Jaljeevan: మూడు రిజర్వాయర్లతో.. ‘జలజీవన్’
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:05 AM
Jaljeevan ప్రజలకు రక్షితనీటిని సరఫరా చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జలజీవన్ మిషన్‌లో భాగంగా ప్రజలకు రక్షిత నీరందించేందుకుగానూ ఉమ్మడి జిల్లాలో హిరమండలం, తోటపల్లి, మడ్డువలస రిజర్వాయర్లను గుర్తించింది. ఈ మూడు రిజర్వాయర్లను జలజీవన్ పథకానికి అనుసంధానం చేసేలా అధికారులు సమగ్ర నివేదికను సిద్ధం చేశారు.

ఇప్పటికే నీటి వనరుల గుర్తింపు
వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యం
ప్రారంభించని రూ.600 కోట్ల విలువైన పనులు రద్దు
శ్రీకాకుళం, జనవరి 6(ఆంధ్రజ్యోతి): ప్రజలకు రక్షితనీటిని సరఫరా చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జలజీవన్ మిషన్‌లో భాగంగా ప్రజలకు రక్షిత నీరందించేందుకుగానూ ఉమ్మడి జిల్లాలో హిరమండలం, తోటపల్లి, మడ్డువలస రిజర్వాయర్లను గుర్తించింది. ఈ మూడు రిజర్వాయర్లను జలజీవన్ పథకానికి అనుసంధానం చేసేలా అధికారులు సమగ్ర నివేదికను సిద్ధం చేశారు. వేసవిలోనూ ప్రజలకు తలసరి రోజూ 55లీటర్ల నీరు సరఫరా చేసేలా పథకాన్ని పునర్వ్యవస్థీకరరించారు. రాష్ట్రవ్యాప్తంగా అంచనా వ్యయం దాదాపు రూ.60వేల కోట్లకు పెరిగే ఈ ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం ఆమోదం తీసుకుని పనులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా.. జలజీవన్ మిషన్‌పై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పనులు పూర్తికాలేదు. రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో కేంద్ర నిధులనూ వినియోగించుకోలేని దుస్థితి ఏర్పడింది. జలాశయాలకు బదులుగా బోర్ల ద్వారా నీటిని సేకరించి ప్రజలకు సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందించి పనులు ప్రారంభించారు. చాలాచోట్ల పనులు సక్రమంగా సాగక ప్రజలకు రక్షితనీటి సరఫరాకు ఇబ్బందులు తప్పలేదు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో మూడు రిజర్వాయర్లను గుర్తించి.. కేంద్రప్రభుత్వానికి సమగ్ర నివేదికను పంపింది. ఉమ్మడి జిల్లాలో 38 మండలాల్లో అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికి కొళాయిల ద్వారా తలసరి రోజూ 55 లీటర్లు చొప్పున రక్షితనీరు సరఫరా చేయాలన్నది లక్ష్యం. వేసవిలోనూ సరఫరాకు అంతరాయం లేకుండా ఈ మూడు రిజర్వాయర్ల నుంచి నీటిని సేకరిస్తారు. అంచనా వ్యయంపై కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో పనులు ప్రారంభించి.. 2028 నాటికి పూర్తిచేయనున్నారు.
జిల్లాలో 3,108 పనులు రద్దు..
వైసీపీ ప్రభుత్వ హయాంలో సరైన ప్రణాళిక లేకుండా చేపట్టి, జిల్లాలో ఇప్పటికీ ప్రారంభించని రూ.600కోట్ల విలువైన 3,108 పనులను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఇందులో టెండర్లకు నోచుకోని 2,583 పనులు, టెండర్లు పిలిచినా పనులు ప్రారంభించనవి 420, కనీసం 25శాతం కూడా పనులు జరగనివి 105 ఉన్నాయి. రద్దు చేసిన పనుల్లో బోర్లు ఆధారంగా నిర్వహించే సింగిల్, మల్టీవిజేల్ తాగునీటి పథకాలే ఎక్కువ. వేసవిలో భూగర్భ జలాలు అడుగంటితే బోర్లు సరిగా పనిచేయవన్న నిపుణుల సూచనతో ప్రభుత్వం పనులు రద్దుచేసింది. ప్రాజెక్టు వ్యయం పెరిగినా రిజర్వాయర్ల నుంచి నీటిని సేకరించి అన్ని గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేలా ప్రభుత్వం కొత్తగా పనులు ప్రతిపాదించింది.