Share News

సిక్కోలుపై కరుణ చూపిస్తారా?

ABN , Publish Date - Feb 24 , 2025 | 12:40 AM

రాష్ట్రంలో వెనుకబడిన జిల్లా శ్రీకాకుళం. గత ఐదేళ్ల వైసీపీ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగక మరింత వెనక్కువెళ్లిపోయింది.

 సిక్కోలుపై కరుణ చూపిస్తారా?
గొట్టా బ్యారేజీ ఇలా..

- నేటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు

- శిథిలావస్థలో గొట్టా బ్యారేజీ

- ముందుకు కదలని ఆఫ్‌షోర్‌

- అతీగతి లేని నారాయణపురం

- నిధుల కేటాయింపుపై ఆశలు

శ్రీకాకుళం, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వెనుకబడిన జిల్లా శ్రీకాకుళం. గత ఐదేళ్ల వైసీపీ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగక మరింత వెనక్కువెళ్లిపోయింది. ముఖ్యంగా సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేయడం, అవసరమైన వాటికి నిధులు వెచ్చించకపోవడంతో రైతుల సమస్యలు ప్రతి ఏడాది రెట్టింపు అవుతున్నాయి. దీంతో వారి ఇబ్బందులు అంతా ఇంతా కావు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గతేడాది నవంబరులో జరిగిన మొదటి బడ్జెట్‌ సమావేశాల్లో జిల్లాలోని వివిధ ప్రాజెక్టులకు నిధులను కేటాయించింది. ఇప్పుడు రెండో బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. జిల్లాకు చెందిన శాసన సభ్యులు తమ నియోజకవర్గాల అభివృద్ధికి నిధులను ప్రభుత్వం నుంచి తీసుకువచ్చేందుకు గాను, ప్రజా గొంతుకని అక్కడ వినిపించి నిధులు మంజూరు చేయించుకునేందుకు వీలుంటుంది. ఈ నేపథ్యంలో ఏళ్లతరబడి నిర్లక్ష్యంగా ఉన్న జిల్లాలో సాగునీటి రంగంపై ప్రధానంగా దృష్టిసారిస్తే మేలు జరుగుతుందని జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

గొట్టా బ్యారేజీకి రూపాయి కూడా ఇవ్వలే..

గొట్టా బ్యారేజీ జిల్లాలో ప్రధాన సాగునీటి వనరు. గత వైసీపీ ప్రభుత్వం ఈ బ్యారేజీని తీవ్ర నిర్లక్ష్యం చేయడంతో శిథిలావస్థకు చేరుకుంది. మరమ్మతుల కోసం ఐదేళ్లలో కనీసం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో బ్యారేజీ దిగువ ప్రాంతం దెబ్బతింది. జడ్జిస్టోన్‌ ఏప్రాన్‌, సీసీ బ్లాక్‌లు చెల్లాచెదురయ్యాయి. గత ఆరేళ్ల నుంచి నిధులు లేక, మరమ్మతులు జరగక రోజురోజుకీ బ్యారేజీ పటిష్టత కోల్పోతుంది. కాలువల లైనింగ్‌ సంగతి దేవుడెరుగు కనీసం గుండెకాయ వంటి బ్యారేజీని బాగుచేయడం లేదు. దీంతో నిల్వ నీరంతా వంశధారలోకి వెళ్లిపోతుంది. అలాగే వంశధార ఫేజ్‌-2 పనులు కాస్త పెండింగ్‌ ఉన్నాయి. వీటికి గతేడాది జూన్‌ నుంచి చెల్లింపులు లేవాయె. హిరమండలం రిజర్వాయర్‌కు రూ.40 కోట్లు నిధులు విడుదల చేస్తే పనులు పూర్తయ్యే అవకాశముంది. అలాగే పెండింగ్‌ బిల్లులు రూ.20 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. అప్పుడే ఈ ఏడాది ఖరీఫ్‌కు పూర్తిస్థాయిలో వంశధార ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని. ఈ దిశగా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

నారాయణపురం ఆనకట్ట..

2014-19 మధ్య కాలంలో నారాయణపురం ఆనకట్ట కాలువకు సంబంధించి పనులు జైకా నిధులతో చేపట్టారు. మొత్తం రూ.112 కోట్లు నిధులు అవసరముంటే అందులో మూడో వంతు పనులను మాత్రమే పూర్తిచేయగలిగారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది. నారాయణపురం కుడి, ఎడమ కాలువలపై కనీస దృష్టిసారించలేదు. పనులు అత్యంత నెమ్మదిగా జరిగాయి. ఆ బిల్లులు కూడా ఇప్పటికీ పెండింగే. పెండింగ్‌ పనులకు మోక్షంలేదు. దీంతో ఏళ్లతరబడి సంతకవిటి, పొందూరు, ఎచ్చెర్ల, బూర్జ, ఆమదాలవలస, శ్రీకాకుళం రూరల్‌, గార మండలాల్లో 20వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది.

ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టు..

ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం కల్పిస్తూ ఇటీవలే రూ.20 కోట్లను చెల్లించింది. వాస్తవానికి రూ.35 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే తొలివిడత నిధులు చెల్లించినా, ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. దీనిపై అధికారయంత్రాంగం చర్యలు తీసుకోవాల్సి ఉంది. అలాగే సాంకేతిక పరంగా అడ్డంకులు లేకుండా ఆఫ్‌షోర్‌ పనులు ముందుకుసాగేలా చూడాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు శ్రీకాకుళంలో ఔటర్‌ రింగు రోడ్డు, వంశధార-37 టీఈ కాలువ ఆధునికీకరణ, కొత్తవలస, కళింగపట్నం ఎత్తిపోతల పథకాలు, కోడి రామ్మూర్తి స్టేడియం, మెళియాపుట్టిలో ఐటీడీఏ కార్యాలయం ఏర్పాటు, వంశధార ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాలువల ఆధునికీకరణ, బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్‌, తోటపల్లి కాలువల పనులు, వనితమండలం-గార వంతెన, జీడి బోర్డు ఏర్పాటు, థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు, బెంతు ఒరియా కులస్తులు ఇబ్బందులు, తదితర సమస్యలు ఉన్నాయి. వీటిపైౖ జిల్లా ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో ప్రస్తావించి, బడ్జెట్‌లో నిధులు కేటాయించేలా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Feb 24 , 2025 | 12:40 AM