Veterinary: పాడి పోషణకు చేయూత
ABN , Publish Date - Jan 20 , 2025 | 11:43 PM
Animal Health పశుసంపద, పాడి పెంపకంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది, ఉచితంగా గ్రాసం పెంపకానికి ఉపాధి నిధులు సమకూర్చుతోంది. పశువులు, గొర్రెలు, మేకలు వంటి మూగజీవాల కోసం పెంపకందారులకు 90 శాతం రాయితీపై మినీ గోకులాలు నిర్మిస్తోంది. తాజాగా సోమవారం నుంచి గ్రామాల్లో పశు వైద్య శిబిరాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది.
గ్రామాల్లో పశు వైద్యశిబిరాలు ప్రారంభం
ఉచితంగా పరీక్షలు, టీకాలు, మందుల పంపిణీ
రూ.95.36 లక్షల నిధులు విడుదల
నరసన్నపేట, జనవరి 20(ఆంధ్రజ్యోతి): పశుసంపద, పాడి పెంపకంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది, ఉచితంగా గ్రాసం పెంపకానికి ఉపాధి నిధులు సమకూర్చుతోంది. పశువులు, గొర్రెలు, మేకలు వంటి మూగజీవాల కోసం పెంపకందారులకు 90 శాతం రాయితీపై మినీ గోకులాలు నిర్మిస్తోంది. తాజాగా సోమవారం నుంచి గ్రామాల్లో పశు వైద్య శిబిరాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఈ నెలాఖరు వరకూ గ్రామీణ పశువైద్య కేంద్రాలు, రైతు సేవా కేంద్రాల వద్ద పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించనుంది. దీంతో పాడి రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
జిల్లాలో 3,75,345 ఆవులు, గేదెలు, 45,914 దూడలు, 7,19,985 గొర్రెలు, మేకలు ఉన్నట్లు పశుసంవర్థశాఖ అధికారులు తెలిపారు. సోమవారం పశువైద్య శిబిరాలు ప్రారంభించారు. ప్రతి మండంలోని రెండు గ్రామాల్లో ఈ నెల 31 వరకూ శిబిరాలను నిర్వహించనున్నారు. శిబిరాల్లో పశువైద్య అధికారి, ఇద్దరు సహాయకులు, ఒక అటెండర్ ఉంటారు. జిల్లాలో 92 పశుకేంద్రాల వైద్యులు, 358 రైతుసేవాకేంద్రాల సిబ్బంది ద్వారా సేవలు అందించనున్నారు. మూగజీవాలకు వైద్య పరీక్షలతోపాటు శస్త్రచికిత్సలు, అవసరమైన మందులు ఉచితంగా ఇస్తారు. గర్భకోశ వ్యాధులకు పరీక్షలు నిర్వహించి తగు వైద్యం అందించనున్నారు. పశువులు, చిన్న దూడలు, గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు ఉచితంగా ఇస్తారు. పశు ఆరోగ్య సంరక్షణలో భాగంగా అన్ని గ్రామాల్లో పశువులకు టీకాలు వేయనున్నారు.
ఏలికపాము నివారణ ప్రధాన ఉద్దేశంగా పశువులకు ముందుగా మందులను అందిస్తున్నారు. పాల ఉత్పత్తి పెంచడం, గొర్రెలు, మేకలు, కోళ్లు తదితర వాటికి మాశూచి నివారణ మందులు కూడా పంపిణీ చేస్తున్నారు. ఏలికాపాముల నివారణకు ప్రభుత్వం రూ.95.36 లక్షల నిధులను మంజూరు చేసింది. వీటి నివారణ ద్వారా పశువులు ఆహారం తీసుకోవడంతోపాటు ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. పాడి పశువులకు పాల ఉత్పత్తి పెరుగుతుంది. మేకలు, గొర్రెలలో ఏపుదల పెరిగి మాంసం దిగుబడి ఎక్కువవుతుంది.
11 రోజలపాటు శిబిరాలు
పాడి పరిశ్రమకు చేయూతనిచ్చేందుకు జిల్లాలో 11 రోజులపాటు పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తాం. రైతులకు పాడిపశువులు పెంపకంపై అవగాహన పెంచుతాం. ఏలికపాములు నివారణ ప్రధాన లక్ష్యంగా పశువులకు మందులు వేయిస్తాం. శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
- రాజగోపాలరావు, జేడీ, పశుసంవర్థక శాఖ, శ్రీకాకుళం