Share News

AMC: నిధుల్లేక.. నిస్తేజంగా!

ABN , Publish Date - Jan 07 , 2025 | 11:57 PM

Lack of funds రైతులకు సేవలు అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన మార్కెట్‌ కమిటీలు నిస్తేజంగా మారాయి. జిల్లాలోని 12 మార్కెట్‌ కమిటీల్లో పలు గోదాములు, కల్లాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటిద్వారా రైతులకు సక్రమంగా సేవలు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

AMC: నిధుల్లేక.. నిస్తేజంగా!
నరసన్నపేట మార్కెట్‌ కమిటీలో నిరూపయోగంగా ఉన్న కల్లాలు

అలంకారప్రాయంగా మార్కెట్‌ కమిటీలు

నిరుపయోగంగా గోదాములు, కల్లాలు

వైసీపీ ప్రభుత్వ హయాంలో అందని సేవలు

కూటమి ప్రభుత్వంపైనే రైతుల ఆశలు

నరసన్నపేట, జనవరి 7(ఆంధ్రజ్యోతి): రైతులకు సేవలు అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన మార్కెట్‌ కమిటీలు నిస్తేజంగా మారాయి. జిల్లాలోని 12 మార్కెట్‌ కమిటీల్లో పలు గోదాములు, కల్లాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటిద్వారా రైతులకు సక్రమంగా సేవలు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో నరసన్నపేట, శ్రీకాకుళం, పొందూరు, జలుమూరు, ఆమదాలవలస, కోటబొమ్మాళి, పాతపట్నం, కంచిలి, పలాస, పాతపట్నం, హిరమండలం, ఎచ్చెర్లలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. ఒక్కో మార్కెట్‌ కమిటీలో 3వేల మెట్రిక్‌ టన్నులు ధాన్యం భద్రపరిచేందుకు వీలుగా గోదాములు ఉన్నాయి. అలాగే రైతులు ధాన్యం ఆరబెట్టేందుకుగానూ రెండు, మూడేసి చొప్పున పెద్దపెద్ద కల్లాలు నిర్మించారు. కాగా.. వైసీపీ పాలనలో గత ఐదేళ్లూ నిధులు కేటాయించక పోవడంతో మార్కెట్‌ కమిటీల అభివృద్ధి కనుమరుగైంది. వైసీపీ నాయకులకు మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్ల పదవులు తప్ప.. రైతులకు సేవలు మాత్రం సక్రమంగా అందలేదు. మార్కెట్‌ కమిటీల్లో కోట్లాది రూపాయలతో నిర్మించిన గిడ్డంగులు వృథాగా పడి శిథిలావస్థకు చేరుకున్నాయి.

అసాంఘిక కార్యకలాపాలు..

జిల్లాలో కొన్ని మార్కెట్‌ కమిటీ కార్యాలయాలు.. రాత్రి సమయాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. నరసన్నపేట మార్కెట్‌ యార్డులో ప్రహరీ కూల్చేశారు. రాత్రివేళ గంజాయి బ్యాచ్‌, మందుబాబులు ఇక్కడ మకాం వేస్తున్నారు. ఇదే ప్రాంతంలో వేరే హౌసింగ్‌ గోదాములు ఉన్నాయి. మందుబాబుల కారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే రూ.కోట్లలో నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే నరసన్నపేట మార్కెట్‌ కమిటీ పరిధిలో కోట్లాది రూపాయలతో గోదాములు, కల్లాలు నిర్మించారు. గోదాములు కొన్నాళ్లపాటు ఎరువులు, విత్తనాలు నిల్వ చేసేందుకు వినియోగించారు. నాలుగేళ్లుగా గోదాములు, కల్లాలు వినియోగించక పోవడంతో రాత్రివేళల్లో పశువులకు నిలయంగా మారాయి. గొర్రెలు పెంపకం దారులు వీటిని ఆవాసాలుగా ఏర్పాటు చేసుకున్నారు.

సిబ్బంది తీరుపై ఆరోపణలు

మార్కెట్‌ కమిటీ సిబ్బంది.. మార్కెట్‌ సెస్‌ మీద మాత్రమే దృష్టి సారిస్తున్నారు. నరసన్నపేట మండలంలో మడపాం కేంద్రం వద్ద వాహనాలను తనిఖీ చేసి అక్రమంగా వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే మాదిరిగా టమాట, చెరుకు, అరటి, కూరగాయాలు, పశువులు రవాణా చేసే వాహనాల నుండి వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే కొన్ని గోదాములను ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇచ్చి సిబ్బంది చేతివాటం చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

అమలు కాని రైతుబంధు పథకం

టీడీపీ ప్రభుత్వ హయాంలో(2014-19 మధ్య) రైతుబంధు పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం ద్వారా.. రైతులు పండించిన పంటలను మార్కెట్‌ కమిటీలోని గోదాముల్లో నిల్వ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. నిల్వ చేసిన పంటలపై మార్కెట్‌ కమిటీలు రైతులకు 60శాతం వరకూ నామమాత్రపు వడ్డీతో రుణాలు అందజేసేవారు. మార్కెట్‌లో మద్దతు ధర ఎక్కువగా ఉన్నప్పుడు రైతులు ఆ పంటను విక్రయించుకుని.. రుణాలు తీర్చేవారు. అలాగే మార్కెట్‌ కమిటీ పరిధిలో వైద్య, పశు వైద్యశిబిరాలు కూడా నిర్వహించేవారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు పథకాన్ని నిలిపేశారు. గత ఐదేళ్లూ వైద్యశిబిరాల నిర్వహణ కూడా చేపట్టలేదు. దీంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఇటీవల వరుస తుఫాన్‌లతో.. పంటలను కాపాడుకునేందుకు నానా పాట్లు పడ్డారు. మార్కెట్‌ కమిటీలో గోదాములు, కళ్లాలు వినియోగించకుండా.. ఆరుబయట ధాన్యం ఉంచేయడంతో కొంతమేర నష్టపోయారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా.. మార్కెట్‌ కమిటీల బలోపేతానికి చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

వినియోగంలోకి తీసుకురావాలి

టీడీపీ ప్రభుత్వ హయాంలో మాదిరి రైతుబంధు వంటి పథకాలను అమలు చేయాలి. విపత్తుల సమయంలో రైతులు పండించే పంటలను నిల్వ చేసి ఆరబెట్టేందుకు వీలుగా ఉన్న ప్లాట్‌ఫాంను వినియోగంలోకి తీసుకురావాలి. రైతులకు మెరుగైన సేవలు అందించాలి.

- పీస కృష్ణ, రైతు చిన్నదూగాం

...........................

మెరుగైన సేవలు అందిస్తాం

జిల్లాలోని 12 మార్కెట్‌ కమిటీల్లో ఒక్క హిరమండలం తప్ప.. మిగతా వాటికి సొంత భవనాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి గోదాంలు, కళ్లాలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌ కమిటీలను క్రియాశీలకంగా తయారు చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రైతులకు మెరుగైన సేవలు అందిస్తాం.

- బి.రవికిరణ్‌, ఏడీ, మార్కెట్‌ కమిటీ

Updated Date - Jan 07 , 2025 | 11:57 PM