Robbery: గోనెసంచులు ముసుగేసుకుని..
ABN , Publish Date - Feb 07 , 2025 | 11:46 PM
Thieves Robbery నరసన్నపేట మండలం ఉర్లాంలోని బంగారం షాపులో గురువారం రాత్రి చోరీ జరిగింది. ముసుగు దొంగలు ఈ షాపు తాళాలు పగులగొట్టి.. వెండి, బంగారు ఆభరణాలు, నగదు అపహరించారు.

30 కేజీలు వెండి, 20గ్రాముల బంగారు నగల చోరీ
రూ.20వేల నగదు కూడా అపహరణ
నరసన్నపేట, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట మండలం ఉర్లాంలోని బంగారం షాపులో గురువారం రాత్రి చోరీ జరిగింది. ముసుగు దొంగలు ఈ షాపు తాళాలు పగులగొట్టి.. వెండి, బంగారు ఆభరణాలు, నగదు అపహరించారు. పోలీసుల వివరాల మేరకు.. ఉర్లాంలోని కలిశెట్టి అప్పలనాయుడుకు చెందిన అయ్యప్ప బంగారం దుకాణంలో గురువారం రాత్రి ఐదుగురు వ్యక్తులు గోనెసంచులు ముసుగు ధరించి చోరీకి పాల్పడ్డారు. తాళాలు పగులగొట్టి.. షట్టర్లు తెరిచి షాపులోకి ప్రవేశించారు. షాపులో ఉన్న సుమారు 30 కిలోల వెండి ఆభరణాలు, 20 గ్రాముల బంగారం ఆభరణాలతోపాటు రూ.20వేల నగదు దొంగిలించారు. శుక్రవారం ఉదయం షాపు తెరిచేందుకు వచ్చిన అప్పలన్నాయుడు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ జె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ దుర్గాప్రసాద్, పోలీసులు అక్కడకు చేరుకుని దుకాణాన్ని, సీసీ కెమెరాల పుటేజ్‌లను పరిశీలించారు. గోనెసంచులు ముసుగు ధరించి ఐదుగురు వ్యక్తులు ఈ చోరీలో పాల్గొన్నట్టు గుర్తించామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు. షాపులోని లాకర్‌లో బంగారం ఆభరణాలు భద్రపరచడంతో.. వాటిని తెరిచేందుకు దొంగలు తీవ్ర ప్రయత్నం చేశారన్నారు. అవి తెరచుకోకపోవడంతో భారీస్థాయిలో దొంగతనం తప్పిందని తెలిపారు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నామన్నారు. అలాగే శ్రీకాకుళం నుంచి వచ్చిన క్లూస్‌టీమ్ సభ్యులు కూడా షాపులో వేలిముద్రలను సేకరించారు. పాత నేరస్తులే ఈ చోరీ పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఉర్లాం జంక్షన్‌లోని వివిధ షాపులకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దొంగలు దిచక్రవాహనాలపై వచ్చారా? లేదా ఏదైనా ఫోర్‌వీల్ వాహనంపై వచ్చారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.