Vinilakasha వినీలాకాశంలో విహారం
ABN , Publish Date - Feb 03 , 2025 | 12:52 AM
రథసప్తమి వేడుకలు సందర్భంగా సిక్కోలు నగరంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ టూరిజం సిక్కోలు వాసులను అలరించింది.

హెలికాప్టర్ టూరిజంపై ఆసక్తి
అరసవల్లి/అర్బన్, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): రథసప్తమి వేడుకలు సందర్భంగా సిక్కోలు నగరంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ టూరిజం సిక్కోలు వాసులను అలరించింది. వినీలాకాశంలో జిల్లావాసులు విహరిస్తూ ఆనందంగా గడిపారు. ఆదివారం ఉదయం 9గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, మంచు ప్రభావంతో 11.40 గంటలకు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే శంకర్‌తో కలిసి ప్రారంభించారు. తొలుత కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, ఆర్డీవోలు సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి హెలికాప్టర్‌లో సిక్కోలు గగనతలంపై విహరించారు. అనంతరం చిత్రలేఖనం పోటీల్లో విజేతలుగా నిలిచిన చిన్నారులకు ఉచితంగా హెలికాప్టర్ ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు హెలికాప్టర్‌లో ఆకాశ విహారాన్ని ఆనందించారు. ఒకసారి ఆరుగురు చొప్పున్న హెలికాప్టర్‌లో విహరించారు. ఒక్కొక్కరికి టికెట్ రూ.1800 కాగా ఎనిమిది నిమిషాలపాటు ఆకాశంలో సిక్కోలు నగరాన్ని వీక్షించారు.
మొరాయించిన వెబ్‌సైట్
హెలికాప్టర్ విహారానికి ముందుగా సంబంధింత వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికే ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని అధికారులు ప్రకటించారు. కానీ ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున ప్రజలు టిక్కెట్ల బుకింగ్‌కు ప్రయ త్నించడంతో సర్వర్ మొరాయించింది. దీంతో ప్రజలు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్ వద్దకు ప్రజలు టిక్కెట్ల కోసం ఎగబడ్డారు. అక్కడా ఇదే పరిస్థితి ఎదురవడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. ఆదివారం ఈ హెలికాప్టర్ విహారంలో 200 మంది పాల్గొన్నారని, ఎనిమిది నిమిషాల చొప్పున 33 రౌండ్ల తిరిగినట్టు డ్వామా పీడీ సుధాకర్ తెలిపారు. దీని ద్వారా రూ.3.60 లక్షలు ఆదాయం సమకూరిందన్నారు. సోమవారం ఉదయం 9.00గంటల నుంచి సాయంత్రం 4.00 వరకు ఆన్‌లైన్ బుకింగ్ పూర్తయిందని, సాయంత్రం 4.00 గంటల తర్వాత విహారయాత్రకు సంబంధించి డచ్ బిల్డింగ్ వద్ద టికెట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. మంగళవారం కూడా హెలికాప్టర్ ప్రయాణ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు.