Share News

Counseling: కౌన్సిలింగ్‌తో ఒక్కటై..

ABN , Publish Date - Feb 13 , 2025 | 12:09 AM

couple reconciliation ప్రేమ వివాహాలు, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు కొన్ని మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. ఏడడుగులు వేసి.. కలకాలం కలిసి ఉండాల్సిన వారు.. పెళ్లయిన ఏడాదికే వివాహ బంధం విలువను మరిచిపోతున్నారు. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించకుండా మనస్పర్థలతో వివాహ బందాన్ని తెంచుకునేందుకు పోలీసుస్టేషన్ల బాట పడుతున్నారు.

Counseling: కౌన్సిలింగ్‌తో ఒక్కటై..
మహిళా పోలీసుస్టేషన్‌లో నిర్వహిస్తున్న ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ (ఫైల్‌)

  • దంపతుల మధ్య కొరవడుతున్న నమ్మకం

  • మనస్పర్థలతో పోలీసుస్టేషన్‌ను ఆశ్రయిస్తున్న వైనం

  • వివాహ బంధాల పదిలం కోసం పోలీసుల కృషి

  • 13 నెలల్లో 807 కేసులకు 669 రాజీ

  • శ్రీకాకుళం క్రైం, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ప్రేమ వివాహాలు, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు కొన్ని మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. ఏడడుగులు వేసి.. కలకాలం కలిసి ఉండాల్సిన వారు.. పెళ్లయిన ఏడాదికే వివాహ బంధం విలువను మరిచిపోతున్నారు. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించకుండా మనస్పర్థలతో వివాహ బందాన్ని తెంచుకునేందుకు పోలీసుస్టేషన్ల బాట పడుతున్నారు. చిన్నచిన్న విషయాలకు గొడవ పడి.. అటు కుటుంబ పరువు, ఇటు పిల్లల భవిష్యత్‌ కోసం ఆలోచించకుండా.. విడిపోదామనే నిర్ణయాలకు వస్తున్నారు. తల్లిదండ్రుల నీడలో పెరగాల్సిన పిల్లలను పట్టించుకోకుండా కేసులు, కోర్టులు అంటూ వారి బాల్యాన్ని మసకబారిస్తున్నారు. భార్య భర్తల మధ్య గొడవలను పరిష్కరించాల్సిన కుటుంబ పెద్దలు ఇంట్లో లేకపోవడం, ఉమ్మడి కుటుంబాలు అంతరించుకుపోతుండటంతో చిన్నపాటి విషయాలకు పోలీసుస్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల మహిళా పోలీసు స్టేషన్లలో ఇటువంటి కేసులు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులే కుటుంబ పెద్ద బాధ్యతను వహిస్తూ భార్యాభర్తలకు కౌన్సిలింగ్‌ నిర్వహించి వారిని ఒక్కటి చేస్తున్నారు.

  • చదువుకున్న వారే అధికం

  • వరకట్న వేధింపులు... అత్తింటివారు, భర్త తనను సరిగా చూసుకోవడం లేదని భార్య.... తన మాట వినడం లేదని భర్త.. ఇలా తదితర కారణాలపై పోలీసుస్టేషన్లలో భార్యాభర్తల ఫిర్యాదులు అందుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 36 పోలీసుస్టేషన్ల ప్రతీ రోజు ఇటువంటి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వాటిని శ్రీకాకుళంలో ఉన్న మహిళా పోలీసుస్టేషన్‌కు ప్రతిపాదిస్తున్నారు. అక్కడ భార్యాభర్తలకు పోలీసులు ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. మహిళా పోలీసు స్టేషన్‌కు గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది జనవరి వరకు భార్యాభర్తల మధ్య గొడవలపై 807 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో ప్యామిలీ కౌన్సిలింగ్‌ ద్వారా 669 మంది జంటలను మహిళా పోలీసులు ఒక్కటి చేశారు. అలాగే 133 కేసులు నమోదు చేశారు. గత నెలకు సంబంధించి ఐదు కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. చాలా వరకూ రాజీ కుదుర్చుతున్నా.. కొందరిలో మార్పు రాకపోవడంతో కేసులు నమోదు చేస్తున్నారు. ఇటువంటి ఘటనల్లో చదువుకున్న వారే అధిక శాతం కోర్టులను ఆశ్రయించి విడాకులు తీసుకుంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

