Groundnut: ఈ నెలా.. కందిపప్పు లేనట్టే
ABN , Publish Date - Mar 08 , 2025 | 12:08 AM
Ration items రేషన్ కార్డుదారులకు ఈ నెల కూడా కందిపప్పు కరువైంది. ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి నెలా రేషన్‌కార్డుదారులకు బ్యియం, కందిపప్పు, పంచదార, గోధుమ పిండి తదితర నిత్యావసర సరుకులను అందజేస్తోంది. కాగా కొన్ని నెలల నుంచి కేవలం బియ్యం, పంచదార మాత్రమే సరఫరా చేస్తోంది.
బియ్యం, పంచదారతో రేషన్ సరి
శ్రీకాకుళం అర్బన్, మార్చి 7(ఆంధ్రజ్యోతి): రేషన్ కార్డుదారులకు ఈ నెల కూడా కందిపప్పు కరువైంది. ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి నెలా రేషన్‌కార్డుదారులకు బ్యియం, కందిపప్పు, పంచదార, గోధుమ పిండి తదితర నిత్యావసర సరుకులను అందజేస్తోంది. కాగా కొన్ని నెలల నుంచి కేవలం బియ్యం, పంచదార మాత్రమే సరఫరా చేస్తోంది. కందిపప్పు ఒక్కో నెల కొంతమందికి కార్డుదారులకు మాత్రమే ఇస్తోంది. శ్రీకాకుళం అర్బన్, రూరల్ పరిధిలో ఉన్న మొత్తం 90 డిపోల్లోనూ 38 ఎండీయూ వాహనాల ద్వారా రేషన్‌సరుకులు పంపిణీ చేస్తున్నారు. కాగా ఈ నెల ఏ డిపో పరిధిలో కూడా కందిపప్పు పంపిణీ చేయలేదని కార్డుదారులు ఆవేదన చెందుతున్నారు. కొంతకాలంగా గోధుమపిండి సరఫరా కూడా నిలిపేశారని, ప్రస్తుతం బియ్యం, పంచదార మాత్రమే ఇస్తున్నారని పేర్కొంటున్నారు. ఐదు నెలల నుంచి కందిపప్పు కూడా సరఫరా చేయడం లేదని వాపోతున్నారు. మార్కెట్‌లో కందిపప్పు ధర ఎక్కువగా ఉందని, ప్రభుత్వం సబ్సిడీపై తమకు రేషన్ సరుకుల ద్వారా పంపిణీ చేస్తే కొంత ఊరట లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ప్రతినెలా నిత్యావసర సరకులు సక్రమంగా అందజేయాలని కోరుతున్నారు.
ఈ విషయమై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి టి.వేణుగోపాల్ వద్ద ప్రస్తావించగా.. ‘జిల్లాలో ఫిబ్రవరి నెల వరకు ఉన్న కందిపప్పును పంపిణీ చేశాం. ప్రతి నెలా జిల్లావ్యాప్తంగా సుమారు 650 టన్నుల కందిపప్పు పంపిణీ చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా టెండర్లు ఖరారు అవుతుండడంతో ఈ నెలలో కందిపప్పు పంపిణీ జరగలేదు. టెండర్లు ప్రక్రియ పూర్తయితే.. ఏప్రిల్ నుంచి జిల్లావ్యాప్తంగా రేషన్ డిపోల ద్వారా కందిపప్పు సరఫరా చేస్తామ’ని తెలిపారు.