Forest: వన్యప్రాణుల వేట
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:23 AM
animals hunting జిల్లాలో వన్యప్రాణుల వేట యథేచ్ఛగా సాగుతోంది. వన్యప్రాణులను రక్షించాల్సిన అటవీశాఖ సిబ్బంది జాడ కనిపించడం లేదు. దీంతో అటవీ ప్రాంతంలో కలపతో పాటు అడవి పందులు, జింకలు తదితర వన్యప్రాణులు రోజురోజుకు అంతరించిపోతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంతరించిపోతున్న అటవీ సంపద
యథేచ్ఛగా మాంసం విక్రయాలు
పట్టించుకోని అధికారులు
సరుబుజ్జిలి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వన్యప్రాణుల వేట యథేచ్ఛగా సాగుతోంది. వన్యప్రాణులను రక్షించాల్సిన అటవీశాఖ సిబ్బంది జాడ కనిపించడం లేదు. దీంతో అటవీ ప్రాంతంలో కలపతో పాటు అడవి పందులు, జింకలు తదితర వన్యప్రాణులు రోజురోజుకు అంతరించిపోతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సరుబుజ్జిలి, బూర్జ, ఎల్.ఎన్.పేట, హిరమండలం, కొత్తూరు, పాతపట్నం, మెళియాపుట్టి, మందస, సీతంపేట, భామిని, పాలకొండ, వీరఘట్టం మండలాల్లో అటవీ ప్రాంతం ఎక్కువగా విస్తరించి ఉన్నది. ఈ అడవుల్లో వివిధ జాతులకు చెందిన వన్య ప్రాణులు జీవిస్తున్నాయి. ఆహారం, తాగునీటి కోసం మైదాన ప్రాంతాలకు వచ్చి వెళ్తుంటాయి. అటువంటి సమయంలో వేటగాళ్ల ఉచ్చుకి బలవుతున్నాయి. ఎటువంటి అనుమతి లేని తుపాకులు, వలలు, నాటుబాంబులతో కొంతమంది వ్యక్తులు వన్యప్రాణులను వేటాడి మాంసాన్ని విక్రయించడం వ్యాపారంగా మార్చుకున్నారు. అంతర్రాష్ట్ర వేటగాళ్లు ఒకప్పుడు జిల్లాలోని గిరిజన, మైదాన ప్రాంతాలకు చెందిన కొంతమంది వ్యక్తులతో కలిసి రాత్రివేళ గుట్టుచప్పుడు కాకుండా అడవి పందులు, జింకలు, కనుజులు తదితర జంతువులను వేటాడేవారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న కొంతమందికి వాటి మాంసాన్ని సరఫరా చేసేవారు. ప్రస్తుతం ఈ ప్రాంత ప్రజలు అటవీ జంతువులను వేటాడేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఒడిశా పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఛత్తీ్‌సగఢ్ ప్రాంతాలకు చెందిన కొంతమంది వేటగాళ్లు ముఠాగా ఏర్పడ్డారు. వన్య ప్రాణుల వేట మాంసం వ్యాపారాన్ని లాభసాటిగా మార్చుకున్నారు. వన్య ప్రాణులను తుపాకులతో వేటాడి నేరుగా వాహనాల్లో పలాస, టెక్కలి, నరసన్నపేట, హిరమండలం, సరుబుజ్జిలి పాలకొండ ప్రాంతాల్లో ముందుగా ఏర్పాటు చేసుకున్న వ్యక్తుల ద్వారా కేజీల చొప్పున మాంసాన్ని విక్రయిస్తున్నారు. అడవి పంది మాంసం కేజీ రూ.300, జింక రూ.800, కుందేళ్లు రూ.500, కణుజులు రూ.200 చొప్పున విక్రయిస్తున్నారు. అటవీ జంతువులు కావడం.. తక్కువ ధరకు మాంసం లభిస్తుండడంతో కొంతమంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
జాడలేని అటవీ సిబ్బంది...
జిల్లాలో అంతరించిపోతున్న అటవీ ప్రాంతాన్ని కాపాడాల్సిన సంబంధిత శాఖాధికారులు జాడ లేదని పలువురు ఆరోపిస్తున్నారు. సరుబుజ్జిలి ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతమంతా పార్వతీపురం మన్యం జిల్లాలో విలీనమై ఉంది. దీనితో రెండు జిల్లాల అటవీశాఖ అధికారులు ఆయా ప్రాంతాలపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. అటవీ ప్రాంతంలో ఎటువంటి అక్రమాలు చోటుచేసుకున్నా పట్టించుకోవడం లేదు. కలప, వన్య ప్రాణుల వేట, క్వారీల తవ్వకం కొంతమంది అటవీ శాఖాధికారులు కనుసన్నల్లోనే జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.
తుపాకులపై నిఘా ఎక్కడ...
వన్యప్రాణులను అంతమొందించే తుపాకులపై జిల్లా పోలీస్ నిఘా కొరవడింది. రాత్రివేళల్లో జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో సిబ్బంది గస్తీ కాస్తున్నారు. అయినా వేటగాళ్లు తుపాకులతో వాహనాలపై వెళ్తున్నప్పుడు పోలీసుల తనిఖీల్లో బయటపడకపోవడం గమనార్హం. అలాగే వన్యప్రాణుల వేట కోసం వచ్చే.. ఇతర రాష్ర్టాల వ్యక్తులు దొంగతనాలకు కూడా పాల్పడుతున్నారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖాధికారులు, పోలీసులు స్పందించి వన్యప్రాణుల రక్షించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
కఠిన చర్యలు
జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో వన్య ప్రాణులను వేటాడుతున్న వ్యక్తులపై నిఘా పెట్టి కఠినచర్యలు తీసుకుంటాం. ఆయా గ్రామాల్లో కొన్ని వన్యప్రాణులు, అటవీ సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం.
- ఎం.నిహారిక, అటవీరేంజ్ అధికారిణి