  • మహిళా పోలీసుస్టేషన్‌లో ప్రతీ మంగళవారం, శుక్రవారం భార్యాభర్తలకు ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ కౌన్సిలింగ్‌లో ఇద్దరు న్యాయవాదులు, రిటైర్ట్‌ ఎస్‌ఐ స్థాయి అధికారి, ఒక సీనియర్‌ సిటిజన్‌, ఐసీడీఎస్‌ మహిళా సిబ్బంది, మహిళా పోలీసుస్టేషన్‌ డీఎస్పీ, సీఐ, ఇద్దరు ఎస్‌ఐలు, మహిళా పోలీసులు.. భార్యాభర్తలతో మాట్లాడుతారు. వారి గొడవలకు కారణాలు తెలుసుకుంటారు. అనంతరం ఆ సమస్యను పరిష్కరించే దిశగా కౌన్సిలింగ్‌ నిర్వహించి వివాహ బంధం గొప్పతనాన్ని వివరిస్తారు. సమస్య ఆధారంగా నాలుగైదు సార్లు కౌన్సిలింగ్‌ నిర్వహించడంతో పాటు వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడతారు. ఇలా 95 శాతం మంది భార్యాభర్తలను కలుపుతూ జిల్లాలో ఫ్యామిలీ కౌన్సిలింగ్‌కి మహిళా పోలీసుస్టేషన్‌ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

  • అందరూ ఉన్నా అనాథలుగా...

  • భార్యాభర్తల మధ్య మనస్పర్థలతో పోలీసుస్టేషన్లను ఆశ్రయించి కోర్టుల్లో విడాకులు తీసుకుంటుండటంతో అందరూ ఉన్నా పిల్లలు అనాఽథలుగా మారుతున్నారు. తండ్రి సంరక్షణలో, తల్లి ఆప్యాయత,ప్రేమానురాగాల మధ్య పెరగాల్సిన పిల్లలు మానసికంగా కుంగిపోతున్నారు. పోలీసుస్టేషన్లలో తల్లిదండ్రులు గొడవ పడటం చూస్తూ పిల్లలు కన్నీరు పెడుతుండటం చుట్టు పక్కల వారిని కలచివేస్తున్నా కొంతమంది దంపతుల్లో మాత్రం మార్పు రావడం లేదు. పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని.. భార్యాభర్తలు సఖ్యతగా మెలగాలని పోలీసులు సూచిస్తున్నారు.

  • వీలైనంత వరకు కలిపేలా చూస్తున్నాం

    పోలీసుస్టేషన్‌కు వచ్చే భార్యాభర్తలకు మొదట కౌన్సిలింగ్‌ ఇచ్చి కలిపేలా చూస్తున్నాం. లేదంటే కేసులు నమోదు చేస్తున్నాం. చదువుకున్న వారు, ఉద్యోగాలు చేస్తున్నవారే విడాకులు కావాలనుకుంటున్నారు. జిల్లాలో అధిక శాతం గ్రామీణ ప్రాంత మహిళలు వరకట్న వేధింపులు, తాగుబోతు భర్తలు, అత్తమామల వేధింపులు తాళలేక ఫిర్యాదు చేస్తున్నారు. చట్టాలపై అవగాహన లేకపోవడం, తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడిన వారు, విదేశాల్లో అల్లుడు కావాలనుకునే వారే ఎక్కువగా మోసపోతూ మహిళా పోలీసుస్టేషన్‌ను ఆశ్రయిస్తున్నారు. ప్రతీ మహిళా చట్టాలపై అవగాహన కలిగి, 23 ఏళ్లకు వివాహం చేసుకోవాలి. ప్రతీ కళాశాల, పాఠశాలల్లో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నాం.

    టి.త్రివేణి. సీఐ, మహిళా పోలీసుస్టేషన్‌

  • మహిళా పోలీసుస్టేషన్‌లో కేసుల వివరాలు

  • ..........................................................................................................................

  • ఏడాది నెల ఫిర్యాదులు ఎఫ్‌ఐఆర్‌లు కౌన్సిలింగ్‌తో రాజీ పెండింగ్‌

  • ..................................................................................................

  • 2024 జనవరి 61 11 50 0

  • ఫిబ్రవరి 66 12 54 0

  • మార్చి 72 16 56 0

  • ఏప్రిల్‌ 69 8 61 0

  • మే 62 7 55 0

  • జూన్‌ 60 8 52 0

  • జూలై 70 12 58 0

  • ఆగస్టు 45 13 32 0

  • సెప్టెంబరు 71 7 64 0

  • అక్టోబరు 74 13 61 0

  • నవంబరు 63 14 49 0

  • డిసెంబరు 40 7 33 0

  • 2025 జనవరి 54 5 44 5

    .............................................................................................................

    మొత్తం 807 133 669 5

    .......................................................................................................................

Updated Date - Feb 13 , 2025 | 12:09 AM