Share News

చుట్టూ నీరు.. వాడుతున్న పైరు

ABN , Publish Date - Jan 22 , 2025 | 11:52 PM

మందస మండలంలో ఐదు రిజర్వాయర్లు, జీవధార సునాముది, మహేంద్ర తనయా వంటి పలు నీటి వనరులు ఉన్నా రబీ పంటలకు సాగునీరు అందడం లేదు. కాలువలు అధ్వానంగా ఉండడంతో సాగునీరు ప్రవహించడం లేదు.

   చుట్టూ నీరు.. వాడుతున్న పైరు
కుంబిగాం వద్ద కాపు దశలో నీరు లేక ఎండిపోయిన మిరప పంట

- అధ్వానంగా సాగునీటి కాలువలు

- మరమ్మతులకు నోచుకోని వైనం

-నీరు ప్రవహించక ఎండుతున్న అపరాలు

- ఆందోళనలో రబీ రైతులు

హరిపురం, జనవరి 22(ఆంధ్రజ్యోతి): మందస మండలంలో ఐదు రిజర్వాయర్లు, జీవధార సునాముది, మహేంద్ర తనయా వంటి పలు నీటి వనరులు ఉన్నా రబీ పంటలకు సాగునీరు అందడం లేదు. కాలువలు అధ్వానంగా ఉండడంతో సాగునీరు ప్రవహించడం లేదు. దీంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ మోటార్లు ఉన్నా విద్యుత్‌ కోతలతో పని చేయడం లేదని, దీనివల్ల కనీసం రోజుకు పది సెంట్లు భూమికి కూడా తడి అందడం లేదని వాపోతున్నారు. గత డిసెంబరులో వరుసగా ఏర్పడిన తుఫాన్ల కారణంగా మందల మండలంలో భారీ వర్షాలు కురిశాయి. దీనివల్ల రిజర్వాయర్లు, చెరువులు, నదుల్లో నీరు పుష్కలంగా ఉంది. దీంతో రైతులంతా రబీపై ఆశలు పెట్టుకున్నారు. మండలంలో సుమారు పది వేల హెక్టార్లలో వేరుశనగ, మినుము, పెసర, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలతో పాటు నువ్వులు, కూరగాయలు, చెరుకు వంటి పంటలు వేశారు. అయితే, కాలువలు పిచ్చిమొక్కలు, పూడికతో అధ్వానంగా ఉన్నాయి. వాటిని బాగు చేయకపోవడంతో ప్రసుత్తం నీరు ప్రవహించడం లేదు. మరోపక్క కరెంటు కోతలతో వ్యవసాయ మోటార్లు పనిచేయక ఛత్రపురం, చిన్నకోష్ఠ, కుంబిగాం, మహదేవిపురం తదితర ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయి. నీటి ఇంజిన్లతో, గూడలు వేసి పంటలకు నీరందిస్తున్నారు. దీనివల్ల అధిక పెట్టుబడి అవుతుందని తప్ప గిట్టుబాటు కావడంలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. కాలువలకు తాత్కాలిక మరమ్మతులు తప్ప, శాశ్వత పనులు జరగకపోవడంతో సాగునీరు అందడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా కాలువలను బాగు చేయాలని కోరుతున్నారు.

ప్రతిపాదనలు పంపించాం

ఉపాధి హామీ పథకం పనుల ద్వారా కాలువలను బాగు చేసుకోవాలి. సిమెంటు కట్టడాలు, మదుముల నిర్మాణాలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైన వెంటనే పనులు పూర్తి చేస్తాం. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.

- శ్రీనివాసరావు, ఏఈ, జలవనరుల శాఖ

Updated Date - Jan 22 , 2025 | 11:52 PM