పట్టుమహాదేవి కోనేరును అభివృద్ధి చేస్తాం
ABN , Publish Date - Feb 16 , 2025 | 12:32 AM
టెక్కలి పట్టణానికి మణిహారంగా ఉన్న పట్టుమహాదేవి కోనేరు అభివృద్ధికి వేగవంతంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు.
- ప్రతిపాదనలు సిద్ధం చేయండి
- కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ పుండ్కర్
టెక్కలి, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): టెక్కలి పట్టణానికి మణిహారంగా ఉన్న పట్టుమహాదేవి కోనేరు అభివృద్ధికి వేగవంతంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం వివిధ శాఖల అధికారులతో కలిసి పట్టుమహాదేవి కోనేరును ఆయన పరిశీలించారు. కోనేరు ఆక్రమణలకు గురైందా? తదితర వివరాలు ఆరాతీశారు. ఇన్‌లెట్ ద్వారా మంచినీరు వచ్చేందుకు, ఔట్‌లెట్ ద్వారా నీరు మళ్లించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అమృత్ సరోవర్ కింద ఏ మేరకు నిధులు కేటాయించారని ఏపీవో బగాది ప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. స్ట్రాంగ్‌ఫెన్సింగ్, వాక్‌వే మార్గం, లైటింగ్, బెంచీలు, పార్క్, క్యాంటీన్, ఇతర సౌకర్యాలు కల్పించాలని, ఈ మేరకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కలెక్టర్ సందర్శించారు. విద్యార్థులకు తడిచెత్త, పొడిచెత్తపై అవగాహన కల్పించారు. తడిచెత్తతో తయారయ్యే ఎరువులు, పొడిచెత్తతో రీసైక్లింగ్ అయ్యే మార్గాలు వివరించారు. కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల్లోని మత్స్యకార గ్రామాల్లో బాల్య వివాహాలు అధికంగా జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. చదువుపై దృష్టి సారించి 21ఏళ్ల తరువాతనే పెళ్లి చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. కళాశాలలో సీసీ కెమెరాలు, ఎన్‌సీసీ సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్‌తో పాటు ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, ప్రిన్సిపాల్ డాక్టర్ టి.గోవిందమ్మ, డీపీవో భారతీ సౌజన్య, ఎంపీడీవో లక్ష్మీభాయి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.