Encroachment : అధికారం పోయినా.. తగ్గట్లే!
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:14 AM
Land dispute నరసన్నపేటలో కోట్లాది రూపాయలు విలువ చేసే బోర్డు బంగ్లా స్థలం ఆక్రమణపై వైసీపీ నాయకులు వెనుకడుగు వేయడం లేదు. గతంలో ఈ స్థలంలో నిర్మాణాలకు యత్నించగా అధికారులు అడ్డుకున్నారు. తాజాగా మళ్లీ శనివారం నుంచి పనులు చేసేందుకు వైసీపీ నాయకులు ఉపక్రమించారు.

బోర్డు బంగ్లా స్థలం తమదంటున్న వైసీపీ నాయకులు
ఏకంగా నిర్మాణాలు ప్రారంభించిన వైనం
అయినా మౌనం దాల్చిన అఽధికారులు
కోర్టు ఉత్తర్వులపై కౌంటర్ వేయని ‘సుడా’
గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా అనుమతులు
నరసన్నపేట, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): నరసన్నపేటలో కోట్లాది రూపాయలు విలువ చేసే బోర్డు బంగ్లా స్థలం ఆక్రమణపై వైసీపీ నాయకులు వెనుకడుగు వేయడం లేదు. గతంలో ఈ స్థలంలో నిర్మాణాలకు యత్నించగా అధికారులు అడ్డుకున్నారు. తాజాగా మళ్లీ శనివారం నుంచి పనులు చేసేందుకు వైసీపీ నాయకులు ఉపక్రమించారు. కాగా.. గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలు అనుమతులతో బోర్డు బంగ్లా స్థలం ఆక్రమణకు గురైందని స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆరోపించారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి అక్రమాలను అడ్డుకోవాలని కలెక్టర్, ఎస్పీకి లేఖ రాశారు.
ఏం జరిగిందంటే..
జిల్లాపరిషత్‌కు సంబంధించి నరసన్నపేటలోని సుమారు రూ.10కోట్ల విలువైన బోర్డు బంగ్లా స్థలంపై స్థానికుల కన్ను పడింది. గతంలో పట్టణానికి చెందిన ఒక వ్యాపారి, వైసీపీ నాయకులు ఈ స్థలాన్ని ఆక్రమించి.. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. బజారువైపు ప్రహరీ కూడా నిర్మించారు. మరోపక్క ఆమదాలవలసకు చెందిన ఒక ఆసామి.. ఈ స్థలాన్ని కొనుగోలు చేశానని డాక్యుమెంట్లు చూపించాడు. సుడా అనుమతులతో నిర్మాణాలు చేపడుతున్నామని, ఇందుకు కోర్టు కూడా అనుమతి ఇచ్చిందని పత్రాలు చూపుతున్నాడు. నిర్మాణాలు చేపట్టేందుకు గతంలో ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు. మళ్లీ ఈ నెల 20న ఈ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించగా.. ఎంపీడీవో బి.మధుసూదనరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ స్థలంలో నిర్మాణాలను అడ్డుకున్నారు. తాజాగా శనివారం కొంతమంది వైసీపీ నాయకులు ఈ స్థలంలో నిర్మాణాలు చేపట్టడం చర్చనీయాంశమైంది. గతంలో పనిచేసిన ఒక తహసీల్దార్ అడ్డగోలుగా అనుమతి ఇవ్వడం.. ఆపై సుడా నుంచి అనుమతులు పొంది వైసీపీ నాయకులు.. బోర్డు బంగ్లా స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు ముందడుగు వేస్తున్నారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన అధికారులకు కోర్టు ఉత్తర్వులు చూపించి భయపెడుతున్నారు.
పట్టించుకోని ఉన్నతాధికారులు
బోర్డు బంగ్లా స్థలం.. ప్రైవేటు వ్యక్తులకు చెందినదిగా గత ప్రభుత్వ హయంలో ఎన్‌వోసీ ఇచ్చిన రెవెన్యూ అధికారులపై కానీ, ఈ స్థలంలో నిర్మాణాలకు సుడా అనుమతులు ఇవ్వడంపై కానీ జిల్లా ఉన్నతాధికారులు స్పందించకపోవడం గమనార్హం. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు సిఫారసులకు తలొగ్గారనే విమర్శలు ఉన్నాయి. తప్పుడు పత్రాలతో సుడా అనుమతి సైతం తీసుకుని వైసీపీ నేతలు నిర్మాణాలకు సిద్ధమవుతున్నారు. ఈ స్థలంలో నిర్మాణాలు చేసుకునే విధంగా కోర్టు ఉత్తర్వులు సైతం తీసుకువచ్చారు. అయితే ఈ వివాదం 2023 డిసెంబరు 16న జరిగింది. అప్పడే కోర్టులో పంచాయతీరాజ్, సుడా, రెవెన్యూ అధికారులు కోర్టులో కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. అప్పట్లో పంచాయతీరాజ్ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. కానీ, సుడా అధికారులు కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ప్రస్తుతం నిర్మాణాలకు కోర్టు అనుమతులు ఇచ్చింది. ఈ స్థలంపై వివాదం జరుగుతున్నా జిల్లా అధికారులు ఇంతవరకు స్పందించపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కలెక్టర్ స్పందించి ప్రభుత్వానికి చెందిన ఈ స్థలాన్ని పరిరక్షించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై ఎంపీడీవో బి.మధుసూదనరావు వద్ద ప్రస్తావించగా బోర్డు బంగ్లా ఆస్తి.. పరిరక్షిస్తామని, న్యాయపరంగా పోరాటం చేస్తామని తెలిపారు.
కలెక్టర్, ఎస్పీలకు ఎమ్మెల్యే లేఖ
నరసన్నపేట పట్టణ నడిబొడ్డున జిల్లా పరిషత్‌కు చెందిన బోర్డు బంగ్లాకు చెందిన 39 సెంట్లలో నాలుగు సెంట్లు స్థలాన్ని తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో కోర్టు అనుమతి ద్వారా చేపడుతున్న నిర్మాణాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని కలెక్టర్, ఎస్పీకి లేఖలు రాశానని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ‘పూర్వం పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలు ఉండే స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు చెందినదిగా తప్పుడు పత్రాలు సృష్టించారు. ఆపై సుడా అనుమతి ఇవ్వడం వెనుక గత ప్రభుత్వ హయంలో పెద్ద తలకాయల హస్తం ఉంది. దీనిపై పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి కోర్టుకు నివేదిక సమర్పించాలి. సుడా అధికారులు కూడా స్థలాన్ని పరిశీలించకుండానే అనుమతులు ఇవ్వడంపై దర్యాప్తు చేపట్టాల’ని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు శిమ్మ చంద్రశేఖర్, కింజరాపు రామారావు, గొద్దు చిట్టిబాబు, బైరి భాస్కరరావు, నేతింటి విశ్వేశ్వరరావు, బలగ భారతి, బోయన సతీష్, జామి వెంకట్రావు పాల్గొన్నారు.