Ganjai : వీడని మత్తు
ABN , Publish Date - Feb 26 , 2025 | 12:18 AM
Illegal marijuana గంజాయి మత్తు.. జిల్లాను వీడడం లేదు. గంజాయి నిర్మూలనపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి.. విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో భారీగా గంజాయి నిల్వలు పట్టుబడుతున్నాయి. మన రాష్ట్ర పోలీసులు అనుమానిస్తున్నట్టుగానే ఒడిశా నుంచి భారీ స్థాయిలో గంజాయి రవాణా జరుగుతోంది.

జిల్లాలో ఆగని గంజాయి అక్రమ రవాణా
ఒడిశా టు చెన్నై.. బెంగుళూరు వయా పలాస
పలాస రైల్వే స్టేషన్‌రోడ్డులో పట్టుబడిన ఒడిశా ముఠా
ఇచ్ఛాపురం, వజ్రపుకొత్తూరు మండలాల్లో కూడా నిల్వలు స్వాధీనం
మొత్తంగా 11 మంది అరెస్టు
పలాస, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): గంజాయి మత్తు.. జిల్లాను వీడడం లేదు. గంజాయి నిర్మూలనపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి.. విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో భారీగా గంజాయి నిల్వలు పట్టుబడుతున్నాయి. మన రాష్ట్ర పోలీసులు అనుమానిస్తున్నట్టుగానే ఒడిశా నుంచి భారీ స్థాయిలో గంజాయి రవాణా జరుగుతోంది. ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయిని పలాస, ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్లకు చేరవేసి అక్కడ నుంచి చెన్నై, బెంగుళూరు వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. పోలీసులు తనిఖీల్లో మంగళవారం ఒక్కరోజే పలాస, ఇచ్ఛాపురం, వజ్రపుకొత్తూరు, సోంపేట మండలాల్లో 11 మంది అరెస్టు అయ్యారు. వారి నుంచి గంజాయితోపాటు ద్విచక్ర వాహనాలు, ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకటఅప్పారావు వెల్లడించారు. గంజాయి నివారణపై పూర్తిస్థాయి దృష్టి పెట్టామని, రైల్వేస్టేషన్, బస్టాండు వంటి ప్రాంతాల్లో నిఘా పెంచామని డీఎస్పీ తెలిపారు. గంజాయి సేవించినా, రవాణా చేసినా నేరమని, వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
పలాసలో 40 కిలోలు..
పలాస రైల్వేస్టేషన్‌రోడ్డులో మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ తన బృందంతో సోదాలు చేయగా.. ఇద్దరు వ్యక్తులు మోటారు వాహనాలపై లగేజీ బ్యాగులతో అనుమానస్పదంగా కనిపించారు. వారిని ప్రశ్నించడంతో గంజాయి రవాణా విషయం బయట పడింది. వారి వద్ద 40.026 కిలోల గంజాయి పోలీసులకు పట్టుబడింది. ఒడిశా రాష్ట్రం రాయఘడ జిల్లా జిరా గ్రామానికి చెందిన నరేంద్రలిమ, గజపతి జిల్లా సుందరడంగ్ గ్రామానికి చెందిన లితురథ్, జిల్లు, మోహనబ్లాక్‌కు చెందిన బబులాలు ముఠాగా ఏర్పడి గంజాయి రవాణా చేస్తుంటారు. ఇందులో బబులా ఉదయగిరి, మోహనబ్లాక్‌ల్లో గంజాయి పండించడంతో పాటు రవాణా కూడా చేస్తుంటాడు. ఇతని స్నేహితుడు జిల్లుకు గంజాయి సరఫరా చేస్తూ.. పలాస రైల్వేస్టేషన్ వద్ద బ్రోకర్లకు అప్పగిస్తుంటారు. చెన్నై, బెంగుళూరు నుంచి భారీ గంజాయి ఆర్డర్ రావడంతో మరో ఇద్దరు వ్యక్తుల సహకారం తీసుకొని పలాస గంజాయి తరలించాలని బబులా చెప్పడంతో జిల్లు తన స్నేహితులైన నరేంద్రలిమ, లితురథ్‌లకు గంజాయి రవాణా పని అప్పగించాడు. వారు ద్విచక్ర వాహనాలపై 40.026 కిలోల గంజాయిని మొత్తం 19 ప్యాకెట్లుగా కట్టి బ్యాగుల్లో ఎవరికి అనుమానం రాకుండా పలాస తరలించారు. పోలీసులు సోదాలు చేయడంతో నరేంద్రలిమ, లితురథ్ పట్టుబడ్డారు. వారితో వచ్చిన జిల్లు పరారీ అయ్యాడు. గంజాయి పండిస్తు రవాణా చేస్తున్న బబులా కోసం పోలీసులు గాలిస్తున్నారు. పది రోజుల వ్యవధిలో పలాస రైల్వే స్టేషన్ వద్ద గంజాయి ముఠాను పట్టుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
వజ్రపుకొత్తూరులో 18 కిలోలు..
