Share News

Vigilance: ఆ రూ.17 లక్షలు.. ఏం చేశారు?

ABN , Publish Date - Feb 08 , 2025 | 11:49 PM

Financial Decisions సంతబొమ్మాళి మండలం రుంకుహనుమంతు(ఆర్‌.హెచ్‌) పురం పంచాయతీలో 14, 15వ ఆర్థిక సంఘం నిధులు.. రూ.17లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులపై విజిలెన్స్‌ అధికారుల విచారణ చర్చనీయాంశంగా మారింది.

Vigilance: ఆ రూ.17 లక్షలు.. ఏం చేశారు?
హనుమంతుపురంలో మరుగుదొడ్ల వివరాలు సేకరిస్తున్న అధికారులు (ఫైల్‌)

  • అభివృద్ధి పనులకే వినియోగించారా?

  • ఆర్‌.హెచ్‌.పురం పంచాయతీలో వివాదం

  • విచారణ చేపట్టిన విజిలెన్స్‌ అధికారులు

  • సంతబొమ్మాళి, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): సంతబొమ్మాళి మండలం రుంకుహనుమంతు(ఆర్‌.హెచ్‌) పురం పంచాయతీలో 14, 15వ ఆర్థిక సంఘం నిధులు.. రూ.17లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులపై విజిలెన్స్‌ అధికారుల విచారణ చర్చనీయాంశంగా మారింది. సర్పంచ్‌ ఎన్ని మన్మధరావు పంచాయతీ నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని గ్రామానికి చెందిన కొందరు విజిలెన్స్‌ అధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన విజిలెన్స్‌ ఎస్పీ బర్ల ప్రసాదరావు ఆర్‌హెచ్‌పురం పంచాయతీలో జరిగిన అభివృద్ధి పనులపై విచారణకు ఆదేశించారు. ఈమేరకు విజిలెన్స్‌ సీఐ సింహాచలం, ఏఈ ప్రేమ్‌కుమార్‌, అసిస్టెంట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ చల్ల ఎర్రన్నాయుడు, హెచ్‌సీ కామేశ్వరరావు శుక్రవారం విచారణ చేపట్టారు. పంచాయతీ పరిధిలో 14, 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా మంజూరైన పనులను పరిశీలించారు. రుంకు గ్రామంలో రూ.6లక్షలతో వేసిన కంకర రోడ్డుకు కొలతలు తీశారు. హనుమంతుపురంలో పెద్దచెరువుకు రూ.2లక్షలతో వేసిన కంకర రోడ్డును, రూ.6లక్షలతో నిర్మించిన సీసీ డ్రైనేజీ, రూ.2లక్షలతో నిర్మించిన రచ్చబండ, పాఠశాల వద్ద రూ.లక్షతో నిర్మించిన మరుగుదొడ్లను పరిశీలించారు. ఎం-బుక్‌లో నమోదు చేసినవాటిని, క్షేత్రస్థాయిలో ఉన్న కొలతలను విజిలెన్స్‌ ఏఈ ప్రేమ్‌కుమార్‌ సేకరించారు. మండల ఇంజనీరింగ్‌ అధికారులు, పంచాయతీ కార్యదర్శుల నుంచి కూడా వివరాలు సేకరించారు. పంచాయతీ పరిధిలోని పదికిపైగా తాగునీటి బోరులను పరిశీలించాల్సి ఉంది. ఎం-బుక్‌ ప్రకారం బోరుల లోతును మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఈ విషయమై విజిలెన్స్‌ అసిస్టెంట్‌ సబ్‌రిజిస్ర్టార్‌ చల్ల ఎర్రన్నాయుడు వద్ద ప్రస్తావించగా.. ఆర్‌.హెచ్‌.పురం పంచాయతీలో రూ.17లక్షలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై విచారణ చేపట్టామన్నారు. ఇంకా పది బోర్లను పరిశీలించాల్సి ఉందని, విచారణ పూర్తినివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు.

Updated Date - Feb 08 , 2025 | 11:50 PM