Share News

Agri lab: వృథాగా.. అగ్రిల్యాబ్‌లు

ABN , Publish Date - Jan 06 , 2025 | 12:22 AM

Agrilabs జిల్లాలో అగ్రిల్యాబ్‌ భవన నిర్మాణాలు నిరుపయోగంగా మారాయి. వైసీపీ హయాంలో లక్షలాది రూపాయలతో నిర్మించిన ఈ భవనాలు కొన్నిచోట్ల వినియోగంలో లేక వృథాగా ఉన్నాయి. వ్యవసాయ, మత్స్య, పశుసంవర్ధకశాఖలను కలుపుతూ అగ్రిల్యాబ్‌లు నిర్మించారు.

Agri lab: వృథాగా.. అగ్రిల్యాబ్‌లు
టెక్కలిలోని అగ్రిల్యాబ్‌లో మూలకు చేరిన సాంకేతిక పరికరాలు

  • దుర్వినియోగమైన నిధులు

  • మూలకు చేరిన పరికరాలు

  • రైతులకు సక్రమంగా అందని సేవలు

  • టెక్కలి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అగ్రిల్యాబ్‌ భవన నిర్మాణాలు నిరుపయోగంగా మారాయి. వైసీపీ హయాంలో లక్షలాది రూపాయలతో నిర్మించిన ఈ భవనాలు కొన్నిచోట్ల వినియోగంలో లేక వృథాగా ఉన్నాయి. వ్యవసాయ, మత్స్య, పశుసంవర్ధకశాఖలను కలుపుతూ అగ్రిల్యాబ్‌లు నిర్మించారు. నియోజకవర్గానికి ఒక్కో భవన నిర్మాణానికిగానూ గత ప్రభుత్వం రూ.84లక్షలు నిధులు కేటాయించింది. 2022 జూలై 23న అప్పటి సీఎం జగన్‌ వర్చువల్‌ విధానంలో వీటిని ప్రారంభించారు. కాగా.. టెక్కలి, సోంపేట నియోజకవర్గాల్లో నిర్మాణాలు పూర్తయినా.. నేటికీ వినియోగానికి నోచుకోవడం లేదు. ఆమదాలవలసలో మాత్రమే కొంతమేర సేవలు సక్రమంగా అందుతున్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లో అంతంతమాత్రంగానే సేవలు కొనసాగుతున్నాయి.

  • వ్యవసాయశాఖకు సంబంధించి పరిశీలిస్తే.. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల నాణ్యతను పరిశీలించాలి. కాగా.. భవనాలు ప్రారంభించి సుమారు 18 నెలలైనా.. ఇప్పటికీ వ్యవసాయశాఖ ద్వారా ఏ రకమైన నాణ్యతా పరీక్షలు చేయలేదు. విత్తన విభాగం నాణ్యత పరిశీలనకు బ్లోవర్‌, డివైడర్‌, జన్యుమరేటర్‌, పవర్‌టీ బోర్డు తదితర సాంకేతిక పరికరాలు అవసరం. ఇవి కార్యాలయానికి చేరుకున్నా అమర్చలేదు. ఎరువుల నాణ్యత పరిశీలనకుగాను గ్లాస్‌వేర్‌ సామగ్రి, కెమికల్స్‌, వాటర్‌బాత్‌, డిస్టల్‌ వాటర్‌ యూనిట్‌, హాట్‌ ఎయిర్‌ ఓపెన్‌, డిస్‌క్వార్టర్స్‌, ఫ్లేమ్‌హుడ్‌, డయాగ్నస్టిక్‌, డిస్టెన్స్‌ యూనిట్‌ వంటి సాంకేతిక సామాగ్రి అవసరం. ఇక పురుగుమందులకు సంబంధించి నాణ్యతా ప్రమాణాలు పర్యవేక్షించేందుకు ఒక్క పరికరం కూడా అగ్రిల్యాబ్‌కు చేరలేదు.

  • విత్తనాల నాణ్యతా ప్రమాణాలు పరిశీలించాలంటే రైతులు కనీసం అరకేజీ విత్తనాలు అగ్రిల్యాబ్‌కు తీసుకురావాలి. వాటిని పరీక్షించి.. వారం రోజుల్లో విత్తన నాణ్యతా ప్రమాణాలు వెల్లడిస్తారు. రైతులకు ఈ పరీక్షలు ఉచితమే. మిగిలినవారు కొంత రుసుం ల్యాబ్‌కు చెల్లించాలి. ఎరువులకు సంబంధించి నాణ్యతా ప్రమాణాలు తెలుసుకోవాలంటే కనీసం 400 గ్రాములు అందజేయాలి. వీటి నాణ్యతా ప్రమాణాల పనితీరు 48గంటల్లో వెల్లడిస్తారు. రైతులకు ఉచితం కాగా స్థానికేతరులకైతే కనీసం రూ.500 చెల్లించాలి. ఎరువుల నాణ్యత పరిశీలనకు అవసరమయ్యే కెమికల్స్‌కు గాను కనీసం రూ.5లక్షలు నిధులు కేటాయించాల్సి ఉంది. కాగా.. అగ్రిల్యాబ్‌లు ప్రారంభించినా.. పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇటు భవన నిర్మాణానికి, అటు సాంకేతిక పరికరాలకు కోట్ల రూపాయలు వెచ్చించినా.. ప్రయోజనం లేకపోతోందని వాపోతున్నారు. అధికారులు, పాలకులు స్పందించి అగ్రిల్యాబ్‌లు వినియోగించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Updated Date - Jan 06 , 2025 | 12:22 AM