఆయుధాలు సైతం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో అభివద్ధి, సంక్షేమం సమపాళ్లలో సాగుతోందన్నారు. పంచాయతీరాజ్‌శాఖ బాధ్యతలు చేపట్టిన వెంటనే జాతీయ పండుగ నిధులను పెంచి సర్పంచ్‌ల ఆత్మగౌరవాన్ని కాపాడామన్నారు. పల్లె పండుగ ద్వారా 4వేల కిమీ సీసీ రోడ్లు, 22వేల గోకులాల షెడ్ల నిర్మించామని చెప్పారు. అడవితల్లి బాట కింద కొండ ప్రాంతాల్లో రూ.1,005 కోట్లతో 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1,069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. జలజీవన్‌ మిషన్‌ కింద 5 జిల్లాల్లో 5 కొత్త ప్రాజెక్టులను రూ.7,910 కోట్లతో ప్రారంభించామని తెలిపారు. కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులు తీసుకొచ్చి విజయవంతంగా ఆపరేషన్‌ జరిపామన్నారు.

Updated Date - Aug 16 , 2025 | 03:47 AM