Share News

Hud-hud: హుద్‌హుద్‌ ఇళ్లకు మోక్షమెప్పుడు?

ABN , Publish Date - Jan 18 , 2025 | 12:10 AM

Hudhud affected homes హుద్‌హుద్‌ ఇళ్ల కోసం లబ్ధిదారులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. నిర్మాణాలు పూర్తయినా ఇళ్లు కేటాయించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Hud-hud: హుద్‌హుద్‌ ఇళ్లకు మోక్షమెప్పుడు?
టెక్కలిలో హుద్‌హుద్‌ కాలనీ

  • ఆరేళ్లుగా లబ్ధిదారుల ఎదురుచూపు

  • నిర్మాణాలు పూర్తయినా కేటాయించని వైనం

  • కానరాని మౌలిక సదుపాయాలు

  • అసాంఘిక కార్యక్రమాలకు నెలవుగా బ్లాకులు

    హుద్‌హుద్‌ ఇళ్ల కేటాయింపులో నిర్లక్ష్యం కారణంగా లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలోని టెక్కలి, పలాస నియోజకవర్గాల్లో 390 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2019 నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేశారు. కానీ తాగునీరు, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు ప్రక్రియ నిలిచిపోయింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆరేళ్లుగా తమకు ఎదురుచూపులు తప్పడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వమైనా స్పందించి తమకు ఇళ్లను కేటాయించి.. మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.

    .....................

    టెక్కలి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): హుద్‌హుద్‌ ఇళ్ల కోసం లబ్ధిదారులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. నిర్మాణాలు పూర్తయినా ఇళ్లు కేటాయించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2014లో హుద్‌హుద్‌ తుఫాన్‌ విలయం సృష్టించింది. తుఫాన్‌ బీభత్సానికి చాలామంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులుగా మారారు. అలాగే టెక్కలిలో రోడ్ల విస్తరణ సమయంలో మరికొంతమంది ఇళ్లు కోల్పోయారు. వీరందరి కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో హుద్‌హుద్‌ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. టెక్కలిలోని గోపినాథపురం సమీపాన కంకరబందలో 192 ఇళ్ల నిర్మాణానికిగానూ.. 2016 ఏప్రిల్‌ 14న అప్పటి కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శంకుస్థాపన చేశారు. రూ.9.24 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. ఇళ్ల నిర్మాణానికి రూ.7.68 కోట్లు, కాలనీలో మౌలిక సదుపాయాల కోసం రూ.1.53 కోట్లు కేటాయించారు. ఒక్కో ఇంటికి రూ.3.98లక్షలు చొప్పున గృహ నిర్మాణ శాఖ నిధులు కేటాయించింది. నిర్మాణాలు పూర్తయి.. ఇళ్ల ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న సమయంలో 2019 సార్వత్రిక ఎన్నికల కోడ్‌ సమీపించింది. దీంతో లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించలేదు. విద్యుత్‌, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు బ్రేక్‌ పడింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం హుద్‌హుద్‌ ఇళ్ల కేటాయింపుపై నిర్లక్ష్యం చేసింది. మౌలిక సదుపాయాల కల్పననూ పట్టించుకోలేదు. వరుసగా వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు మారుతూ ఉండడంతో హుద్‌హుద్‌ ఇళ్లకు బాలారిష్టాలు తప్పలేదు. కాగా.. మళ్లీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో.. ఎట్టకేలకు 2023 నవంబరు 30న ఆదరబాదరాగా 90 మంది లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి దువ్వాడ వాణి సమక్షంలో అప్పటి సబ్‌కలెక్టర్‌ నూరుల్‌కమర్‌ పర్యవేక్షణలో డ్రా తీసి.. లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించారు. కానీ ఇప్పటివరకూ విద్యుత్‌, తాగునీటి సౌకర్యాలు, మరమ్మతుల వంటి పనుల ఊసే లేదు. కాగా.. వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకే ఈ ఇళ్లను కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ నాయకులు స్ధానికేతరులకు ఒక్కో ఇల్లు రూ.5లక్షలకు విక్రయించారని, దీనిపై అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు పలు సమావేశాల్లో ప్రస్తావిస్తూనే ఉన్నారు.

  • కనీస సౌకర్యాలు లేక..

