Share News

Court: కోర్టు ఆదేశాలతో.. ఉరుకులు.. పరుగులు

ABN , Publish Date - Jan 25 , 2025 | 12:19 AM

Court orders నరసన్నపేట పట్టణ నడిబొడ్డున ఉన్న రాజులు చెరువు గట్టుపై ఆక్రమణలను గుర్తించేందుకు అధికారులు ఉరుకులు.. పరుగులు పెట్టారు. గొట్టిపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నెంబర్‌ 219లో 124.42 ఎకరాలు గ్రామకంఠం ఉండగా... అందులో రాజులు చెరువు సుమారు 13.60 ఎకరాలు విస్తీర్ణం మాత్రమే ఉంది.

Court: కోర్టు ఆదేశాలతో.. ఉరుకులు.. పరుగులు
ఆక్రమణలను పరిశీలిస్తున్న ఆర్డీవో సాయిప్రత్యూష, డీపీవో సౌజన్య భారతి, సర్వేశాఖ అధికారులు

  • రాజుల చెరువు గట్టు ఆక్రమణలపై కదలిక

  • రెవెన్యూ, పంచాయతీ రికార్డుల్లో వేర్వేరుగా వివరాల నమోదు

  • సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇటీవల నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశం

  • చెరువును పరిశీలించిన ఆర్డీవో, డీపీవో, సర్వేశాఖ ఏడీ

    నరసన్నపేట, జనవరి 24(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట పట్టణ నడిబొడ్డున ఉన్న రాజులు చెరువు గట్టుపై ఆక్రమణలను గుర్తించేందుకు అధికారులు ఉరుకులు.. పరుగులు పెట్టారు. గొట్టిపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నెంబర్‌ 219లో 124.42 ఎకరాలు గ్రామకంఠం ఉండగా... అందులో రాజులు చెరువు సుమారు 13.60 ఎకరాలు విస్తీర్ణం మాత్రమే ఉంది. 2002లో ఈ గట్టుపై అక్కడక్కడ మాత్రమే నిర్మాణాలు ఉండేవి. కొత్తబస్టాండ్‌ వైపు, కాలేజీ రోడ్డులో గేట్‌ వరకు దుకాణాలు ఉండేవి. అప్పట్లో ఈ చెరువు.. రెవెన్యూ రికార్డులో లేదనే విషయం బయటకు పొక్కింది. దీంతో చాలామంది చెరువు గట్టును ఆక్రమించేశారు. ఈ చెరువు రెవెన్యూ రికార్డుల్లో లేకపోవడం.. గ్రామకంఠంగా ఉండటంతో గతంలో ఈ గట్టుపై పేదలకు ఇళ్ల నిర్మాణాలకు రెవెన్యూ అధికారులు పొజిషన్‌ సర్టిఫికెట్లు ఇబ్బడిముబ్డుడిగా మంజూరు చేశారు. అలాగే పలు ప్రభుత్వ భవనాలు కూడా నిర్మించారు. మొత్తంగా సుమారు 395 నిర్మాణాలు చేపట్టారు. కొంతమంది ఏడాది ఒకసారి పంచాయతీకి పన్ను చెల్లిస్తూ.. ఆక్రమణలను పదిలం చేసుకున్నారు.

  • ఈ చెరువు పరిరక్షణకు గరీబ్‌ గైడ్‌ అనే స్వచ్చంధ సంస్థ సభ్యులు 2023 ఆగస్టులో జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(ఎన్‌జీటీ)ను ఆశ్రయించారు. దీంతో ఆక్రమణలపై పలుమార్లు ఎన్‌జీటీ విచారణ చేపట్టగా.. అధికారులు రికార్డులు సమర్పించారు. అయినప్పటికీ మరింత సమగ్ర విచారణ చేపట్టి ఈనెల 31న నివేదిక ఇవ్వాలని గరీబ్‌ గైడ్‌ స్వచ్చంధ సంస్థకు, అధికారులకు ఇటీవల ఎన్‌జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈనెల 16న గరీబ్‌ గైడ్‌ స్వచ్చంద సంస్థ సభ్యులు సమగ్ర నివేధికను ఎన్జీటీకు సమర్పించారు. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు కూడా ఉరుకులు.. పరుగులు తీశారు. శుక్రవారం శ్రీకాకుళం ఆర్డీవో సాయిప్రత్యూష, జిల్లా పంచాయతీ అధికారి సౌజన్యభారతి, సర్వేశాఖ ఏడీ ఆర్‌.విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో చెరువు గట్టుపై నిర్మాణాలను పరిశీలించారు. రాజులు చెరువు రెవెన్యూ రికార్డులో లేదని, గ్రామకంఠం పేరుతో ఉందని రెవెన్యూ అధికారులు గుర్తించారు. తదితర వివరాలను ఆర్డీవోకు నివేదించారు. కాగా ఈ చెరువు గట్టుపై నిర్మాణాలకు పంచాయతీ అధికారులు పన్ను వసూళ్లు చేశారు. కొన్ని భవనాల నిర్మాణాలకు రెవెన్యూ అధికారులు అనుమతులిచ్చారని ఉన్నతాధికారులకు స్థానిక రెవెన్యూ, పంచాయతీ అధికారులు తెలిపారు. దీంతో ఈ వ్యవహారంపై ఎన్జీటీకి ఎలా నివేదిక ఇవ్వాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారు. చెరువు లేదని ఇస్తే.. క్షేత్రస్థాయిలో చెరువు ఉండటంతోపాటు చెరువు అభివృద్ధికి గతంలో ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. చెరువు ఉందని నివేదిక ఇస్తే ఏమవుతుందోనన్న అనే మీమాంసలో ఉన్నారు. ఈ చెరువు వ్యవహారంపై జిల్లాకేంద్రంలో రెవెన్యూ, పంచాయతీ, సర్వేశాఖ అధికారులు సంయుక్తంగా నివేదిక సిద్ధం చేస్తున్నారు.

Updated Date - Jan 25 , 2025 | 12:19 AM