వజ్రపుకొత్తూరు, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): వజ్రపుకొత్తూరు మండలంలో రెండుచోట్ల 18కిలోల 280 గ్రాముల గంజాయి పట్టుబడిందని కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు తెలిపారు. మంగళవారం వజ్రపుకొత్తూరు పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో డీఎస్పీ మాట్లాడారు. ‘సోమవారం మధ్యాహ్నం బెండిగేటు జంక్షన్ వద్ద గంజాయి రవాణాకు పాల్పడుతున్న ఒడిశా రాష్ట్రం గంజాంకు చెందిన మనయ్‌సబర్, ప్రశాంతి మల్లిక్‌తోపాటు వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవుకు చెందిన బైనపల్లి షణ్ముఖను అరెస్టు చేశాం. వారి నుంచి 8.280 కిలోల గంజాయి, ఒక ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాం. అదేరోజు పూండి రైల్వేస్టేషన్‌లో 10 కిలోల గంజాయిని రవాణా చేస్తున్న ఒడిశా రాష్ట్రం గంజాంకు చెందిన ప్రశాంత్ కుమార్ సాహు, భారతీసాహు, ముంబైకి చెందిన నవాబ్ అహ్మద్‌ను అరెస్టు చేశాం. వారి వద్ద 10 కిలోల గంజాయితో పాటు రెండు ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నాం. నిందితులను మంగళవారం కోర్టులో హాజరు పరిచామ’ని డీఎస్పీ వెల్లడించారు. కార్యక్రమంలో కాశీబుగ్గ సీఐ డి.తిరుపతిరావు, ఎస్‌ఐ బి.నిహార్ పాల్గొన్నారు.
మత్తు పదార్థాలకు బానిస కావద్దు: డీఎస్పీ
జిల్లాలో గంజాయి రవాణా అడ్డుకునేందుకు డీఐజీ గోపినాథ్‌జెట్టి, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు. తాత్కాలిక ఆనందం కోసం యువత.. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిస కావద్దని సూచించారు. ‘స్మగ్లర్లు యువతకు డబ్బు ఆశ చూపి గంజాయి రవాణా చేయిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. నిరుద్యోగ యువతే స్మగ్లర్లు టార్గెట్ చేస్తున్నారు. యువత అప్రమత్తంగా ఉండాలి. మత్తు పదార్థాలతో పట్టుబడితే కఠిన కేసులు నమోదవుతాయి. వారి జీవితాలు నాశమవుతాయి. కుటుంబాలు కూడా వీధిన పడతాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని యువత భవిష్యత్ కాపాడుకోవాలి’ అని డీఎస్పీ తెలిపారు. గంజాయి రవాణా విషయం తెలిస్తే.. పోలీసులకు సమాచారం అందజేయాలని సూచించారు. కాగా వజ్రపుకొత్తూరు మండలానికి కూడా గంజాయి సంస్కృతి పాకడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఇచ్ఛాపురంలో 10 కేజీలు..
ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయిని తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు నిందుతులను అరెస్ట్ చేశామని కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు, సీఐ మీసాల చిన్నమనాయుడు తెలిపారు. మహారాష్ట్ర రాష్ట్రం జలన జిల్లా పెవ గ్రామానికి చెందిన రవిరామధోత్రే, పర్బాని జిల్లా జింతూరు గ్రామానికి చెందిన విశ్వనాథ్ తుకారం ఖండేకర్.. ఒడిశాలో పది కిలోలు గంజాయి కొనుగోలు చేసి మంగళవారం ఇచ్ఛాపురం చేరుకున్నారు. ఇక్కడ నుంచి రైలులో మహారాష్ట్ర వెళ్లి అక్కడ వ్యాపారి రాహుల్ గవాజేకు గంజాయి అందించాలని భావించారు. ఈమేరకు ఎం.తోటూరు మీదుగా రైల్వేస్టేషన్‌కు వారిద్దరూ వెళ్తుండగా రూరల్ ఎస్‌ఐ శ్రీనివాస్, సిబ్బందికి పట్టుబడ్డారు. వారి నుంచి గంజాయితో పాటు రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీఐ చిన్నమనాయుడు తెలిపారు.
సోంపేటలో 6 కిలోలు..
సోంపేట, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): సోంపేటలో గంజాయి తరలిస్తున్న ప్రధాన్ రాజేష్‌ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన సుబ్రహ్మణ్యం 3 ప్యాకెట్లు(6కిలోలు) గంజాయిని ముంబై తరలిస్తున్నట్టు సమాచారం అందింది. మంగళవారం మధ్యాహ్నం సోంపేట బస్‌స్టేషన్‌లో ఆయనను అరెస్టు చేశామని తెలిపారు. కార్యక్రమంలో సీఐ మంగరాజు, ఎస్‌ఐ లవరాజు పాల్గొన్నారు.