  • వైసీపీ నాయకులు కొంతమంది లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించినా.. అసౌకర్యాలు కారణంగా చాలామంది ఇళ్లల్లో దిగేందుకు ఆసక్తి చూపలేదు. ఆరు బ్లాకుల్లో 192 ఇళ్లకుగాను ప్రస్తుతం ఆరు ఇళ్లకు విద్యుత్‌ సౌకర్యం ఉంది. మిగిలిన ఏ ఇంటికీ విద్యుత్‌ సౌకర్యం లేకపోవడంతో లబ్ధిదారులు ఉసూరుమంటున్నారు. అలాగే నిర్మాణాలు పూర్తయినా ప్రారంభానికి నోచుకోకపోవడంతో చాలా ఇళ్లు దెబ్బ తింటున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారుతున్నాయి. ఆకతాయిల చేష్టలతో కిటికీ అద్దాలు, తలుపులు ధ్వంసమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో ఇళ్లు కేటాయించాలని, మౌలిక వసతులు కల్పించాలని పలువురు కోరుతున్నారు.

  • ఈ విషయమై గృహనిర్మాణశాఖ ఈఈ నర్శింగరావు వద్ద ప్రస్తావించగా హుద్‌హుద్‌ ఇళ్ల కాలనీలో మౌలిక సదుపాయాలు పూర్తిచేసేందుకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. టెండర్ల ప్రక్రియ అయిన తరువాత పూర్తిస్థాయిలో పనులు చేపడతామన్నారు.

  • లబ్ధిదారులకు ఇవ్వరా?

    పలాస, జనవరి 17(ఆంధ్రజ్యోతి): హుద్‌హుద్‌ గృహాలు లబ్ధిదారులకు మరి ఇవ్వరా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీడీపీ హయాంలో రూ.4.50 కోట్ల వ్యయంతో పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధి సూదికొండకాలనీ శివారులో 2016లో హుద్‌హుద్‌ గృహాలకు బీజం పడింది. రెండేళ్లలో మొత్తం 198గృహాలు రెండంతస్తుల రీతిలో నిర్మించారు. అంతర్గత రహదారులు, తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం కల్పించాల్సి ఉంది. ఈ క్రమంలో లబ్ధిదారుల ఎంపిక, గృహ నిర్మాణాల ప్రారంభం కూడా జరిగిపోయింది. ప్రభుత్వం మారిన తరువాత వాటి పరిస్థితి తారుమారైంది. 2019లో ఎన్నికల కోడ్‌ కారణంగా లబ్ధిదారులకు గృహాలు కేటాయించలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ ప్రక్రియ మరింత జాప్యం చేశారు. టీడీపీ హయాంలో లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని, తామే సరిదిద్ది ప్రారంభిస్తామని హామీలు ఇచ్చిన వైసీపీ నాయకులు చెప్పుకొచ్చారు. కానీ, ఆరేళ్లుగా గృహప్రవేశాలు జరగక మొత్తం ఇళ్లన్నీ పాడయ్యాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. లబ్ధిదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

  • మళ్లీ పనులు చేపట్టాల్సిందేనా?

    ఇదిలా ఉండగా ప్రస్తుతం హుద్‌హుద్‌ గృహాలు ప్రారంభించినా మొదటి నుంచి పనులు చేపట్టాల్సి ఉంది. తాగునీరు, విద్యుత్‌, రోడ్లు, కాలువలు, గృహాల్లో తలుపులు, కిటీకీలు, మరుగుదొడ్లు, ఫ్లోరింగ్‌ మొత్తం కొత్తగా వేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన పనులు చేయాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో రూ.2 కోట్లు వెచ్చించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ గృహాలు వినియోగం లేకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా మారాయి. స్థానికులు కొంతమంది బహిర్భూమిగా ఈ గృహాలను వినియోగిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మరమ్మతులు చేసి హుద్‌హుద్‌ గృహాలను లబ్ధిదారులకు అప్పగించాలని స్థానికులు కోరుతున్నారు.

  • తాగునీటికి అవస్థలు

    నేను దివ్యాంగురాలిని. నాకు హుద్‌హుద్‌ ఇల్లు కేటాయించడంతో ఎంతో సంబరపడ్డాను. తీరా ఇంటికి వెళ్లే సరికి తాగునీటి సౌకర్యం లేదు. రోజూ కూలీల ద్వారా తాగునీటిని, ఇంటికి అవసరమైన నీటిని తెప్పిస్తున్నాను.

    - పి.మంగమ్మ, టెక్కలి

  • విద్యుత్‌ సౌకర్యం లేదు

    నాకు హుద్‌హుద్‌ ఇల్లు ఇచ్చారనే తృప్తి లేదు. ఏడాదిగా కరెంటు లేక చీకటిలో మగ్గుతున్నాం. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు.

    - కె.అప్పయ్య, టెక్కలి


hud-hud-pls.gif

Updated Date - Jan 18 , 2025 | 12:10 AM